గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆచి తూచి కొనాలి...

1 రోజు క్రితం

jeevana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 06:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

జీతం వచ్చే రోజు కంటే, నెలాఖరు ఎలా గడుస్తుందా అనే ఆందోళనే ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఎక్కువ. మార్కెట్‌కు వెళ్లిన ప్రతిసారీ ధరలు కొత్త షాక్ ఇస్తున్నాయి. కూరగాయల నుంచి పిల్లల చదువు వరకు, పెట్రోల్ నుంచి వైద్య ఖర్చుల వరకు అన్నీ భారమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆదాయం పెరగకపోయినా, ఖర్చు తగ్గించే అలవాట్లు పెరిగితే కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎంతో మేర మెరుగుపడుతుంది. ప్రతి కుటుంబం ఆచరించదగిన కొన్ని సులభమైన జాగ్రత్తలు ఇవి.


నెల ప్రారంభంలోనే కుటుంబ బడ్జెట్ తయారు చేసుకోవాలి. ఆదాయం ఎంత? తప్పనిసరి ఖర్చులు ఎంత? పొదుపు ఎంత? అనేది ముందే నిర్ణయించుకోవాలి. ఇంట్లో అందరికీ కనిపించే చోట ఈ నెల ఖర్చుల వివరాలు రాసే చిన్న బోర్డు ఉంచాలి. దాంతో ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారో కుటుంబ సభ్యులందరికీ తెలుస్తుంది. మార్కెట్‌కు వెళ్లే ముందు కొనాల్సిన వస్తువుల జాబితా తయారు చేసుకోవాలి. జాబితాలో లేని వస్తువులు కొనకూడదు. ఒక వస్తువు కోసం పదేపదే బయటకు వెళ్లకుండా, ఒకే ప్రయాణంలో అన్ని పనులు పూర్తయ్యేలా ప్రణాళిక వేసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఉంటే ఒకే వస్తువును ఇద్దరు కొనడం, అనవసర ప్రయాణాలు చేయడం వంటి ఖర్చులు తగ్గుతాయి.


దగ్గర దూరాలకు బైక్, కారు తీసుకెళ్లే బదులు నడిచి వెళ్లడం అలవాటు చేసుకోవాలి. రెండు మూడు కిలోమీటర్ల దూరాలకు సైకిల్ వాడితే పెట్రోల్ ఖర్చు తగ్గడమే కాదు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆన్‌లైన్‌లో ఒక్కో వస్తువును విడివిడిగా ఆర్డర్ చేయకుండా, అవసరమైన వాటిని ఒకేసారి తెప్పించుకుంటే డెలివరీ ఛార్జీలు తగ్గుతాయి. చిన్న అవసరాలకు ఇంటి పక్కనే దొరికే వస్తువులను ఆన్‌లైన్‌లో కొనడం కన్నా నడిచి వెళ్లి తెచ్చుకోవడం చవకగా ఉంటుంది.


కూరగాయలు వీలైనంత వరకు రైతు బజారులో లేదా నేరుగా రైతుల నుంచి కొనాలి. ఒకే కూరగాయల దుకాణంలో తరచూ కొనుగోలు చేస్తే మంచి సరుకు ఇవ్వడమే కాకుండా కొంత తగ్గింపు కూడా లభించే అవకాశం ఉంటుంది. సీజన్‌లో లభించే కూరగాయలు, పండ్లనే ఎక్కువగా కొనాలి. దూర ప్రాంతాలు లేదా విదేశాల నుంచి వచ్చే ఖరీదైన పండ్ల కంటే స్థానికంగా పండే జామ, అరటి, బొప్పాయి, మామిడి వంటి పండ్లను ఎంచుకోవడం మంచిది. అవి తాజాగా ఉండటంతో పాటు తక్కువ ధరకే లభిస్తాయి.


పోషకాహారం అంటే ఖరీదైన ఆహారం కాదని గుర్తుంచుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, పెసలు, శనగలు, అలసందలు, పల్లీలు, గుడ్లు, జామ, బొప్పాయి, అరటి వంటి తక్కువ ధరలో లభించే ఆహారాల్లోనే శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఖరీదైన ప్యాకెట్ ఆహారాలు, విదేశీ పండ్లు, శీతల పానీయాల కంటే స్థానికంగా లభించే తాజా ఆహారమే ఆరోగ్యానికీ, జేబుకూ మేలు చేస్తుంది. బయట తినే అలవాటును తగ్గించి ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహారాన్ని వృథా చేయకుండా మిగిలినదాన్ని మరో విధంగా ఉపయోగించుకోవాలి.


విద్యుత్, నీటి వినియోగంలో కూడా జాగ్రత్త అవసరం. అవసరం లేని లైట్లు, ఫ్యాన్లు, టీవీలు ఆఫ్ చేయాలి. నీటిని వృథా చేయకూడదు. వాడని ఓటీటీలు, మొబైల్ యాప్‌లు, ఇతర సబ్‌స్క్రిప్షన్‌లను రద్దు చేసుకోవాలి. "ఆఫర్ ఉంది" అనే కారణంతో కొనుగోలు చేయకుండా, నిజంగా అవసరం ఉన్నప్పుడే కొనాలి. అప్పు చేసి విలాస వస్తువులు కొనడం మానుకోవాలి. అప్పు అత్యవసర అవసరాలకే పరిమితం కావాలి.


పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ, పొదుపు విలువ నేర్పాలి. ప్రతి కోరిక వెంటనే తీర్చాల్సిన అవసరం లేదని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంటి వద్ద కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మిరప, టమాటా వంటి చిన్న కూరగాయల తోట పెంచుకుంటే రోజువారీ ఖర్చు కొంత తగ్గుతుంది. వీలైతే కుటుంబంలో ఒకరైనా అదనపు ఆదాయం వచ్చే చిన్న పని చేయాలి. ఆదాయం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని ముందుగా పొదుపుగా పక్కన పెట్టి, మిగిలిన డబ్బుతోనే నెలవారీ ఖర్చులు నిర్వహించడం అలవాటు చేసుకోవాలి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్