ప్రస్తుత రోజుల్లో వయోభేదం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడి అనే చట్రంలో నలిగిపోతున్నారు. ఈ ఒత్తిడి వల్ల భయాందోళనలు, అనేక శారీరక, మానసిక రుగ్మతలతోపాటు సామాజిక భద్రతా భావాలు కూడా అనూహ్యంగా దెబ్బతింటున్నాయి. ఈ ఒత్తిడిలో గ్రేడింగ్ లేదా ర్యాంకింగ్ పరుగులో ఉన్న విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ నిరాశలో ఉన్న యువత కావచ్చు, పని ఒత్తిడితో ఉన్న ఉద్యోగులు కావచ్చు. కుటుంబాల్లో పెరుగుతున్న బాధ్యతలకు తగ్గట్టుగా పెరగని ఆదాయం వల్ల ఏర్పడే ఆర్థిక సమస్యలు కావచ్చు, వృద్ధాప్యంలో సహజంగా వచ్చే రుగ్మతలతోపాటు అనేక భయాలు కావచ్చు. ఈ కారణాలతోనే సమాజంలోని ప్రతి వర్గం ఒత్తిళ్ల బారిన పడుతోంది. ఒత్తిళ్ల వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.
ఒత్తిడి వివిధ రూపాల్లో...
* వృద్ధాప్యంలో రావాల్సిన షుగర్, బ్లడ్‌ప్రెషర్, గుండె జబ్బులు, చర్మవ్యాధులు, అజీర్ణ సమస్యలు చిన్న వయసులోనే వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
* చిన్న వయసులోనే మతిమరుపు లక్షణాలు కనిపిస్తాయి. దీనినే 'సూడో డిమెన్షియా' అని కూడా అంటారు.
* స్వల్ప విషయాలకే అసహనం, చికాకు, కోపోద్రిక్తత పెరుగుతాయి.
* మనిషికి మనిషికి మధ్య భావోద్వేగ సంబంధాలు తగ్గిపోతాయి.
* సహజసిద్ధమైన సృజనాత్మకత (క్రియేటివిటీ) కోల్పోతారు.
* చిన్న చిన్న కారణాలకే నిరాశ, నిస్పృహలకు గురవుతారు.
* మనసు నిరంతరం ఆందోళన, భయాందోళనలకు గురవుతుంది.
* సహజసిద్ధంగా వచ్చే నిద్రకు దూరమవుతారు.
* నరాల బలహీనతకు గురై, శ్రమను తట్టుకోలేని స్థితికి చేరుకుంటారు.
ఇలా ఒత్తిడి ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. వీటిని ఎదుర్కొంటూ జీవిత గమనాన్ని ఎలా సమతుల్యంగా నడపాలనేది మన చేతుల్లోనే ఉంది.
ఒత్తిడిని ఇలా జయించవచ్చు...
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
* సరైన ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి.
* సరైన సమయంలో నిద్రపోవాలి.
* నిద్ర కోసం ఎలాంటి మందులు వాడకూడదు.
* ఒకేసారి అనేక పనులు చేసే అలవాటుకు ఫుల్‌స్టాప్ పెట్టాలి.
* మనసును ఆహ్లాదపరిచే సంగీతాన్ని వినాలి.
* పుస్తక పఠనం, చిత్రలేఖనం, చదరంగం వంటి ఆటలకు సమయం కేటాయించాలి.
* తరచూ బంధువులు, స్నేహితులతో కలిసి భావోద్వేగాలను పంచుకోవాలి. అనుబంధాలను పెంపొందించుకోవాలి.
* మొబైల్‌కు కొంత సమయం దూరంగా ఉండాలి.
– అమరనాథ్ జగర్లపూడి
కౌన్సెలింగ్ సైకాలజిస్టు, కార్పొరేట్ ట్రైనర్
98495 45257








కామెంట్‌లు (0)