రాత్రివేళ ఢిల్లీలో మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకునేందుకు ఓ యువ కంటెంట్ క్రియేటర్ ఓ ప్రయోగం చేశాడు. ఈనెల 15న మహిళ వేషధారణలో స్కూటీపై రాత్రివేళ నగర వీధుల్లో సుమారు రెండు గంటలు తిరిగాడు. మహిళను పోలిన దుస్తులు, మేకప్ వేసుకుని, తల, ముఖాన్ని దుపట్టాతో కప్పుకున్నాడు. ‘ఢిల్లీలో రాత్రివేళ అమ్మాయిలు ఎంత సురక్షితంగా ఉంటారో మీకు చూపిస్తాను’ అంటూ రోడ్డుపైకి వచ్చాడు. అతడితోపాటు ఉన్న మిత్రులు మొత్తం ప్రయాణాన్ని వీడియో తీశారు.
పలువురి వెంబడింపు
ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పలువురు అతడిని తదేకంగా చూడటం మొదలుపెట్టారు. పెట్రోల్ బంక్ వద్ద ఆగినప్పుడు కూడా కొందరు అతడినే చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు వెంబడిస్తూ స్కూటీకి దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించారు. మరోచోట ఓ వ్యక్తి అతడి వద్దకు వచ్చి మాట్లాడాడు. ప్రయాణం కొనసాగుతుండగా కొంతమంది ఆటోడ్రైవర్లు వెంబడించారు. తమ వాహనాలను స్కూటీకి అడ్డంగా తీసుకొచ్చారు. వారిలో ఒకరు తన మిత్రులు వీడియో తీస్తున్నారని గమనించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరో ఆటోడ్రైవర్ మాత్రం పదేపదే అతడి వైపు వాహనాన్ని నడుపుతూ వచ్చాడు. కొంతసేపటి తర్వాత అతడూ వెళ్లిపోయాడు. కార్లలో వెళ్తున్న కొందరు సైతం పక్కకు ఆపి మరీ అతడిని కొంతదూరం వెంబడించారు. సైకిళ్లు, బైకులు, ఆటోలు, కార్లపై వెళ్తున్న పలువురు తనను అనుసరించేందుకు ప్రయత్నించారని క్రియేటర్ తెలిపాడు. వరుస ఘటనలతో భయపడిన అతడు చివరకు ‘ఇది చాలా భయాన్ని కలిగించే ప్రయాణంగా మారింది. ఈ ప్రయోగాన్ని ఇక ఆపేస్తాను’ అన్నాడు. అప్పటికి అతడి ప్రయాణం రెండు గంటల పాటు సాగింది. తర్వాత తన అనుభవాన్ని వివరిస్తూ ‘సైకిల్, బైక్, ఆటో, కారు... అందరూ నన్ను వెంబడించడానికి ప్రయత్నించారు’ అని చెప్పాడు. ‘రాత్రివేళ అమ్మాయిలు ఒంటరిగా బయటకు వెళ్లడం ఎంత ప్రమాదకరంగా మారిందో తెలిసొచ్చింది. నిజంగా అమ్మాయిల జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి’ అని పేర్కొన్నాడు.
వైరల్‌గా వీడియో
@bejaintle అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. రెండు రోజుల్లోనే 1.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో వైరల్ కావడంతో మహిళల భద్రతపై సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. ‘అమ్మాయి జీవితంలో పగటిపూట కూడా ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంది’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, ‘ప్రతి పురుషుడూ ఒకసారి అయినా మహిళగా ఇలాంటి అనుభవాన్ని పొందాలి’ అని మరొకరు పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)