చెన్నై : భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఐసియులో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1931 డిసెంబర్ 12న రాజమహేంద్ర వరంలో జన్మించిన జానకి చిన్నతనంలోనే నాటకాల్లో నటించారు. 11 ఏళ్ల వయసులో రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. 1949లో ‘రక్షా రేఖ’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 1950లో విజయా సంస్థ నిర్మించిన ‘షావుకారు’ చిత్రంతో గుర్తింపు పొందారు. ఆ సినిమా పేరే ఆమె ఇంటిపేరుగా మారింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 380కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె మూడు హిందీ, ఒక మలయాళ చిత్రంలోనూ కనిపించారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ‘వద్దంటే డబ్బు’, ‘కన్యాశుల్కం’, ‘పిచ్చి పుల్లయ్య’, ‘రేచుక్క - పగటిచుక్క’, ‘రోజులు మారాయి’, ‘సొంతవూరు’, ‘జయం మనదే’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సంసారం ఒక చదరంగం’, ‘తోడికోడళ్లు’, ‘బాబు బంగారం’, ‘గీతాంజలి’ తదితర చిత్రాలు ఆమె నట ప్రస్థానంలో గుర్తుండిపోయాయి. చివరిసారిగా 2023లో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో నటించారు. సినీరంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. షావుకారు జానకి మరణంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సుదీర్ఘ నట ప్రస్థానంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ తరం ముగిసినట్టయింది. వైవిధ్యమైన పాత్రలు, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ఆమె వేసిన ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ప్రముఖుల సంతాపం
జానకి మృతి పట్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖలు సంతాపం ప్రకటించారు. విశిష్టమైన నటనతో తరతరాల ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న జానకి మరణ వార్తతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యానని తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో 70 సంవత్సరాలకు పైగా కొనసాగి, లెక్కలేనన్ని పాత్రలకు జీవం పోసిన ఆమె కళాత్మక సేవలు చిరస్మరణీయమన్నారు.
షావుకారు జానకి మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 400కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన షావుకారు జానకి భౌతికంగా మనకు దూరమైనా ఆమె నటించిన పాత్రల ద్వారా చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సంతాపాన్ని ప్రకటిస్తూ.. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న ఆమె కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారని గుర్తుచేసుకున్నారు. మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ తదితరులు సంతాపం తెలిపారు. జానకి కన్నుమూతపై మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. సినీ ప్రేక్షకుల హృదయాల్లో షావుకారు జానకి చెరగని ముద్ర వేశారని ఆయన కొనియాడారు.
జానకి సేవలు చిరస్మరణీయం : సిపిఎం
షావుకారు జానకి మృతి పట్ల సిపిఎం ప్రగాఢ సంతాపం తెలియజేసింది. తెలుగు సినీ రంగానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటనలో పేర్కొన్నారు.
సినీ పరిశ్రమలో విషాద ఛాయలు
షావుకారు జానకి మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైవిధ్యమైన పాత్రలకు సహజ నటనతో ప్రాణం పోసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటి జానకి అని చిరంజీవి పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, జానకితో తమ నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ‘పాండురంగ మహత్మ్యం’ నుంచి ఎన్టీఆర్ (ఎన్.ఏ.టి.) బ్యానర్ లోగోలో ఆమె ఫొటో పెట్టామని తెలిపారు. జానకితో కొన్ని దశాబ్దాల పాటు ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశామని, తనకు తల్లిగా కూడా పలు చిత్రాల్లో నటించారని నటుడు కమల్ హాసన్ గుర్తుచేసుకున్నారు. జానకిని ‘లెజెండ్’గా నటి రాధిక అభివర్ణించారు.







కామెంట్‌లు (0)