- అందుకోసమే నిబంధనలు బేఖాతరు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం(కెజిబివి)ల్లో భర్తీ చేసే నియామకాల ప్రక్రియను మంత్రి బంధువుకు అప్పగించే ప్రయత్నం జరుగుతునట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీస్(ఆప్కాస్) ద్వారా కాకుండా కెజిబివిలో టైప్-3, టైప్-4 లలో 1110 పోస్టుల నియామకాలు ప్రైవేట్ ఏజెన్సీకు అప్పగించేందుకు సమగ్రశిక్ష నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగుల జీతాలపై ఏజెన్సీకి 3శాతం కమీషన్ అప్పగించే ఈ టెండర్‌ను ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రి బంధువుకు అప్పగించేందుకు కసరత్తు చేస్తునట్లు తెలిసింది. మంత్రి బంధువుకు చెందిన కంపెనీకి అనుకూలంగా ఉండేందుకే టెండర్లలో నిబంధనలు విధించినట్లు సమాచారం. ఏజెన్సీ అనుభవం, సామర్ధ్యం, వార్షిక ఆదాయం, ఇప్పటికే చేసిన ప్రాజెక్టులు వంటి వాటిల్లో మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం ఐదు కేటగిరిల్లో 100మార్కులు కేటాయించింది. మ్యాన్ పవర్ అందించడంలో గరిష్టంగా 20 మార్కులు విధించడం 3-5 ఏళ్ల అనుభవం ఉంటే 10 మార్కులు, ఐదేళ్లు దాటితే 20 మార్కులు వస్తాయని తెలిపింది. మ్యాన్ పవర్ విస్తరణ 500లోపు ఉంటే 10 మార్కులు, 1000లోపు ఉంటే 15 మార్కులు, 1000దాటితే 20 మార్కులుగా పేర్కొంది. వార్షిక ఆదాయం రూ.30కోట్లు లోపు ఉంటే 10మార్కులు, రూ.30 కోట్ల నుంచి 35కోట్లు ఉంటే 15 మార్కులు, రూ.35కోట్లు దాటితే 20 మార్కులుగా షరతులు విధించింది. మ్యాన్ పవర్ అందించే చేసిన ప్రాజెక్టులను బట్టి మార్కులు కేటాయించింది. 5 ప్రాజెక్టులలోపు చేసి ఉంటే 10 మార్కులు, 5-10 ప్రాజెక్టులు చేసి ఉంటే 15 మార్కులు, 10 కంటే ఎక్కువ ప్రాజెక్టులు చేస్తే 20 మార్కులు ఉంటాయని పేర్కొంది. నియామక విధానం,వ్యూహారం, అటెండన్స్ విధానం, గ్రీవెన్స్‌ల పరిష్కారం వంటి వాటిల్లో అనుసరించిన విధానాల బట్టి మరో 20 మార్కులు ఉంటాయని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌లో విధించిన నిబంధనలు మొత్తం ఆ మంత్రి బంధువుకు చెందిన ఏజెన్సీకి అనుకూలంగా ఉనట్లు చెబుతున్నారు.







కామెంట్‌లు (0)