- రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
- పాల్గొననున్న 20 వేల మంది..!
- ఎంఈఐఎల్ డైరెక్టర్ సుధా రెడ్డి వెల్లడి
ప్రజాశక్తి - హైదరాబాద్ : మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్, సామాజిక బాధ్యతను సమ్మిళితం చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘పింక్ పవర్ రన్ 3.0’ మూడో ఎడిషన్‌కు హైదరాబాద్ వేదిక సిద్ధమవుతోంది. సుధా రెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో ఈ అంతర్జాతీయ హాఫ్ మారథాన్ జరగనుంది. మహిళల ఆరోగ్యం, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మెగా రన్‌లో దాదాపు 20 వేల మందికి పైగా ఫిట్‌నెస్ ఔత్సాహికులు, అథ్లెట్లు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుధా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఎంఈఐఎల్ డైరెక్టర్ సుధా రెడ్డి, బ్రెస్ట్ ఆంకోసర్జన్ డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి, 2025 మిస్ వరల్డ్ ఒపల్ సుచతా చువాంగ్ తదితరులు పాల్గొని జెర్సీని, మెడల్స్‌ను ఆవిష్కరించారు.
అనంతరం సుధారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరుగు రోగాల రిస్క్‌ను తగ్గిస్తుందన్నారు. అవగాహన, సేవా కార్యక్రమాల ఖర్చుకు పరిమితి పెట్టుకోలేదని.. తాము ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఈసారి పోటీలను మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు మొత్తం రూ.75 లక్షల భారీ ప్రైజ్‌పూల్‌ను ప్రకటించామన్నారు. బలమైన, చురుకైన ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యకరమైన సమాజమే పునాది అని, మహిళల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సుధారెడ్డి పిలుపునిచ్చారు.ఏఐజీ హాస్పిటల్స్‌తో కలిసి ‘మైల్స్ ఫర్ మామోగ్రామ్స్’ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. రన్నర్లు పూర్తి చేసే ప్రతి 100 కిలోమీటర్ల దూరానికి ఒక ఉచిత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, మామోగ్రామ్ పరీక్షకు ఫౌండేషన్ నిధులు సమకూర్చనుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ ముందస్తు గుర్తింపుపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)