న్యూఢిల్లీ : విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన రక్తపోటు తగ్గడంతో పాటు మొత్తం బరువు 7.8కేజీలు తగ్టినట్లు వైద్యులు తెలిపారు. ఆదివారంతో ఆయన చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష 15వ రోజుకి చేరుకుంది. నీట్, సహా ఇతర పరీక్షల ప్రశ్నా ప్రతాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరసన ఆదివారం నాటికి 23వ రోజుకి చేరుకుంది. ప్రస్తుతం వాంగ్‌చుక్ రక్తపోటు 104/66 ఎంఎం హెచ్‌జికి పడిపోయిందని వైద్యులు వెల్లడించారు. నిరాహార దీక్ష ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మొత్తం 7.8 కిలోల బరువుతగ్గారని పేర్కొన్నారు. తాను "ఆధునిక గాంధీ"ని లేదా ఒక హీరోని కాదని, కేవలం "సాధారణ పౌరుడిని" మాత్రమేనని సోనమ్ వాంగ్ చుక్ శనివారం సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇతరులలో హీరో కోసం వెతకవద్దని, ఎవరి జీవితానికి వారే హీరోగా నిలవాలని అన్నారు. ఒక పౌరుడిగా మీ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు.
సిజెపి నిరసనకు సంఘీభావం తెలపనున్న పలువురు రాజకీయ నేతుల, ఆర్థిక వేత్తలు
సిజెపి నిరసనకు సంఘీభావం తెలిపేందుకు పలువురు రాజకీయ నేతలు, ఆర్థిక వేత్తలు నేడు జంతర్‌మంతర్‌కి చేరుకోనున్నట్లు సిజెపి వెల్లడించింది. కేరళ మాజీ మంత్రులు కె.కె. శైలజ, కె.ఎన్. బాలగోపాల్, పి. రాజీవ్ నిరసన ప్రాంతానికి చేరుకోనున్నారని సిజెపి తెలిపింది. అలాగే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) ఎంపీ పుష్పేంద్ర సరోజ్ కూడా సిజెపితో సమావేశం కానున్నారు. ఉపాధి సంక్షోభం, యువతపై దాని ప్రభావం అనే అంశాలపై దృష్టి సారిస్తూ ఆర్థికవేత్త జయతి ఘోష్ 'నిరుద్యోగానికి సంబంధించిన ఆర్థికాంశాలు' అనే అంశంపై బహిరంగ ఉపన్యాసం ఇవ్వనున్నారని, దీంతో నేటి కార్యక్రమాలు ముగుస్తాయని సిజెపి వివరించింది. సిపిఐ(ఎంఎల్) లిబరేషన్‌కు అనుబంధంగా ఉన్న 'ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్' (ఎఐఎస్ఎ) సభ్యులైన నేహా, మనీష్, దీపక్ కుమార్ వర్మ, అమీన్‌లు నిరసన స్థలంలోని ప్రత్యేక వేదికపై తమ నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. పరీక్షల అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం చెల్లించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిజెపి డిమాండ్ చేస్తోంది. జులై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజున పార్లమెంటుకు శాంతియుత పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించింది.








కామెంట్‌లు (0)