గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తమ భూభాగం అమ్మకానికి లేదు : గ్రీన్‌ల్యాండ్‌ ప్రధాని

4 గంటల క్రితం

PM Nielsen
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 12:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కోపెన్‌హాగన్‌ : గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న అమెరికా అధ్యక్ష‍ుడు ట్రంప్‌ ప్రకటనపై ఆ దేశ ప్రధాని జెన్స్‌ -ఫ్రెడరిక్‌ నీల్సన్‌ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌ల్యాండ్‌ అమ్మకానికి లేదని, తమ దేశ ప్రాదేశిక సమగ్రతను, స్వీయ నిర్ణయాధికారాన్ని ట్రంప్‌ గౌరవించాలని స్పష్టం చేశారు. గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణను ట్రంప్‌ పునరుద్ధరించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌ల్యాండ్‌ అమ్మకానికి కాదని, ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ చట్టం, స్వీయ నిర్ణయాధికారం పట్ల గౌరవం ఉండాలని నీల్సన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ భవిష్యత్తును తామే అంటే గ్రీన్‌ల్యాండ్‌ ప్రజలే నిర్ణయిస్తారని, ఇతరులు కాదని అన్నారు. తమ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనుకునే లేదా నియంత్రించాలనుకునే వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని స్పష్టం చేశారు. గ్రీన్‌ల్యాండ్‌ అమ్మకానికి లేదని, తమ భూభాగంలోని ప్రతి భాగాన్ని తాము కాపాడుకుంటామని డానిష్‌ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్‌ కూడా పునరుద్ఘాటించారు. మిత్ర దేశాలు సహా ప్రతి ఒక్కరూ గ్రీన్‌ల్యాండ్‌ ప్రజల స్వీయ నిర్ణయాధికారాన్ని గౌరవించాలని తాము భావిస్తున్నామని అన్నారు.


గ్రీన్‌ల్యాండ్‌ అమెరికాకు చాలా ముఖ్యమని, డెన్మార్క్‌కు కాదని ట్రంప్‌ బుధవారం పునరుద్ఘాటించారు. ఆ భూభాగం ప్రస్తుత పరిస్థితి ఒక పెద్ద సమస్య అని, కేవలం అమెరికా రక్ష‍ణ కోసమే కాదని, ప్రపంచ రక్ష‍ణ కోసం అమెరికాకు గ్రీన్‌ల్యాండ్‌ అవసరమని ఆయన పేర్కొన్నారు. గతంలో జర్మనీ డెన్మార్క్‌ను ఆక్రమించిన తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమించుకున్న అమెరికా దాని నియంత్రణను ‘తెలివితక్కువ’గా డెన్మార్క్‌కు తిరిగి ఇచ్చిందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికా ఉనికిని విస్తరింపచేసేందుకు తాను ట్రంప్‌కు అనేక ప్రాధాన్యతలను సిఫారసు చేసినట్లు అమెరికా ప్రత్యేక రాయబారి జెఫ్‌ లాండ్రీ మంగళవారం ప్రకటించారు. ఆయన మేనెలలో గ్రీన్‌ల్యాండ్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. అమెరికా, గ్రీన్‌ల్యాండ్‌ మధ్య ప్రత్యక్ష‍ సముద్ర మార్గాలను ఏర్పాటు చేయడం, ఆ భూభాగంలో అమెరికా దౌత్య ఉనికిని విస్తరింపచేయడం, అమెరికా సైనిక ఉనికిని బలోపేతం చేయడం, ఉమ్మడి అమెరికా-గ్రీన్‌ల్యాండ్‌ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయడం వంటి సిఫారసులను సూచించినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్