ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటు వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా శనివారం వెల్లడించారు. ఈ సమావేశాల్లో దేశానికి సంబంధిచిన కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. పార్లమెంటు ఉభయ సభల వర్షాకాల సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓడిపోవడం, బిజెపి అధికారంలోకి రావడం, టిఎంసికి చెందిన ఎంపిలు రెబల్స్‌గా మారడం, ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో మరోసారి చీలిక, ఆప్ ఎంపిలు బిజెపిలో చేరడం వంటి పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గతంలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం మరోసారి సభలో ప్రవేశపెట్టబోతుంది. వివాదాస్పదమైన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) జులై 17న తన నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అరెస్టయి వరుసగా 30 రోజులపాటు న్యాయస్థాన కస్టడీలో ఉంటే, వారు ఆటోమెటిక్‌గా పదవిని కోల్పోవాలనే నిబంధనను యథాతథంగా ఉంచే సూచనలు అందులో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రేరేపిత దర్యాప్తులు, అరెస్టులతో ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచే ప్రమాదం ఉందని ప్రతిపక్షం వాదిస్తోంది. మరోవైపు నీట్ పేపర్ లీక్ అంశంతోపాటు చమురు ధరల పెరుగుదల ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనున్నాయి.
20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 11:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)