పతకాలు అందుకున్న వారిలో కొంతమందికి చేతులు లేవు. ఇంకొంతమందికి కాళ్లు లేవు. మరికొంతమందికి కళ్లు కనిపించవు. చెవులు వినిపించవు. అయినా వాళ్లు విజయాలు సాధించారు. ప్రపంచవేదికపై సత్తా చాటారు. ఆసియా 2026 పారా క్రీడలు జపాన్ నగోయా పట్టణంలో అక్టోబరు 18 నుండి 24 వరకు నిర్వహించారు. అందులో గెలుపొందిన మన పారా క్రీడాకారులు 114 పతకాలతో దేశానికి తిరిగి వచ్చారు. వారు సాధించిన బంగారు, వెండి, కాంస్య పతకాల వెనుక పతకాలకు మించిన ఆత్మవిశ్వాసం, దృఢనమ్మకం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వైకల్యంతో అవమానాలు, అవహేళనలు ఎన్ని ఎదురైనా లక్ష్యం కోసం వాళ్లు వేసిన అడుగులు, దాటిన కన్నీటి సముద్రాలు ఈ రోజు అంతర్జాతీయ వేదికపై వాళ్లను విజేతలుగా నిలిపాయి. పారా క్రీడాకారులు సాధించిన ఈ విజయాలను 'ప్రత్యేకం'గా అభినందించాల్సిన సందర్భం ఇది..
శీతల్ దేవి... చేతుల్లేకుండా కాళ్లు, భుజాల సాయంతో ఆర్చరీలో రాణించిన కాశ్మీర్ అమ్మాయి. పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. కాళ్ల సాయంతో అలవోకగా చెట్లు ఎక్కడం శీతల్ బాల్యం నుండి సాధన చేసింది. ఆటల్లో భాగంగా ఇతర పిల్లలతో సమానంగా తను అలా చేసేది. అయితే తన అసాధారణ ప్రతిభ గురించి 2022 ఆసియా పారా క్రీడల్లోనే ప్రపంచానికి తెలిసింది. అంతకుముందు జమ్ము కాశ్మీర్ ఆర్మీ యూత్ క్యాంప్‌లో శీతల్ పాల్గొంది. అక్కడ ఆమె ఆటతీరు చూసి కోచ్‌లు ఆశ్చర్యపోయారు. తన ప్రతిభను ప్రపంచానికి చూపించాలనుకున్నారు. పోటీల్లో పాల్గొని రెండు చేతులు లేకుండా ఆర్చరీలో పాల్గొన్న మొట్టమొదటి యువతిగా చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలుపుకుంది. అప్పటి నుండి శీతల్ సాధించిన విజయాలు ప్రపంచంలోనే తనను మేటి క్రీడాకారిణిగా నిలిపాయి. అర్జున అవార్డు సాధించి ఎంతోమందిలో స్ఫూర్తి నింపింది. తాజా పోటీల్లో శీతల్ వ్యక్తిగతంగా, మిక్స్డ్ విభాగాల్లో కలిపి రెండు బంగారు పతకాలు సాధించింది.
పారా క్రీడలు ముగింపు కార్యక్రమంలో భారత త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని తమ విజయాలను ప్రపంచానికి చూపిన వారు నిషాద్ కుమార్, మోనా అగర్వాల్. హైజంప్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నిషాద్ ఈ క్రీడల్లో హైజంప్, లాంగ్‌జంప్ విభాగాల్లో పాల్గొని స్వర్ణాలు సాధించారు. బాల్యంలో జరిగిన ఓ ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోయిన నిషాద్ ఈ పోటీల్లో రెండు స్వర్ణాలు గెలిచి భారత పతకాల సంఖ్య పెరగడంలో కీలక పాత్ర పోషించారు. పారా షూటింగ్లో పాల్గొన్న మోనా అగర్వాల్ అనారోగ్యంతో వీల్‌ఛైర్‌కే పరిమితమైనా లక్ష్యం కోసం కఠిన సాధన చేసేవారు. పెళ్లై, ఇద్దరు పిల్లలు పుట్టాక మోనా పోటీల్లో పాల్గొంటున్నారు. కఠోర సాధన చేసి షూటింగ్ నైపుణ్యాలను మూడేళ్లల్లోనే ఒంటబట్టించుకున్నారు. 2024 పారిస్ ఒలింపిక్స్ ఆమె తొలి అంతర్జాతీయ ప్రదర్శన. తాజా పోటీల్లో మోనా బంగారు పతకం సాధించింది. చిన్నతనంలో చుట్టూ ఉన్న వారు ‘నీకేం చేతకాదు.. మూల కూర్చో’ అంటూ ఎగతాళి చేసేవారని, ఇప్పుడు వాళ్లే నా విజయాలను చూసి సంతోషిస్తున్నారని మోనా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
మన తెలుగు వాళ్లు.. కీర్తి పతాకాలు..
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రంగసింగిపాడుకు చెందిన వి. రమణికి దృష్టి లోపం ఉంది. వైకల్యంతో ఉన్నా క్రీడలపై మక్కువ పెంచుకుంది. క్రికెట్, అథ్లెటిక్స్‌లో రాణించాలనుకుంది. అయితే కెరీర్ పరంగా అథ్లెటిక్స్ వైపు అడుగులు వేసింది. ఈ పోటీల్లో పరుగు పందెంలో పాల్గొని కాంస్య పతకం సాధించింది. దృష్టి లోపం వల్ల పగలు మాత్రమే ఆటలు ఆడుకున్న రమణి, ఆ తరువాత పూర్తిగా చూపు కోల్పోయినా ఆటలను వదిలిపెట్టలేదు. ఆ పట్టుదల ఇప్పుడు ప్రపంచ వేదికపై సత్తా చాటేదిగా ఎదిగింది.
విశాఖపట్నం జిల్లాకు చెందిన రవి రొంగలి ఎత్తు 125 సెంటీమీటర్లు. వ్యవసాయ కూలీల కుటుంబంలో పుట్టిన అతను చిన్నప్పటి నుంచే వైకల్యం కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అందరూ వెక్కిరించిన ఆ వైకల్యాన్ని దాటి పారా క్రీడల్లో పాల్గొనడం ప్రారంభించాడు. 2014లో పారా బ్యాడ్మింటన్‌తో రవి క్రీడా ప్రయాణం మొదలైంది. తర్వాత అథ్లెటిక్స్‌పై దృష్టి పెట్టి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించాడు. అంతర్జాతీయ పోటీలకు వెళ్లే ఆర్థిక స్థోమత లేని కుటుంబం నుండి వచ్చిన రవి పోటీల కోసం ఉన్న కాస్త భూమిని కూడా అమ్ముకున్నాడు. వరుసగా పారా క్రీడల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నాడు. ఈ క్రీడల్లో షాట్‌పుట్ విభాగంలో పాల్గొని కాంస్యం సాధించాడు.
పారా స్విమ్మింగ్‌లో పతకం సాధించిన మన రాష్ట్రానికి చెందిన రవి కార్తీక్‌కు దృష్టి లోపం ఉంది. ఆ లోపాన్ని లెక్కచేయకుండా తాను స్విమ్మింగ్‌లో చేసిన కఠోర సాధన 18 ఏళ్లకే తనను ప్రపంచ వేదికపై విజేతగా నిలబెట్టింది. ఈ పోటీల్లో రజత పతకం సాధించాడు.
తెలంగాణ బిడ్డలు...
తెలంగాణకు చెందిన బానోతు అకీరానందన్ పరుగు పోటీలో పాల్గొని రజత పతకం సాధించాడు. బుద్ధి మాంద్యం ఉన్న అకీరా తండ్రి బస్ కండక్టర్, తల్లి గృహిణి. జంగాలపల్లి తండాకు చెందిన అకీరా సాధించిన ఈ విజయం ఆర్థిక కష్టాలను, వైకల్యాన్ని వెనక్కి నెట్టింది. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి అథ్లెట్ విభాగంలో పోటీపడి బంగారు పతకంతో తిరిగి వచ్చింది. బుద్ధి మాంద్యం ఉన్న దీప్తి బాల్యం ఆర్థిక ఇబ్బందులు, సామాజిక వివక్ష మధ్య చాలా దుర్భరంగా సాగింది. గ్రహణం రోజున పుట్టిందనే మూఢనమ్మకంతో సమాజం ఎంతో ఎగతాళి చేసింది. వేధింపులు భరించలేక ఎన్నో రోజులు వెక్కి వెక్కి ఏడ్చిందని ఒక ఇంటర్వ్యూలో దీప్తి అమ్మ చెబుతూ కళ్లనీళ్ల పర్యంతమైంది. రోజువారీ కూలిపనులు చేసుకునే దీప్తి తల్లిదండ్రులు తనను ఈ స్థాయిలో నిలబెట్టడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. 2023 నుండి పారా క్రీడల్లో సత్తా చాటుతున్న దీప్తిని చూసి తనను వెక్కిరించిన సమాజమే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తోంది.ఈ పోటీల్లో వందకు పైగా పతకాలు సాధించిన భారత క్రీడాకారులే కాదు.. వైకల్యం, ఆర్థిక సమస్యలు, అవమానాలు, వేధింపులు ఎన్నింటినో తట్టుకుని అంతర్జాతీయ వేదికపై గర్వంగా నిలబడ్డ ప్రతి క్రీడాకారుడు, క్రీడాకారిణి ఎందరికో స్ఫూర్తిమంతులు..
హాంగ్జౌ ఆసియా పారా క్రీడల్లో (2023) భారత్ 108 పతకాలు సాధించింది. మూడేళ్లు తిరిగేసరికి ఆ సంఖ్య 114కు చేరింది. పాల్గొన్న 168 మంది క్రీడాకారుల్లో 65 పతకాలు అథ్లెటిక్స్ విభాగం నుండి వచ్చాయి. పారా బ్యాడ్మింటన్ నుండి 16, పారా స్విమ్మింగ్ నుండి 11, పారా ఆర్చరీ నుండి 6, పారా షూటింగ్ నుండి 5 పతకాలు వరుసగా సాధించారు.








కామెంట్లు (0)