సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచిట్టితల్లీ.. అతడిక నీ జోలికి రాడు...

01 అక్టోబర్, 2026

చిట్టితల్లీ.. అతడిక నీ జోలికి రాడు... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 06:31 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అమ్మ కొట్టిందని, నాన్న తిట్టాడని బుంగమూతి పెట్టి గారాలు పోయే చిన్నారులు తమపై జరిగిన లైంగిక దాడుల గురించి ఏమని చెబుతారు! అంతటి దారుణం వాళ్లను ఎంతలా భయభ్రాంతులకు గురిచేస్తుంది..! ఊహించడం కష్టం. కానీ పోక్సో కేసుల్లో చిన్నారులు న్యాయస్థానాల ముందు ఆ దారుణాలను చెప్పాలి. వాళ్లపై జరిగిన దాష్టీకాన్ని వెక్కి వెక్కి ఏడుస్తూ.. ఒక్కొక్కటిగా వివరించి చెబుతుంటే.. అమ్మానాన్నే కాదు.. మనసున్న మనుషులందరికీ గుండెలు చెరువులవుతాయి. అలా మూడేళ్ల క్రితం ఏడేళ్ల చిన్నారి తను అంకుల్ అని పిలిచే ఒకడు తనపై చేసిన లైంగిక నేరాన్ని కోర్టు ముందు బయటపెట్టింది. చెబుతూ చెబుతూ 'ఆ అంకుల్ ముసలివాడయ్యే వరకు జైల్లోనే పెట్టండి..' అని అడిగింది. ఆ పసిపిల్లకు అంతటి బాధను తెచ్చిపెట్టిన ఆ ప్రబుద్ధుడు నేరం రుజువై జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా సెప్టెంబరు 22న ఈ కేసు విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా న్యాయమూర్తి ఆ చిన్నారికి అందజేయమని వ్యక్తిగత లేఖ ఒకటి ఇచ్చారు. అందులో తను మొదటిసారి న్యాయస్థానంలో ఏమని అడిగిందో.. అది నెరవేర్చామని చెబుతూ భావోద్వేగంగా రాశారు. పోక్సో కేసుల్లో బిక్కుబిక్కుమంటూ అమ్మానాన్న చెయ్యి పట్టుకుని కోర్టు మెట్లు ఎక్కుతున్న ప్రతి చిన్నారికి ఆ సందేశం అందాలి.


'చిట్టితల్లీ.. నీ మాట కోర్టు విన్నది. అప్పుడు నువ్వు చెప్పినట్లే మేం చేశాం. ఆ అంకుల్ ముసలివాడయ్యేవరకు జైల్లోనే ఉంచమని నువ్వు అన్న మాటలను కోర్టు పట్టించుకుంది' అని చిన్నారికి న్యాయమూర్తి రాసిన సందేశాన్ని ఢిల్లీ హైకోర్టు తాజా విచారణలో ఉటంకించింది. నిందితుడు తనపై మోపబడిన యావజ్జీవ కారాగార శిక్షకు వ్యతిరేకంగా కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. ఆ పిల్ పై విచారించిన ఢిల్లీ హైకోర్టు శిక్షను నిలిపివేయాలన్న నిందితుడి అభ్యర్థనను తిరస్కరించింది. బాలిక కుటుంబానికి అందజేయాల్సిన పరిహారాన్ని వెంటనే అందించాలని కూడా ఆదేశించింది. తీర్పును వెలువరిస్తూ అదనపు సెషన్స్ జడ్జి రజనీ రంగ చిన్నారికి రాసిన సందేశాన్ని ప్రత్యేకంగా నమోదుచేసింది. ఆ లేఖ బాధితురాలికి గొప్ప ప్రోత్సాహ సందేశంగా అభివర్ణించింది. 2023 జులై 23న చిన్నారిపై ఈ దారుణం జరిగింది.

లేఖలో న్యాయమూర్తి రాసిన మాటలు..

‘మామ అని నువ్వు పిలిచే ఆ వ్యక్తి ఇక ఎప్పటికీ స్వేచ్ఛగా బయటకు రాలేడు'

  • కారాగారంలోనే అతను ముసలివాడయ్యే వరకు ఉంటాడు. అక్కడే చచ్చిపోతాడు.

  • ఇంకెప్పుడూ అతను నిన్ను బాధించడు. నీ చిట్టి చెల్లిని కూడా ఇబ్బందిపెట్టడు. మిమ్మల్నే కాదు.. ఏ చిన్నారిపై దారుణాన్ని చేయడు' అని చెబుతూ.. 'చిన్నారి ఎంతో ధైర్యంగా తనపై జరిగిన దాడిని బయటపెట్టింద'ని కొనియాడారు.

  • నువ్వు కోర్టుకు వచ్చావు. నీపై దాడి చేసిన వ్యక్తిని గుర్తించావు. నిజాన్ని బయటపెట్టావు.

  • నువ్వు ఎంతో ప్రేమగా 'మామా' అని పిలిచే వ్యక్తి నీపై దారుణాన్ని చేశాడు. ఆ నేరాన్ని నువ్వు దాయలేదు.. ఎంతో ధైర్యంగా చెప్పావు' అంటూ చిన్నారిని ప్రశంసిస్తూ - ‘చిట్టితల్లీ.. ఇక నువ్వు నీ జీవితాన్ని జీవించు. బడికి వెళ్లు. స్నేహితులను సంపాదించుకో. ఆడుకో.. కలలు కను. నీ ధైర్యాన్ని కోర్టు ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది' అన్నారు.

బాధితురాలికి న్యాయమూర్తి రాసిన ఈ సందేశం ఆ చిన్నారి మనోవేదనను తగ్గిస్తుందని చెప్పలేం. కానీ.. నేరం చేసిన వాడు ఎంత దగ్గరివాడైనా.. ఎంతటి బలవంతుడైనా.. ధైర్యంగా న్యాయస్థానం ముందు చెబితే వాళ్లకు శిక్ష పడుతుందన్న భరోసా తప్పక ఇస్తుంది. పోక్సో కేసుల్లో న్యాయస్థానాలు గతంలో కూడా ఇలాంటి వైఖరినే తీసుకున్నాయి. చిన్నారుల పట్ల చాలా సున్నితంగా వ్యవహరించాయి. బాలల హక్కులకు భంగం కలగకుండా నడుచుకున్నాయి.

2018లో సుప్రీంకోర్టు (అలఖ్ అలోక్ శ్రీవాత్సవ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా)

  • 8 నెలల పసిపాపపై జరిగిన దారుణానికి పోక్సో కేసు నమోదైంది. దానిమీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ పోక్సో కేసుల విచారణలో చైల్డ్ ప్రొటెక్షన్, సైకాలజికల్ రెస్పాన్స్ పై జడ్జిలకు ప్రత్యేక అవగాహన ఉండాలని చెప్పింది. ఈ కేసులను వేగంగా విచారించాలని, అనవసర వాయిదాలు ఇవ్వకూడదని, చిన్నారికి కోర్టులో అనుకూలమైన వాతావరణం కల్పించాలని ఆదేశించింది.

  • నిపున్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఇండియా (సుప్రీంకోర్టు 2018)కేసులో బాధిత చిన్నారి పేరు, గుర్తింపు బయటకు రాకుండా చూడాలి. ప్రత్యేక కోర్టు అనుమతి లేకుండా గుర్తింపును వెల్లడించకూడదు. బాధితురాలిని పదే పదే తన బాధను చెప్పే పరిస్థితిలోకి నెట్టేయకూడదు. మళ్లీ మళ్లీ తనను మానసిక వేదనకు గురిచేయకూడదు.

  • అటార్ని జనరల్ ఫర్ ఇండియా వర్సెస్ సతీష్ (సుప్రీంకోర్టు 2021)కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన సుప్రీంకోర్టు చట్టాన్ని సంకుచితం చేయొద్దని వ్యాఖ్యానించింది. చిన్నారికి చట్టం కల్పించే రక్షణ దెబ్బతినకూడదని స్పష్టం చేసింది. పోక్సో కేసుల్లో చిన్నారుల పట్ల న్యాయస్థానాలు వ్యవహరించాల్సిన విధివిధానాలను సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో తేటతెల్లం చేసింది. తాజా తీర్పుతో న్యాయం అంటే నిందితుడికి శిక్ష మాత్రమే కాదు.. బాధిత చిన్నారికి భరోసా కల్పించడం కూడా అని రుజువుచేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్