ముంబయి : ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు నానా పటేకర్ (75) గురువారం గోవాలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. తెల్లవారుజామున అస్వస్థతకు గురైన ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. సుమారు 45 నిమిషాలపాటు అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఉదయం 5.20 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతితో భారతీయ సినీ, రంగస్థల రంగాల్లో విషాదం నెలకొంది. నానా పటేకర్ అంత్యక్రియలను పుణె సమీపంలోని డోణ్జేలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లో గురువారం రాత్రి పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. విజయా మెహతా వంటి ప్రముఖుల నాటక బృందాలతో కలిసి నానా పనిచేశారు. 1978లో ‘గమన్’ చిత్రంతో వెండితెరకు పరిచయమై, వైవిధ్యమైన పాత్రలతో తనదైన ముద్ర వేశారు. మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న ఆయనకు 2013లో పద్మశ్రీ లభించింది. అవినీతిపై సిఎంను సైతం ఇంటర్వ్యూలో ప్రశ్నించి సమాజం పట్ల తనకున్న బాధ్యతను చాటుకున్నారు. 1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుడ్ - జంజీరాలో దినకర్ పటేకర్, సంజనాబాయ్ దంపతులకు జన్మించారు. రంగస్థల నటి, రచయిత్రి నీలకాంతిని 1978లో నానా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విడిగా ఉంటున్నా విడాకులు తీసుకోలేదు. వీరి కుమారుడు మల్హార్ చిత్ర నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు.
తరాలు గుర్తించుకునే నటుడు : ప్రధాని మోడీ
తరాలు గుర్తుంచుకునే పాత్రలతో నానా పటేకర్ అభిమానులను మెప్పించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన సంతాప సందేశంలో కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘నానా పటేకర్ ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ప్రదర్శించేవారు. తన భావాలను నిస్సంకోచంగా, స్పష్టంగా చెబుతూ ఎంతో మంది అభిమానాన్ని పొందారు. ఆయన మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు.’’ అని మోడీ తెలిపారు.
అసాధారణ నటుడు : ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్
‘ ఆయన అసాధారణ నటుడు. ఎంత కష్టమైన పాత్రలోనైనా సహజంగా నటించగలరు. భారత సైన్యంతో ఆయనకున్న అనుబంధం, దేశానికి చేసిన సేవ.. ఆయనలోని ప్రగాఢ దేశభక్తికి నిదర్శనం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.










కామెంట్‌లు (0)