సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఖమేనీ అంతిమయాత్రలో ప్రజాగ్రహం

3 గంటల క్రితం

iran
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 11:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరిక

- టెహ్రాన్‌‌లో పోటెత్తిన జనం

టెహ్రాన్‌ : ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర సందర్భంగా రాజధాని టెహ్రాన్‌ నగర వీధులు ప్రజా సందోహంతో కిక్కిరిసిపోయాయి. ఖమేనీ శవపేటికను చూస్తూ హాజరైన ప్రజానీకం కన్నీరుమున్నీరవుతున్నారు. . ఖమేనీని హత్య చేసిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ‌ట్రంప్‌‌పై ప్రతీకారం తప్పదని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూనూ తప్పించుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమేనీ అంతియాత్ర శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెహ్రాన్‌‌లో వరసగా మూడోరోజు ఇక్కడ కొనసాగింది. టెహ్రాన్‌‌లో ఇదే చివరి రోజు. దీంతో సోమవారం ఉదయం ప్రార్థనలు ప్రారంభం కావడానికి ముందే ప్రజలు పెద్ద ఎత్తున గ్రాండ్‌ మొసల్లాకు చేరుకున్నారు. అయితే, ఈ యాత్ర కోసం టెహ్రాన్‌‌కు వచ్చినవారు, ఇంకా స్వస్థలాలకు వెళ్లనేలేదు.

లక్షలాది మంది ప్రజలు రాత్రంతా మసీదులోనే ఉండిపోయారు. ఉదయం 8 గంటలకు జరిగే ప్రార్థన పఠనంలో పాల్గొనడానికి తెల్లవారుజామునకు చాలా ముందే అక్కడికి చేరుకున్నారు. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ రాజకీయ, సైనిక అగ్ర నాయకత్వం బహిరంగంగా తిరిగి కనిపించడంతో ప్రజలు మరింతగా ఉద్రికత్తభరితంగా మారారు. దీంతో అంత్యక్రియల ప్రార్థనలు దుఃఖాన్ని, ప్రతీకార పిలుపులను కలగలిపి ఒక రాజకీయ ప్రదర్శనను సృష్టించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహులను హతమార్చాలన్న నినాదాలు టెహ్రాన్‌లోని కిక్కిరిసిన గ్రాండ్ మొసల్లా ప్రార్థనా సముదాయంలో మారుమోగాయి. ఇరాన్ త్రివర్ణ పతాకాన్ని, ఖమేనీ ఫోటోలను చేతబట్టుకుని, ప్రజలు ప్రతీకారం కోరుతూ నినాదాలు చేశారు.

మనుషులను చంపగలరు. కానీ ఆదర్శాలను కాదు..

అమెరికా-ఇజ్రాయిల్‌ సేనల దాడులు మొదలైన తర్వాత ఇరాన్‌ రాజకీయ, సైనిక నాయకత్వం బహిరంగంగా కలిసి కనిపించడం ఇదే మొదటిసారి. 'మీరు మనుషులను చంపగలరు. కానీ ఆదర్శాలను కాదు' అని అర్మేనియాలోని ఇరాన్‌ రాయబారి ఖలీల్‌ షిర్ఘోలామీ అన్నారు. పాశ్యాత్య దేశాలకు నాగరికత, చరిత్ర, గౌరవం లేవని మండిపడ్డారు. శత్రువులపై పగ, ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మహమ్మద్‌ బఘేల్‌ జోల్గదర్‌ చెప్పారు. ఖోమ్‌కు చెందిన 97 ఏండ్ల మతగురువు నేతృత్వంలో ప్రార్థనలు జరిగాయి. యుద్ధోన్మాదానికి బలైన 14 నెలల ఖమేనీ మనుమరాలి శవపేటికను చూసి జనం భోరున విలపించారు. ఖమేనీ భౌతికకాయం ఉన్న శవపేటికతో పాటు ఆయన కుటుంబ సభ్యుల శవపేటికలను కూడా ఓ ట్రక్కుపై ఉంచారు. శవపేటికలను టెహ్రాన్‌ వీధుల మీదుగా మెహ్రాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలిస్తున్నారు. ఊరేగింపు సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున కవాతు జరిపారు. అమెరికా, బ్రిటన్‌ జాతీయ పతాకాలను దగ్ధం చేశారు. ట్రంప్‌, నెతన్యాహు ముఖాలపై తుపాకీ గురి పెట్టినట్లు చిత్రీకరించిన పోస్టర్లను ప్రదర్శించారు.

ప్రతీకారం తీర్చుకుంటాం : ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌

మాజీ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ సైనిక దళాల అధిపతి మేజర్‌ జనరల్‌ అమిర్‌ హతామీ చెప్పారు. 'నేరానికి పాల్పడిన వారు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతీకారేచ్ఛతో ఇరాన్‌, దాని ప్రజలు రగిలిపోతున్నారన్న విషయాన్ని గుర్తించాలి. వారిని వదిలే ప్రసక్తే లేదు. ఇది మా నిర్ణయం. ఫలితాన్ని సాధించే వరకూ విశ్రమించం' అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్