- మంత్రి గొట్టిపాటి రవి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ప్రాజెక్టులపై మాట్లాడే కనీసం హక్కు వైసిపికి ఆ పార్టీ నాయకులకు లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. వైసిపి పాలనలో ప్రాజెక్టులకు బ్రేకులు పడితే కూటమి ప్రభుత్వ హయాంలో అవే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని విమర్శించారు. ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు తగదని హితవు పలికారు. ఇరు ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు విరిగినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. ప్రజల నీటి అవసరాల కంటే వైసిపి ప్రభుత్వానికి ధన దాహమే ముఖ్యమైందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ వైసిపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని పేర్కొన్నారు. 70శాతం పనులు పూర్తయినప్పటికీ ఐదేళ్లలో ఒక్క శాతం పనిని కూడా ముందుకు తీసుకెళ్లలేదని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ నిర్లక్ష్య ధోరణి కొనసాగిందని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)