‘ఎపిక్’ తన బయోపిక్ కాదని, ‘90s’ వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా ఈ కథ ఉంటుందని దర్శకుడు ఆదిత్య హాసన్ తెలిపారు. ‘90s’లోని తమ్ముడి పాత్ర జీవితంలోని ఒక భాగం ఆధారంగా ‘ఎపిక్’ కథను రూపొందించినట్లు చెప్పారు. ఆ తర్వాత అన్న, అక్క పాత్రల జీవితాలను కూడా ప్రత్యేక కథలుగా చూపించే ఆలోచన ఉందన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. హైదరాబాద్ నుంచి యూకే వెళ్లిన ఓ యువకుడు అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడటం, చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేదే కథాంశమని ఆదిత్య తెలిపారు. తాను యూకేలో చదువుకున్న అనుభవంతో విదేశాల్లో విద్యార్థుల జీవితం, అక్కడి బంధాల నేపథ్యంలో ఈ కథను రూపొందించినట్లు చెప్పారు. ‘90s’ మాదిరిగానే ‘ఎపిక్’ కూడా సహజంగా ఉంటుందని పేర్కొన్నారు.
‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’కు కొనసాగింపుగా ‘ఎపిక్- ఫైనల్ సెమిస్టర్’ ఉంటుందని వెల్లడించారు. ఆనంద్‌ను హీరోగా తానే ఎంపిక చేసుకున్నానని, వైష్ణవి పేరును నిర్మాత నాగవంశీ సూచించారని తెలిపారు. ‘బేబీ’ జోడీ కావడంతో సినిమాకు హైప్ వచ్చిందన్నారు. చిన్నప్పటి నుంచి గోరటి వెంకన్నకు అభిమానినని, తన తొలి సినిమాలో ఆయన పాట ఉండాలనే ఉద్దేశంతో ‘సంచారమే’ పాటను రాయించి, పాడించినట్లు చెప్పారు. భవిష్యత్తులో విభిన్న జానర్లలో సినిమాలు చేస్తూ, వినోదంతో పాటు విలువలతో కూడిన చిత్రాలను అందించడమే తన లక్ష్యమని ఆదిత్య తెలిపారు.








కామెంట్‌లు (0)