- ఎన్‌పిఆర్‌డి డిమాండ్
న్యూఢిల్లీ : జాతీయ ఆహార భద్రతా చట్టానికి (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) ప్రతిపాదిత సవరణను జాతీయ వికలాంగుల హక్కుల వేదిక (ఎన్‌పిఆర్‌డి) తీవ్రంగా వ్యతిరేకించింది. ఆహార హక్కును బలోపేతం చేయడానికి బదులుగా ఈ ప్రతిపాదిత సవరణ నిరుపేద కుటుంబాల హక్కును కుదిస్తోందని విమర్శించింది. వికలాంగులు వున్న కుటుంబాలు మందులు, పునరావాసం,సహాయక పరికరాలు, రవాణా వంటి విషయాల్లో ఇప్పటికే అదనపు భారాన్ని భరించాల్సి వుంటుందని, అటువంటి సమయంలో ఇటువంటి సవరణ వల్ల మరింత భారం ఆ కుటుంబాలపై పడుతుందని పేర్కొంది. ఇప్పటికే విద్య, ఉపాధి విషయాల్లో వున్న వివక్ష, అడ్డంకుల వల్ల సంపాదించే అవకాశాలు తగ్గిపోయాయని పేర్కొంది. చాలామంది కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మహిళలకు ఇటువంటి వారి సంరక్షణ బాధ్యత అదనంగా వుంటుందని, ఇటువంటి కుటుంబాల దీన స్థితిని కేవలం కుటుంబాల పరిమాణం ఆధారంగా అంచనా వేయలేమని పేర్కొంది. ఈ ప్రతిపాదిత సవరణ గౌరవంగా జీవించే రాజ్యాంగ హక్కుకు పూర్తి విరుద్ధంగా వుందని, పైగా వికలాంగుల హక్కుల చట్టానికి ప్రతికూలంగా వుందని పేర్కొంది. ఇటువంటి కుటుంబాలు భరించాల్సి వచ్చే వికలాంగ సంబంధిత వ్యయాలను అలాగే అదనపు పోషకాహార అవసరాలను గుర్తించడం ద్వారా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ చట్టాన్ని బలోపేతం చేయాలని ఎన్‌పిఆర్‌డి డిమాండ్ చేస్తోంది. అంత్యెదయ అన్న యోజన (ఎఎవై) కింద వికలాంగులు వున్న, అర్హత కలిగిన కుటుంబాలన్నింటికీ ప్రాధాన్యతా ప్రాతిపదికన ఈ పథక ప్రయోజనాలను వర్తింపచేయాలని కోరింది. తీవ్రమైన వైకల్యం వున్న వారికి ఇంటివద్దకే రేషన్ అందేలా చూడాలని కోరింది. ఎఎవై లబ్దిదారుల సంఖ్యపై గల పరిమితిని తొలగించాలని కోరింది.








కామెంట్‌లు (0)