ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగబ్బిలాల రక్ష‍ణ కోసం అక్కడ టపాసులు కాల్చరు..

2 రోజుల క్రితం

గబ్బిలాల కోసం
దీపావళికి టపాకాయలు కాల్చరు.. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 06:21 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

గబ్బిలం.. చాలామంది దృష్టిలో చెడుకు నిదర్శనం. ఎక్కడో ఊరి చివర చెట్టుపై తలకిందులుగా వేలాడే ఆ పక్షిని చూసి అంధవిశ్వాసంతో భయపడేవారు చాలామందే ఉంటారు. కానీ, తమిళనాడులోని వివిధ గ్రామాల్లో గబ్బిలాల సంరక్షణ కోసం తరతరాలుగా కృషి చేయడం ఆసక్తికరం. పర్యావరణానికి హాని కలుగుతుందని, కాలుష్యం పెరుగుతుందని కొందరు దీపావళి రోజున టపాసులు కాల్చరు కదా! ఈ గ్రామాల ప్రజలు మాత్రం గబ్బిలాలకు ఇబ్బంది కలగకూడదని టపాసులు కాల్చరు. ఈ నియమాన్ని వారు ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారు.


​విల్లుపురం జిల్లా కాఝుపెరుంపక్కమ్ గ్రామంలోని మర్రిచెట్లు, చింతచెట్లపై వందలకొద్దీ గబ్బిలాలు నివసిస్తున్నాయి. గ్రామస్తులు వాటిని ఆప్యాయంగా చూసుకుంటారు. కొందరు ఆరాధిస్తే, మరికొందరు ఆహారం, నీళ్లు అందిస్తారు. గబ్బిలాల సంరక్షణలో భాగంగా దీపావళి రోజు టపాకాయలు కాల్చకూడదని నియమం పెట్టుకున్నారు. గబ్బిలాల వేట రాత్రిపూట మొదలవుతుంది. పండ్లు, పూల మకరందం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన ఈ పక్షులు తెల్లారేసరికి తమ నివాసాలకు చేరుకుంటాయి. పండ్లను తింటూ విత్తనాలను ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేస్తాయి. కొన్ని జాతులు పూల మకరందాన్ని సేకరిస్తూ పరాగసంపర్కానికి కూడా తోడ్పడతాయి. అడవుల పునరుత్పత్తిలో వీటి పాత్ర ఎంతో ఉంది. ఈ ప్రయాణాన్ని ఆసక్తిగా గమనించిన గ్రామస్తులు, ఆహారాన్ని సేకరించి సేదతీరే గబ్బిలాలకు తమవంతు సాయం చేయాలనుకున్నారు. చింతచెట్టుపైనే వాటికోసం ఆహారం, నీరు పెట్టడం మొదలుపెట్టారు. గ్రామంలోని పురుషులు చెట్లు ఎక్కి ఈ పని చేసేవారు. ఇదంతా మూడు తరాల ముందు జరిగిన విషయం. ఇప్పుడు ఆ పిల్లలు, వారి వారసులు కూడా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు, గబ్బిలాలకు హాని కలిగించకూడదని గ్రామపంచాయతీ తీర్మానించింది.


​కొల్లిడం సమీపంలోని పెరంబూర్ గ్రామంలోనూ ఇదే ఆచారం కనిపిస్తుంది. 'గబ్బిలాల తోపు' అని పిలిచే మర్రిచెట్టుపై వందలాది గబ్బిలాలు ఉంటాయి. వాటిని రక్షించేందుకు గ్రామస్తులు వందల ఏళ్లుగా దీపావళి రోజు టపాకాయలు కాల్చడం లేదు. తిరుచిరాపల్లి జిల్లాలోని తొప్పుపాట్టి, సాంపాట్టి గ్రామాల్లో కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నారు. ఈ ఆచారం గురించి సాంపాట్టి గ్రామస్తుడు ధన్‌రాజ్ ఇలా చెబుతున్నారు. ‘టపాకాయలు కాల్చడం వల్ల గబ్బిలాలు చాలా అసహనానికి గురవుతాయి. అందుకే మేం ఈ నియమం పెట్టుకున్నాం. ప్రకృతిని రక్షించే జీవులను రక్షించుకోవడం మన కర్తవ్యం’ అంటున్నారు. కట్పాడి సమీపంలోని కలపాట్టులో నివసిస్తున్న జి. సంపత్ తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘నాకు 12 ఏళ్ల వయసులో దీపావళి రోజు టపాకాయలు కాలుస్తుంటే మా నాన్న వద్దని చెప్పాడు. గ్రామంలోని చెట్లపై ఉన్న గబ్బిలాలు ఆ శబ్దాలకు ఇబ్బందిపడతాయని అన్నాడు. అప్పటి నుంచి నేను పండుగ రోజు టపాకాయలు కాల్చడం మానేశాను. మూడు తరాలుగా మేము దీన్ని పాటిస్తున్నాం’ అని చెప్పారు.

గబ్బిలాల సంరక్షణపై గ్రామస్తులు పాఠశాల విద్యార్థుల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాల గదుల్లో వాటి ప్రాధాన్యత గురించి పాఠాలు చెబుతున్నారు. వివిధ పాఠశాలల యాజమాన్యాల సహాయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఊరూరా ప్రచారాలు చేపడుతున్నారు. కోయంబత్తూరు సమీపంలోని కిట్టంపాళయం ప్రభుత్వ పాఠశాలలో 2012 నవంబరులో గబ్బిలాలు, పక్షుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 2,000 ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలాలు నివసించే ప్రాంతంలో 350 కుటుంబాలు దీపావళి టపాకాయలకు దూరంగా ఉండేందుకు అంగీకరించాయి.‘పక్షులను, జంతువులను ప్రేమించడం.. వాటికి హాని కలగకుండా సంరక్షించడమే పర్యావరణ పరిరక్షణ’ అని చాటి చెబుతున్న ఈ గ్రామస్తుల ఆచరణ ఎందరికో ఆదర్శనీయం!


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్