- బీహార్‌లో న్యూఇయర్ వేడుకల్లో కాల్పుల కేసు
- రూ. 25 లక్షల జరిమానా
న్యూఢిల్లీ : న్యూఇయర్ వేడుకల్లో కాల్పులు జరిపి ఒక మహిళను హత్య చేసిన కేసులో బీహార్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యేకు ఢిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 25 లక్షల జరిమానా విధించింది. సుమారు తొమ్మిదేళ్ల క్రితం కేసులో న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జీ విశాల్ గోగ్నే శనివారం ఈ మేరకు తీర్పు వెల్లడించారు.
2018, డిసెంబరు 31న ఢిల్లీలోని ఫతేపూర్ బెరీలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో బిజెపి నాయకుడు, బీహార్‌లో సాహెబ్‌గంజ్ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే అయిన రాజు కుమార్ సింగ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పులతో అర్చనా గుప్తా ఒక మహిళ అక్కడికక్కకడే మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. "పండుగలు లేదా వేడుకల సమయంలో గాలిలోకి కాల్పులు జరపడం (సెలబ్రెటీ ఫైరింగ్) అనేది దేశానికి ఒక శాపంగా మారింది. ఇది మన దేశంలో తరచుగా ప్రాణనష్టానికి దారితీస్తోంది. ప్రస్తుత కేసు కూడా అటువంటి విషాద సంఘటననే ప్రతిబింబిస్తోంది. బీహార్‌కు చెందిన ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ ఈ కేసులో మొదటి నిందితుడు. ఇతను బాధ్యతారాహిత్యంగా జరిపిన కాల్పుల కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు" అని తీర్పులో వ్యాఖ్యానించింది. ఐపిసి సెక్షన్ 304 పార్ట్II కింద నాలుగేళ్ల సాధారణ జైలు శిక్ష, ఆయుధ చట్టం) కింద రెండు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే, బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షల పరిహారం కూడా చెల్లించాలని కూడా ఎమ్మెల్యేను ఆదేశించింది.








కామెంట్‌లు (0)