ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‌గ్రీన్‌ క్రాకర్స్‌ ఇలా గుర్తించాలి..!

08 నవంబర్, 2026

‌గ్రీన్‌ క్రాకర్స్‌ ఇలా గుర్తించాలి..! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 05:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

దీపావళి రోజు టపాసులు కాల్చడం వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరగకుండా ఉండేందుకు మార్కెట్లోకి గ్రీన్ క్రాకర్స్ (పర్యావరణహిత టపాసులు) వచ్చాయి. సంప్రదాయ టపాసులతో పోలిస్తే ఇవి తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. అయితే ప్రత్యేక రసాయన మిశ్రమాలతో తయారుచేసిన ఈ గ్రీన్ క్రాకర్స్ నిజంగానే కాలుష్యం లేని టపాసులా? వీటిని ఎలా గుర్తించాలి?

గ్రీన్ క్రాకర్స్‌ను భారత ప్రభుత్వ శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) పరిధిలోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఇఇఆర్ఐ) అభివృద్ధి చేసింది. టపాసుల నుంచి వెలువడే సూక్ష్మ ధూళి కణాలు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లను తగ్గించడం వీటి ప్రధాన లక్ష్యం. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సూక్ష్మ ధూళి కణాల ఉద్గారాలు కనీసం 30 శాతం తగ్గాలి లేదా ధూళి కణాలు 20 శాతం, వాయు కాలుష్య ఉద్గారాలు 10 శాతం తగ్గాలి. ఈ తగ్గింపును అదే తరహా సంప్రదాయ టపాసుతో పోల్చి లెక్కిస్తారు.

మూడు ప్రధాన రకాలు..

సిఎస్ఐఆర్, ఎన్ఇఇఆర్ఐ అభివృద్ధి చేసిన ప్రధాన రకాలు మూడు. వీటికి స్వాస్, స్టార్, సఫాల్ అనే పేర్లు పెట్టారు.

స్వాస్ టపాసును పేల్చినప్పుడు విడుదలయ్యే నీటి ఆవిరి ధూళి కణాలను అణచివేసి కాలుష్యాన్ని తగ్గిస్తుంది. స్టార్ టపాసులను సంప్రదాయ టపాసుల కంటే తక్కువ కాలుష్యం విడుదలయ్యేలా రూపొందించారు. సఫల్ టపాసుల్లో అల్యూమినియం వినియోగాన్ని తగ్గించారు. వీటిని కాల్చినప్పుడు ధూళి, ఇతర కాలుష్య ఉద్గారాలు తక్కువగా విడుదలవుతాయి.

సాధారణ బాణసంచాలో ఇంధనాలు, ఆక్సీకరణ కారకాలు, రంగుల కోసం లోహ లవణాలు, ఇతర రసాయనాలు ఉపయోగిస్తారు. వీటి దహనం వల్ల ధూళి, పొగ, వివిధ వాయువులు విడుదలవుతాయి. గ్రీన్ క్రాకర్స్‌లో రసాయనాల నిష్పత్తులను మార్చడంతోపాటు కొన్ని పదార్థాల వినియోగాన్ని తగ్గిస్తారు.

- బేరియం లవణాల వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించరు.

- కొన్ని ఫార్ములేషన్లలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వినియోగాన్ని తగ్గిస్తారు లేదా పూర్తిగా తొలగిస్తారు.

- అల్యూమినియం వినియోగాన్ని తగ్గించేందుకు జియోలైట్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు.

- ధూళి కణాలను అణచివేసేందుకు హైడ్రోజెల్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు.

గ్రీన్ క్రాకర్స్‌ను ఇలా గుర్తించాలి

మార్కెట్లో కనిపించే టపాసులన్నీ నిబంధనల ప్రకారం తయారైన గ్రీన్ క్రాకర్స్ కావు. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్యాకెట్‌పై సిఎస్ఐఆర్, ఎన్ఇఇఆర్ఐ నిర్దేశించిన గ్రీన్ క్రాకర్స్ గుర్తు ఉందో లేదో చూడాలి. తయారీదారు నమోదు, ఉత్పత్తి ధ్రువీకరణ వివరాలు, అవసరమైన క్యూఆర్ కోడ్‌ను తనిఖీ చేయాలి. తయారీదారు వివరాలు, అనుమతులు పరిశీలించాలి. అనధికార విక్రేతల దగ్గర కొనుగోలు చేయకూడదు. అయితే క్యూఆర్ కోడ్ ఉన్నంత మాత్రాన అది అసలైన గ్రీన్ క్రాకర్ అని నిర్ధారించలేం. 2025లో సిఎస్ఐఆర్, ఎన్ఇఇఆర్ఐ ఇచ్చిన వివరణ ప్రకారం క్యూఆర్ కోడ్‌ను సంస్థ జారీ చేయదు. తయారీదారులే రూపొందిస్తారు. కాబట్టి ఇతర ధ్రువీకరణ వివరాలనూ పరిశీలించాలి.

గ్రీన్ క్రాకర్స్ కూడా పొగ, ధూళి, శబ్దాన్ని విడుదల చేస్తాయి. ఇవి పూర్తిగా కాలుష్యరహితం కావు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కాల్చితే కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. మట్టి ప్రమిదలతో పాటు గ్రీన్ క్రాకర్స్‌ను కూడా పరిమితంగా ఉపయోగించుకుని ఈ దీపావళిని పర్యావరణహితంగా జరుపుకుందాం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్