గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగోదావరి–కావేరి అనుసంధానంతో దక్షిణాదికి మేలు

3 గంటల క్రితం

69626503-ba71-4f12-9706-fc6da4b4ba78.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 12:36 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

  • గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులివ్వండి

  • ప్రధాని మోడీకి సిఎం చంద్రబాబు వినతి

  • రాష్ట్ర సమస్యలపై పలువురు కేంద్ర మంత్రులకు వినతులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అపార ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్రం చొరవ, రాష్ట్రాల మధ్య సమన్వయంతో నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లడంతో దక్షిణాదిలో నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపొచ్చని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో గురువారం జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను సిఎం ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితి, గోదావరి–కావేరి అనుసంధానం, వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానితో చర్చించారు. దేశంలో రహదారుల నెట్‌వర్క్‌, విద్యుత్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేసిన తరహాలో నదుల అనుసంధానంతో ‘వాటర్‌ గ్రిడ్‌’ ఏర్పాటుకు మార్గం సుగమం చేయవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి–కావేరి అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యత పెరుగుతుందని వివరించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు మిగులు జలాలను తరలించడం ద్వారా వ్యవసాయ రంగంతోపాటు పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని ప్రధానికి చంద్రబాబు వివరించారు. పుష్కరాల సందర్భంగా చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర పనులకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహకారం అందించాలని కోరారు.

53 శాతం లోటు వర్షపాతం

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో 53 శాతం లోటు వర్షపాతం నమోదైందని ప్రధాన మంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. లోటు వర్షపాతం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. కేంద్ర సహకారంతో మదనపల్లె కేంద్రంగా ప్రారంభించిన గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ లక్ష్యాలను కూడా ప్రధానితో పంచుకున్నారు.

విశాఖ మెట్రోకు వినతి

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని సిఎం కోరారు. రాజధాని అమరావతిలో చేపడుతున్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు తదితర ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. విశాఖ బీచ్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా వివరించారు.

మోడీకి చంద్రబాబు శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సిఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించిన మోడీ సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఆయన అందించిన నాయకత్వం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దూరదృష్టి, స్పష్టమైన లక్ష్యం, దృఢమైన నిర్ణయాలు, సమర్థవంతమైన పాలనతో భారత్‌ను ప్రపంచ శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములుగా చేసుకుని ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యం వైపు దేశాన్ని నడిపిస్తున్నారని చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ గౌరవం, విశ్వసనీయత మరింత పెరిగేలా మోడీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాన మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగులో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర హోంమంత్రిని సిఎం కోరారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం గురించి దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించామని, దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చొరవ తీసుకోవాలని అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

పోర్టుల అభివృద్ధికి 20 వేల ఎకరాల ఉప్పు భూములివ్వండి

రాష్ట్రంలో పోర్టుల ఆధారిత పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సుమారు 20,378 వేల ఎకరాల ఉప్పు భూములను రాష్ట్రానికి బదలాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌తో జరిగిన భేటీలో సిఎం ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో పోర్టుల విస్తరణ, అనుబంధ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ భూములను వినియోగించుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మిర్చి, పొగాకు, ఆక్వా తదితర వాణిజ్య పంటల ఉత్పత్తుల ఎగుమతులకు అవసరమైన మార్కెట్‌ లింకేజీలు, మౌలిక వసతులు, నాణ్యత ప్రమాణాలు, ప్రాసెసింగ్‌ సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్రం సహకరించాలని కోరారు.

అమరావతి ఒఆర్ఆర్‌కు పూర్తి సహకారం అందించండి.. పోలవరం వద్ద ఐకానిక్ వంతెన ప్రాజెక్టు చేపట్టండి

ఎపి రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 189 కిలోమీటర్ల పొడవైన ఒఆర్ఆర్ రాజధాని ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకమవుతుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎడమ, కుడి గట్లను కలిపేలా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ప్రాజెక్టుకు అనుబంధంగా అవసరమైన రహదారి, వంతెనల నిర్మాణానికి సహకరించాలని కోరారు.

పోలవరం, జల్ జీవన్ మిషన్ పనులపై చర్చ

పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని, ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్‌‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సుదీర్ఘంగా పెండింగులో ఉన్న పలు అంశాలను పరిష్కారించాలని సిఎం కోరారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు అవసరమైన పునరావాసం, ఆర్అండ్ఆర్ పనులను త్వరితగతిన చేపడుతున్నట్టు కేంద్ర మంత్రికి తెలిపారు. అలాగే పోలవరం వద్ద 45.72 కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. చేపట్టాల్సిన పనులపైనా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్‌తో సిఎం చంద్రబాబు చర్చించారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్