బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూతుళ్ల చదువు కోసం..

1 గంట క్రితం

db92510308crop4006cc-1788257242033-9797.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 05:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పిల్లల చదువులకు ఫీజు కట్టడం కోసం ఓ అమ్మ 47 ఏళ్ల వయసులో పరుగుపందెంలో పాల్గొంది. ఆమె పేరు రమాబాయి. తనేమీ అథ్లెట్ కాదు. ఇంతకుముందెప్పుడూ పరుగు పోటీల్లో పాల్గొనలేదు. అయినా పోటీలో పాల్గొని బహుమతి సొమ్ము అందుకుంది. ఇంత కష్టపడితే ఆ అమ్మకు వచ్చిన మొత్తం రూ.3 వేలు. తన పిల్లలకు పుస్తకాలు కొనటానికి ఆ సొమ్ము ఉపయోగపడుతుందని ఆమె సంతోషంగా చెబుతోంది. మహారాష్ట్ర బీడ్ జిల్లా అంబజోగైకి చెందిన రమాబాయి ఒక ప్రమాదంలో భర్తను కోల్పోయింది. ఆర్థిక సమస్యలు ఉన్నా తన ఇద్దరు కుమార్తెలను బాగా చదివించాలనుకుంది. అకాడెమీలో పిల్లలను చేర్పించి పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పిస్తోంది. అక్కడే తను కూడా వంటపనికి కుదిరింది. అప్పుడే 'అమృత్ దౌడ్ మారథాన్' పోటీలో నెగ్గిన వారికి రూ.3 వేలు నగదు బహుమతి ఇస్తారన్న ప్రకటన తనను అటు వైపు నడిపించింది. పోటీల్లో పాల్గొన్న వారు తన వయసులో రెండు వంతులకు తక్కువ వారే. అయినా వెనక్కి తగ్గలేదు. పోటీలో గెలిచి బహుమతితో పిల్లలకు పుస్తకాలు కొనాలని అనుకుంది.

చెప్పులు తీసి పట్టుకుని, చీర కుచ్చిళ్లు పైకి పెట్టుకుని, రాళ్లతో నిండిన రోడ్డు మీద రమాబాయి పరుగుపెట్టింది. ప్రేక్షకులు ఆమె లక్ష్యాన్ని చేరుకోగానే కేరింతలు కొడుతూ చప్పట్లు కొట్టారు. రమాబాయి పాల్గొన్న ఈ మారథాన్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన ఎంతోమంది ‘పిల్లల కోసం’ తల్లి చేసిన సాహసాన్ని వేయినోళ్ల ప్రశంసిస్తున్నారు. ఈ పోటీలో రమాబాయితో పాటు తన కూతురు పూజ కూడా పాల్గొంది. ఆమె రెండో స్థానంలో నిలిచింది. పోటీ తర్వాత పూజ మాట్లాడుతూ.. ‘అమ్మను పాల్గొనమని నేనే చెప్పాను. కానీ తను మొదటిస్థానంలో నిలుస్తుందని అసలు ఊహించలేదు’ అని చెప్పింది. పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటున్న పూజ పోలీస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఆమె చెల్లెలు బ్యాంకు ఉద్యోగానికి సిద్ధమవుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్