ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅందరం కలిసి అడ్డుకట్ట వేద్దాం..

4 గంటల క్రితం

Title
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 10:15 పూర్వాహ్నం | 10 నిమిషాల చదవడం

నీరు జీవనానికి ఆధారం.ప్రగతికి మూలం. జీవన గమనాన్ని పరిశీలిస్తే నదీ తీరాల్లోనే మానవ నాగరికత అభివృద్ధి చెందుతూ వస్తోంది.మానవుడి అత్యాశ,అభివృద్ధి పేరుతో చేస్తున్న వినాశకరమైన పనులు, గాలి,నీరు,వాయువు వంటి కాలుష్యాలతో ప్రకృతి వనరులకు విఘాతం వాటిల్లుతోంది.అకాల వర్షాలు,వరదలు,తుపాన్లు,ప్రకృతి విపత్తులు వంటివి చోటుచేసుకుంటున్నాయి.అకాల ముంపు సమస్యలూ సంభవిస్తున్నాయి.ఇటీవల మారిన పరిస్థితుల్లో ఆహ్లాదం కోసమో, ఆనందం కోసమో జలవనరుల అంచుల్లో సెల్ఫీలు,ఫొటోలు దిగటం పరిపాటిగా మారింది.అలాంటి సమయాల్లో ప్రమాదవశాత్తూ నీటిలో పడి మునిగిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.మునిగిపోవడం అనేది ఆకస్మికంగా,హఠాత్తుగా,దిగ్భ్రాంతికరంగా జరుగుతోంది.చనిపోతున్న ఆ క్షణం తన బిడ్డ పడే ఆవేదన తల్లిదండ్రుల మనసును ఎలా నలిపేస్తుందో చెప్పడం అసాధ్యం. పుట్టి పెరిగిన ఊరు నీటిలో మునిగిపోతుందనే బాధతో విడిచి వెళ్లలేక, అక్కడ ఉండలేక.. మునిగిపోతున్న ఇంటిని చూసి ఒక మనిషి పడే ఆవేదనా అంతకన్నా వర్ణనాతీతం...ప్రతిరోజూ, ప్రపంచంలో ఏదో ఒక మూల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.


జులై 25 ప్రపంచ ముంపు నివారణ దినం. ఇది ఒక ఉత్సవం కాదు, ప్రాణాలను కాపాడే ఒక అంతర్జాతీయ యుద్ధ ప్రకటన. గణాంకాల వెనుక దాగి ఉన్న కన్నీటి సంద్రం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ముంపు ఒక స్థానిక ప్రమాదం కాదు.. అది ఒక అంతర్జాతీయ ప్రజారోగ్య సంక్షోభం. భారతదేశంలో జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం, ప్రమాదవశాత్తూ జరిగే మరణాల్లో రోడ్డు ప్రమాదాల తర్వాత రెండోవ స్థానంలో ఉంది ముంపు మరణాలే. భారత్‌లో ఏటా సగటున 35 వేల నుండి 42 వేల మంది నీటిలో మునిగి మరణిస్తున్నారు. ఈ సంఖ్య దేశంలో అనేక అంటువ్యాధుల వల్ల చనిపోయే వారి కంటే ఎక్కువ. దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముంపు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటి వెనుక అజాగ్రత్త మాత్రమే కాదు. లోతైన ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముంపు మరణాలలో 90 శాతం పైగా అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లోనే జరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేద కుటుంబాల నిత్యజీవితం నీటితో ముడిపడి ఉండటం కూడా ముంపు మరణాలకు ప్రధాన కారణంగా ఉంది. అందుకే ఈ ఏడాది దీన్ని "ముంపును నివారించడానికి కలిసికట్టుగా అడుగు వేద్దాం" అనే థీమ్ తో నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ముంపు మరణాలను తగ్గించడానికి సమాజం, ప్రభుత్వాలు అందరూ ఏకం కావాలని, నీటి ప్రమాదాల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ఈత నేర్చుకోవడం, రక్షణ కవచాలు వాడటం ద్వారా ప్రమాదాలను అడ్డుకోవడం అనేది ప్రధానంగా ఉండాలని తెలిపింది.

mumpu 19.jpg

​పిల్లలు.. యువకులే ఎక్కువ..

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 3 లక్ష‍ల, 20 వేలమంది కంటే ఎక్కువ మంది నీటిలో మునిగి చనిపోతున్నారు. అంటే రోజుకు దాదాపు 870 మంది, గంటకు 34 మంది నీటి పాలవుతున్నారు. 1 నుండి 24 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యువకుల్లో సంభవించే అకాల మరణాలకు మొదటి పది కారణాలలో ఇది ఒకటిగా ఉంది. భారతదేశంలో దీని తీవ్రత మరీ ఎక్కువ. ఏటా దాదాపు 32 వేల మందికి పైగా భారతీయులు నీటిలో మునిగి మరణిస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది పల్లెల్లో చిన్న పిల్లలు, ఉపాధి కోసం వెళ్లే యువకులే కావడం బాధాకరం. ఈ మధ్య కాలంలో బీచ్‌లు, జలపాతాల వద్ద సెల్ఫీల పిచ్చి, సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రమాదకరమైన లోతుల్లోకి వెళ్లి, లేదా బండల అంచుల నుండి జారిపడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చిన్న పిల్లలకు కొన్ని అంగుళాల నీరు ఉన్న బకెట్ లేదా నీటి తొట్టి కూడా ప్రమాదకరమే. అమ్మ వంటగదిలోనో, నాన్న ఫోన్‌లోనో బిజీగా ఉన్న కొన్ని సెకన్ల వ్యవధిలోనే చిన్న పిల్లలు ఇంట్లోని బకెట్లలో బోర్లా పడి ఊపిరాడక చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. "ఎవరైనా మునిగిపోవచ్చు.. కానీ ఎవ్వరూ మునగకూడదు." నీరు జీవనధారం కావాలి.. కానీ మృత్యుద్వారం కాకూడదనే నినాదంతో జులై 25న ముంపు నివారణా దినం జరుపుతున్నారు. నీట మునిగి చనిపోతున్న వారిలో ఏడాది నుండి 24 ఏళ్ల మధ్యలో ఉండేవారి సంఖ్య ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

తాగునీటి కొరత.. ప్రమాదాలు..

అభివృద్ధి చెందుతుందని, ఆకాశమే హద్దని పాలకులు ప్రకటనలు చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పిల్లలు తాగునీటి కోసం, బట్టలు ఉతకడానికి బహిరంగ చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోతున్నారు. సరైన రవాణా సౌకర్యాలు లేని నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు నాసిరకం పడవలను ఆశ్రయించి మునిగిపోతున్నారు. నిధుల కొరత వల్ల ఈ పడవలకు కనీస భద్రతా ప్రమాణాలు ఉండవు. మత్స్యకారులు, నదీ గర్భాల నుండి ఇసుక తీసే కార్మికులు, పడవలు నడిపేవారు తమ జీవనోపాధి కోసం ప్రతిరోజూ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. తగిన భద్రతా పరికరాలు (లైఫ్ జాకెట్లు, రేడియో కమ్యూనికేషన్స్) కొనుగోలు చేయలేని పేదరికం వీరిని ముంజేతి మృత్యువుతో సహజీవనం చేసేలా చేస్తోంది. ప్రపంచంలో అత్యధిక ముంపు మరణాలు ఆసియా ఖండంలోనే జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో 1 నుండి 4 సంవత్సరాల వయస్సు గల పిల్లల మరణాలకు ప్రధాన కారణం ముంపు. దేశంలో వందలాది నదులు, కాలువలు, ప్రతి ఇంటి వెనుక ఉండే చెరువులే దీనికి కారణం. ఇక్కడ వర్షాకాలంలో మూడో వంతు భాగం నీటిలోనే ఉంటుంది. మన దేశంలో గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాకాలంలో వచ్చే వరదలు గ్రామాల పొలిమేరలను తుడిచి పెట్టేస్తుంటాయి. మరణాల సంఖ్యలో ఆసియా ముందుంటే, జనాభా నిష్పత్తి ప్రకారం సబ్-సహారన్ ఆఫ్రికాలో ఎక్కువ మరణాలు ఉన్నాయి. అక్కడ చాలా దేశాల్లో బహిరంగ బావులు, లోతైన గనులు నీటితో నిండి ఉంటాయి. పిల్లలు నీటిని తోడే క్రమంలో లోపలికి పడిపోతున్నారనేది ఒక నివేదిక. విక్టోరియా సరస్సు ప్రాంతంలో సరైన వాతావరణ హెచ్చరికలు లేకపోవడం వల్ల ఏటా వేలాది మంది మత్స్యకారులు మరణిస్తున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ నగరాలను కాంక్రీట్ జంగిల్‌గా మార్చింది. ఇది కొత్త రకమైన ముంపు సవాళ్లను విసురుతోంది.

హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో మురుగునీటి కాలువలు పాతబడిపోవడం, చెరువులు, వెట్‌లాండ్స్ ఆక్రమణలకు గురికావడం వల్ల స్వల్ప వర్షానికే రోడ్లు నదులుగా మారుతున్నాయి. వర్షం పడినప్పుడు రోడ్లపై నీరు నిలిచి, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్ కనిపించక కాలినడకన వెళ్లేవారు. ద్విచక్ర వాహనదారులు వాటిలో పడి, కొట్టుకుపోతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో (ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్) మేఘాల విస్ఫోటనం(క్లౌడ్ బరస్ట్ వల్ల) నిమిషాల వ్యవధిలోనే కొండ వాగులు ఉప్పొంగి పర్యాటకులు, స్థానికులు మేలుకునే లోపే నీటి ప్రవాహం వారిని ముంచేస్తోంది.

FAEN

గోదావరి గిరిజనుల్లో ముంపు భయం..

ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురిసే వర్షాలు ఒకవైపు, ఉప్పొంగి ప్రవహించే గోదావరి తల్లి ఉధృతి మరోవైపు. ఏజెన్సీ ప్రాంతాల్లోని కొండ కోనలను ముద్దాడుతూ సాగే గోదావరి అందాలు ఒకప్పుడు పర్యాటకులను పరవశింపజేసేవి. కానీ, అదే గోదావరి తీరంలో ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నేడు వేలాది గిరిజన, గిరిజనేతర కుటుంబాలకు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని పిలుచుకునే "పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు" నిర్మాణం మంచిదే అయినా దాని వెనుకున్న ముంపు సమస్య దశాబ్దాలుగా వేలాది మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఇది కేవలం ఒక ప్రాజెక్టు ముంపు సమస్య కాదు.. తరాల తరబడి అడవిని, నదిని నమ్ముకుని బతికిన మనుషులు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న కన్నీటి గాథ.

పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం (45.72 మీటర్ల) కు చేరినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో వందలాది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 41.15 మీటర్ల ఎత్తు కోసం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాసానికి ప్రాధాన్యత ఇవ్వకపోగా, డ్యామ్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలనే ప్రభుత్వాల ఆదుర్దాతో వేలమంది గిరిజనులు ముంపు భారినపడ్డారు. ప్రాజెక్టు ఇంకా పూర్తిగాక ముందే నీరు గిరిజన గ్రామాలను ముంచెత్తుతోంది. కాపర్ డ్యామ్, గైడ్ బండ్ల కారణంగా గోదావరి సహజ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. దీనివల్ల వరదలు వచ్చినప్పుడు నీరు వెనక్కి తన్ని, వందలాది గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి (ప్రస్తుత ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు), ఉమ్మడి తూర్పుగోదావరి (దేవీపట్నం, విఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాలు) పరిధిలో జీవనచిత్రం పూర్తిగా మారిపోయింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కాగితాలకే పరిమితం అయ్యింది. క్షేత్రస్థాయిలో పునరావాసం, పునరుద్ధరణ చట్టం 2013 ప్రకారం నిర్వాశితులకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు, భూమికి భూమి, జీవనోపాధి కల్పించలేదు. నిర్వాసితుల కోసం నిర్మించిన అనేక పునరావాస కాలనీలలో కనీస వసతులైన తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థలు అరకొరగానే ఉన్నాయి. కొండ కోనల్లో స్వేచ్ఛగా బతికిన గిరిజనులను కాంక్రీట్ ఇళ్లలో ఉంచడం వారి జీవనశైలికి నరకంగా మారింది. పోడు వ్యవసాయం, అడవి రొంపి, చేపల వేటపై ఆధారపడిన గిరిజనులకు మైదాన ప్రాంతాల్లో కాలనీలకు తరలించాక ఉపాధి కరువైంది. భూమికి భూమి ఇచ్చే ప్రక్రియలో తీవ్రమైన అలసత్వం కనిపిస్తోంది.

వర్షాకాలం వస్తే గిరిజనుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రతి ఏటా జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో గోదావరికి వరదలు రావడం సహజం. కానీ పోలవరం పనులు ప్రారంభమయ్యాక ఈ వరద భయం రెట్టింపు అయ్యింది. వరద నీరు రోడ్లపైకి రాగానే విఆర్ పురం, కూనవరం వంటి మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులు మూసుకుపోతాయి.

బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, విద్యుత్ లేక, అత్యవసర వైద్యం అందక గర్భిణులు, వృద్ధులు పడే అవస్థలు వర్ణనాతీతం. వరదలు రాగానే సర్వం కోల్పోయి, కేవలం కొన్ని దుస్తులు, వంట పాత్రలు పట్టుకుని గిరిజనులు సమీపంలో ఎత్తైన కొండలపైకి వెళ్లి, ప్లాస్టిక్ షీట్లతో గుడారాలు వేసుకుని నెలల తరబడి జీవిస్తున్నారు. పాములు, తేళ్లు, దోమల మధ్య వారి బతుకు నరకంగా ఉంటోంది. అడవి కేవలం ఉపాధి కాదు, అది వారి దైవం. వారి ఆచారాలు, సంప్రదాయాలు, వారి పూర్వీకుల సమాధులు అన్నీ ఆ ముంపు ప్రాంతాల్లోనే ఉన్నాయి. "మా భూమి పోయింది, మా అడవి పోయింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కొన్నిరోజులు వస్తాయి. కానీ మా తాతల నాటి సంస్కృతిని ఏ ప్యాకేజీ తిరిగి ఇస్తుంది?" అనేది అక్కడి గిరిజనుల ఆవేదన.

రాజకీయాలకు అతీతంగా, నిర్వాశి తులందరికీ ఒకేసారి పూర్తిస్థాయి పరిహారం అందేలా చూడాలి. 41.15 మీటర్ల పరిధిలోని వారికే కాకుండా 45.72 మీటర్ల లోపు ఉన్న ప్రతి ఒక్కరినీ ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. కేవలం ఇళ్లు ఇచ్చి వదిలేయకుండా, నిర్వాశితులైన యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి పరిశ్రమల్లో ఉద్యోగాలు లేదా ప్రత్యామ్నాయ స్వయం ఉపాధి మార్గాలు చూపాలి. పోలవరం ప్రాజెక్టు దేశంలోనే ఒక ఇంజనీరింగ్ అద్భుతం కావచ్చు. కానీ, లక్షలాది మంది కన్నీళ్లపై కట్టబడే ఏ అద్భుతమైనా పూర్తిస్థాయి విజయం సాధించలేదు. ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే కోస్తా, రాయలసీమ రైతాంగం ఈ ముంపు బాధితుల త్యాగాలను స్మరించుకోవాలి. ప్రగతి ఫలాలు అందరికీ సమానంగా అందాలన్నా, పోలవరం కల సాకారం కావాలన్నా నిర్వాశితుల సమస్యకు మానవీయ కోణంలో శాశ్వత పరిష్కారం చూపడమే ఏకైక మార్గం. ఏ ప్రాజెక్టు నిర్మించినా తొలి లబ్దిదారులు దానికింద భూములు కోల్పోయేవారే. కానీ ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడం లేదు. గ్రామాలకు గ్రామాలను ముంచేస్తున్నాయి. ముంపు నీళ్లు వచ్చిపడటంతో వెళ్లనివారు అనివార్యంగా గుండెల నిండా బాధను మోసుకుంటూ బయటకు వెళ్లిపోతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజల కోసం తమ సర్వస్వాన్ని కోల్పోయిన వారు బయటకు వెళుతుంటే.. ప్రాజెక్టు పేరుతో అక్కడ నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థలు మాత్రం కోట్లను వెనకేసుకుంటున్నాయి. ఆ కోట్ల రూపాయల మాటున గోదావరి గిరిజన బిడ్డల ఊపిరి ఉందనే విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి.

Gemini

పర్యావరణ ప్రభావం..

గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు ముంపు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. గ్లేసియర్లు (మంచు పర్వతాలు) కరిగిపోతుండటం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీనివల్ల తీరప్రాంత నగరాలు (ముంబై, కోల్‌కతా, ఢాకా, బ్యాంకాక్) భవిష్యత్తులో శాశ్వతంగా మునిగిపోయే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్ వంటి దేశాలలో తీరప్రాంత ప్రజలు 'వాతావరణ శరణార్థులుగా' మారుతున్నారు. తీవ్రమైన తుఫానులు సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుఫానుల తీవ్రత, సంఖ్య పెరిగింది. ఈ తుపానుల వల్ల వచ్చే 'స్టార్మ్ సర్జ్' (సముద్ర అలలు ఉప్పొంగి భూమిపైకి రావడం) వల్ల తీరప్రాంత గ్రామాలు క్షణాల్లో జలసమాధి అవుతున్నాయి.

భారతీయ బీచ్‌లలో జరిగే యువకుల ముంపు మరణాలలో 40 శాతం పైగా మద్యపానంతో ముడిపడి ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ముంపునకు గురవుతున్న వారిలో 80 శాతం పైగా పురుషులే ఉన్నారు. వృత్తిపరంగానూ (చేపల వేట, రవాణా) వారి మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని తేలింది.

నివారణా చర్యల్లో లోపాలు..

భారతదేశంలో విపత్తు నిర్వహణ బృందాలు పనిచేస్తున్నప్పటికీ, ముందస్తు నివారణా చర్యల్లో ఇంకా పెద్ద లోపాలు ఉన్నాయి. కాలువల పక్కన ఉండే రోడ్లపై జాగ్రత్తలు లేకపోవడంతో ఎక్కువ చోట్ల వాహనాలు అదుపుతప్పి నీటిలోకి దూసుకు వెళుండటంతో ఎక్కువమంది చనిపోతున్నారు. అలాగే పర్యాటక సమయంలో చట్టాల అమలులో నిర్వాహకులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు గోదావరి నదిపై పాపికొండల బోటింగ్, గోదావరి, కృష్ణా నదులపై లైఫ్ జాకెట్లు ధరించడం చట్టప్రకారం తప్పనిసరి. కానీ క్షేత్రస్థాయిలో పడవ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. తనిఖీలు చేసే ప్రభుత్వ యంత్రాంగాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. కొద్దిమంది లాభాపేక్ష, పర్యాటకుల ఆదుర్దాతో మరణాలను కొనితెచ్చుకుంటున్నారు. బోటు ఎక్కినప్పుడే తమకు లైఫ్ జాకెట్లు ఇవ్వాలని కోరడం లేదు. అదొక ఇబ్బందిగా పరిగణించే పరిస్థితులూ ఉన్నాయి. ఫొటోల పిచ్చితో వాటిని నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వేసుకోవాలనంటే మరోసారి తమ బోటు ఎక్కరనే ఉద్దేశంతో నిర్వాహకులు కూడా పట్టించుకోవడం లేదు. గతంలో దేవీపట్నం దగ్గర గోదావరిలో పడవ మునిగి 27 మంది చనిపోయిన సంఘటన ఇప్పటికీ కళ్ల ముందే తిరుగుతోంది.

China image

త్రీ గోర్జెస్ ప్రాజెక్ట్ అదో అద్భుతం..

చైనాలో అత్యంత పొడవైన నది అయిన యాంగ్జీ నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్) త్రీగోర్జెస్. మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 22,500 మెగావాట్లు. అమెరికాలోని ప్రసిద్ధ హూవర్ డ్యామ్ (Hoover Dam) కంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 181 మీటర్ల (594 అడుగులు) ఎత్తు, 2.3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిని నిర్మించడానికి 27.2 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మరియు 4,63,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. 1994 లో ప్రారంభమై, పూర్తిగా 2012 నాటికి అందుబాటులోకి వచ్చింది. యాంగ్జీ నది వల్ల చైనాలో గతంలో తీవ్రమైన వరదలు వచ్చి లక్షలాది మంది చనిపోయేవారు. ఈ డ్యామ్ నిర్మాణంలో వరద ముంపును తగ్గించారు. బొగ్గు వాడకాన్ని తగ్గించి, పర్యావరణానికి హాని చేయని గ్రీన్ ఎనర్జీని చైనాకు అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద వందలాది గ్రామాలు, పట్టణాలు మునిగిపోవడంతో దాదాపు 13 లక్షల మంది ప్రజలు అక్కడి ప్రభుత్వం తరలించింది. వారికి కల్పించాల్సిన సదుపాయాలన్నీ ముందుగానే కల్పించింది.

​మెరుగైన ఫలితాలు ఇస్తున్న చైనా స్పాంజ్ సిటీ

ముంపు నివారణకు ప్రపంచంలోని వివిధ దేశాలు అవలంబిస్తున్న పద్ధతులలో చైనా అత్యంత వినూత్నమైన ప్రయోగాలు చేస్తోంది. చైనా 'స్పాంజ్ సిటీస్'. సాధారణంగా నగరాల్లో సిమెంట్ రోడ్లు ఉండటం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకదు. చైనా దీనికి భిన్నంగా 2015లో 'స్పాంజ్ సిటీ' ప్రణాళికను తెచ్చింది. ఇవి నీటిని పీల్చుకునే ప్రత్యేకమైన పోరస్ కాంక్రీట్‌తో నిర్మిస్తారు. నగరాల మధ్యలో పెద్ద ఎత్తున అర్బన్ పార్కులు, చిత్తడి నేలలు, రూఫ్‌టాప్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తారు. దీంతో కురిసిన వర్షపు నీటిని ఈ నగరాలు స్పాంజ్ లాగా పీల్చుకుని, భూగర్భంలో నిల్వ చేస్తాయి. లేదా కాలుష్య రహితంగా నదుల్లోకి వదులుతాయి. దీనివల్ల నగరాల్లో వరద ముంపు పూర్తిగా తగ్గుతుంది. ఊహాన్, షెంజెన్ నగరాలు దీనికి చక్కని ఉదాహరణలు. అలాగే నెదర్లాండ్స్ మోడల్ కూడా ఇటీవల ముందుకు వచ్చింది. నెదర్లాండ్స్ లో ఎక్కువ భాగం సముద్ర మట్టం కంటే దిగువకు ఉంటుంది. వారు నదులకు అడ్డుగా ఎత్తైన గోడలు కట్టే సాంప్రదాయ పద్ధతిని పక్కన పెట్టి, "నదికి చోటివ్వడం" అనే విధానాన్ని తెచ్చారు. నదుల పక్కన ఉన్న ఖాళీ స్థలాలను మైదానాలుగా మార్చారు. తద్వారా వరద వచ్చినప్పుడు నీరు ఆ మైదానాల్లోకి విస్తరిస్తుంది.. కానీ నగరాలపైకి రాదు.

mumpu

రక్షణ చర్యలు కీలకం..

శ్రామిక మహిళల పిల్లల కోసం గ్రామీణ ప్రాంతాల్లో డే-కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తే, పిల్లలు నీటి గుంతల వైపు వెళ్లకుండా కాపాడవచ్చు. బంగ్లాదేశ్‌లో 'ఆంచల్' పేరుతో ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేశారు. అలాగే పాఠశాల వయస్సు పిల్లలకు ప్రాథమిక ఈత, నీటి రక్షణ నియమాలను నేర్పించడం. సాధారణ పౌరులకు సురక్షితమైన రెస్క్యూ పద్ధతులు, సిపిఆర్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా కొంతవరకూ మరణాలను నివారించవచ్చు. పడవ రవాణా, వినోద పర్యాటక రంగాల్లో కఠినమైన భద్రతా నిబంధనలు అమలుచేయడం. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, వరద తట్టుకునే మౌలిక వసతులు నిర్మించడం వంటి చర్యల ద్వారా ముంపు మరణాలను, నష్టాలను తగ్గించొచ్చు. భారతదేశం లాంటి దేశాలలో ఈతను కేవలం ఒక క్రీడగా చూస్తారు. కానీ, అది ఒక "జీవన రక్షణ నైపుణ్యం". ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈత నేర్చుకోవడం తప్పనిసరి. ఈత పరీక్ష పాస్ అయితేనే పై తరగతులకు పంపుతారు. భారతదేశంలో కూడా ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి ఈత నేర్పించేలా విద్యా విధానంలో మార్పులు తేవాలి. నగరాల్లో స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో ఉంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన చెరువులను ఎంపిక చేసి, శిక్షకుల పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వాలి. 'వాటర్ సేఫ్టీ' సిలబస్ పుస్తకాలలో నీటి భద్రతకు సంబంధించిన నియమాలను చేర్చాలి. నీటిలో మునిగిపోతున్న వారిని చూసినప్పుడు తామే స్వయంగా లోపలికి దూకకుండా, తాడు లేదా కర్రను ఎలా అందించాలో పిల్లలకు నేర్పించాలి. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ముంపు మరణాల డేటాను ఖచ్చితంగా నమోదు చేయాలి. లైఫ్ జాకెట్లు లేకుండా పడవలు నడిపే నిర్వాహకులపై, లైసెన్స్ లేని టూరిజం బోట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు, పంచాయతీలు) తమ బడ్జెట్‌లో కొంత భాగాన్ని ప్రమాదకరమైన నీటి వనరుల చుట్టూ రక్షణ చర్యలు చేపట్టడానికి కేటాయించాలి. "ప్రతి ప్రాణమూ అమూల్యమైనదే, ప్రతి ముంపు మరణమూ నివారించదగినదే." సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపినా.. మన ఇంటి పక్కన ఉన్న చెరువులో ఒక చిన్నారి పడి చనిపోతుంటే, అది మానవ వికాసానికే అవమానం.


టి.గీతావాణి

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9059494954

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్