- బాధ్యతారాహిత్యంగా కేంద్ర ప్రభుత్వం
- సిపిఎం రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్
- సోనమ్‌కు, సిజెపి ఆందోళనకు సిపిఎం, ఆప్, డిఎంకె నేతలు సంఘీభావం
- ప్రధాని మోడీకి అభిజీత్ దీప్కే లేఖ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : యువత వీధుల్లోకి రాకుండా ఈ దేశాన్ని కాపాడలేమని సిపిఎం రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బాధ్యతారహితంగా, సున్నితత్వం లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేేశంలోని విద్యా వ్యవస్థలోని వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు, అలాగే కాంక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో 15 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనకు సిపిఎం రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు ఆప్ ఎంపి సంజయ్ సింగ్, డిఎంకె నాయకుడు, తమిళనాడు మాజీ మంత్రి టి. మనో తంకరాజ్ కూడా సంఘీభావం తెలిపారు. సిజెపి ఆందోళనకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) తమ మద్దతును ప్రకటించింది. ఆందోళనకు తమ మద్దతును తెలియజేయడానికి ఎస్‌కెఎం ప్రతినిధి బృందం ఆదివారం జంతర్ మంతర్‌కు వెళ్తుంది. వాంగ్‌చుక్‌తో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న కొందరు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. నిరసనను విస్మరించడాన్ని వ్యతిరేకిస్తూ సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధానమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎ, ఎఐఎస్ఎఫ్ వంటి సంఘాలు కూడా ఈ నిరసనలో ముందు వరుసలో ఉన్నాయి.
యువత ప్రత్యేక హక్కులు కోరటం లేదు...
జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ ఈ ఆందోళనను స్వాగతిస్తూ, ‘‘ఈ రోజు ఇక్కడికి నేను ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మాత్రమే రాలేదు. దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలకు సంఘీభావం తెలిపే భారత పౌరుడిగా మీ ముందుకు వచ్చాను. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంది. రాజ్యాంగం మనకు కల్పించిన ఈ హక్కును గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత. శాంతియుతంగా తమ సమస్యలను తెలియజేస్తున్న విద్యార్థులను, నిరుద్యోగులను, యువత గొంతు వినడం ప్రభుత్వ బాధ్యత. నేడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. పోటీ పరీక్షలకు ఎన్నో సంవత్సరాలుగా సిద్ధమవుతున్నారు. కానీ పరీక్షల నిర్వహణలో లోపాలు, ప్రశ్నాపత్రాల లీకులు, నియామకాల్లో జాప్యం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో ఆలస్యం వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి’’ అని అన్నారు. ‘‘యువత కోరేది ప్రత్యేక హక్కులు కాదు. వారు కోరేది పారదర్శకమైన పరీక్షా విధానం, సమయానికి నియామకాలు, ప్రతిభకు తగిన గుర్తింపు, సమాన అవకాశాలు మాత్రమే’’ అని బ్రిట్టాస్ తెలిపారు.
ప్రధాని మోడీ గారు మౌనం వీడండి
సిజెపి ఆందోళనపై ప్రధాని నరేంద్ర మోడీ తన 'గాఢ మౌనాన్ని' వీడాలని, పరీక్ష పత్రాల లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను జవాబుదారీగా చేయాలని సిజెపి డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ప్రధాని మోడీకి ‘‘మీరు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనను ఇంకెంతకాలం నిర్లక్ష్యం చేస్తారు?” అనే శీర్షికతో కూడిన రెండు పేజీల బహిరంగ లేఖను సిజెపి నేతలు రాశారు. ఆ లేఖపై సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, వైష్ణవి గౌర్, ఆఫ్రీన్ నవాజ్, దీపక్ బలియన్, రత్న సింగ్, విజేతా దహియా సంతకం చేశారు. ‘‘జూన్ 20న ఆందోళనలు ప్రారంభమైనప్పటికీ ప్రధాన మంత్రి ఎందుకు స్పందించలేదు?. మేము గత 15 రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నాం. ఈ రోజు విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఏడో రోజు కొనసాగుతోంది. మీ ప్రభుత్వం మా గొంతులను ఇంకెంతకాలం విస్మరిస్తూ ఉంటుంది?" అని పేర్కొన్నారు. "కోట్లాది మంది యువ భారతీయుల విశ్వాసాన్ని, భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేసిన పరీక్ష పత్రాల లీకేజీలను అరికట్టడంలో మీ ప్రభుత్వం పదేపదే విఫలమవడం వల్లే మేము ఇక్కడ కూర్చున్నాము" అని పేర్కొన్నారు. నిరసన ప్రదేశంలో ఢిల్లీ పోలీసు సిబ్బంది విద్యార్థులపై దాడి చేసి, బురద రోడ్లపైకి పుస్తకాలను విసిరారని ఆరోపించారు. ఈ ఘటనలో ఛత్రపతి శివాజీ మహారాజ్, బి.ఆర్. అంబేద్కర్, భగత్ సింగ్‌ల పుస్తకాలను అపవిత్రం చేశారని తెలిపారు. ఇద్దరు ఢిల్లీ పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల చర్య ‘‘జ్ఞానం పట్లనే ధిక్కారాన్ని’’ ప్రతిబింబిస్తోందని విమర్శించారు. "మీ మౌనాన్ని వీడండి, దేశ భవిష్యత్తు పూర్తిగా కనుమరుగవక ముందే మా గొంతును వినండి, మీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను జవాబుదారీగా నిలబెట్టండి" అని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)