ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవైద్య శాస్ర్తంలో ముగ్గురికి నోబెల్

05 అక్టోబర్, 2026

nobel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 03:38 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఆప్టో జెనెటిక్స్‌‌ పనితీరుపై పరిశోధనలకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

స్టాక్‌‌హోం : మెదడులోని నాడీకణాలను వెలుతురుతో నియంత్రించే సింకేతికతను అభివృద్ధి చేసిన పరిశోధనకు 2026 సంవత్సరపు నోబెల్‌ వైద్యశాస్త్ర బహుమతి లభించింది. అమెరికాకు చెందిన కార్ల్‌ డైసెరోత్‌, జర్మనీకి చెందిన పీటర్‌ హెగెమన్‌, జార్జ్‌ నాగెల్‌లను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్‌ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది. కాంతితో నియంత్రించగల అయాన్‌ ఛానళ్లకు సంబంధించిన వారి ఆవిష్కరణలు, వాటి ఆధారంగా ఆప్టోజెనెటిక్స్‌ అనే కొత్త పరిశోధనా పద్ధతి అభివృద్ధికి చేసిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం ప్రకటించారు. ఈ సాంకేతికత ద్వారా జీవించి ఉన్న మెదడులో నిర్దిష్ట నాడీకణాలను వెలుతురుతో క్రియాశీలం చేయడం లేదా వాటి కార్యకలాపాలను అణచివేయడం సాధ్య మవుతుంది. మెదడు ఎలా పనిచేస్తుంది, జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయి, భావోద్వేగాలు, ప్రవర్తనలను ఏ నాడీ వలయాలు నియంత్రిస్తాయి వంటి కీలక ప్రశ్నలకు సమాధానాలు వెతికే పరిశోధనలో ఇది ఒక కీలక మలుపుగా నిలిచింది.

పీటర్‌ హెగెమాన్‌ కాంతిని జీవులు ఎలా గుర్తిస్తాయన్న ప్రాథమిక జీవశాస్త్ర ప్రశ్నను అనుసరించారు. జార్జ్‌ నాగెల్‌తో కలిసి కాంతికి స్పందించే చానల్‌రోడాప్సిన్‌ ప్రొటీన్‌ను గుర్తించి దాని పనితీరును వివరించారు. కార్ల్‌ డైసెరోత్‌ ఆ ప్రొటీన్‌ను నాడీకణాల్లో ఉపయోగించి, కాంతితో నాడీ కార్యకలాపాలను నియంత్రించే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ ముగ్గురి పరిశోధనలు వేర్వేరు దశల్లో సాగినా చివరకు ఒకే సాంకేతికతగా కలిశాయి. ఆల్గీ కాంతిని ఎలా గుర్తిస్తుందన్న ప్రాథమిక ప్రశ్న నుంచి ప్రారంభమైన పరిశోధన, జీవించి ఉన్న మెదడులో నిర్దిష్ట నాడీకణాలను వెలుతురుతో నియంత్రించే స్థాయికి చేరింది. అందుకే ఈ పురస్కారం ఒకే ప్రయోగానికి లభించిన గుర్తింపు కాకుండా, ప్రాథమిక జీవశాస్త్రం నుంచి నాడీశాస్త్రంలో విప్లవాత్మక సాంకేతికతగా ఎదిగిన మొత్తం పరిశోధనా ప్రయాణానికి లభించిన గౌరవంగా భావించవచ్చు. 2026 సంవత్సరపు వైద్యశాస్త్ర నోబెల్‌ బహుమతి విలువ 1.2 కోట్ల స్వీడిష్‌ క్రోనాలు. ప్రస్తుత మారకపు విలువ ప్రకారం ఇది భారత కరెన్సీలో సుమారు రూ.11.5 కోట్లు. ముగ్గురు విజేతలు సమానంగా పంచుకుంటే ఒక్కొక్కరికి సుమారు రూ.3.84 కోట్లు వస్తాయి. విజేతలకు నగదు బహుమతితో పాటు నోబెల్‌ పతకం, డిప్లొమా అందజేస్తారు. అధికారిక పురస్కార ప్రదానోత్సవం డిసెంబర్‌ 10న జరగనుంది. పీటర్‌ హెగెమాన్‌ క్లామిడోమోనాస్‌ అనే ఏకకణ ఆల్గీ జీవి కాంతి ఉన్న దిశను ఎలా గుర్తించి ఆ వైపు కదులుతుందన్న ప్రశ్నపై పరిశోధనలు ప్రారంభించారు. జార్జ్‌ నాగెల్‌తో కలిసి చేసిన పరిశోధనలో కాంతికి స్పందించే చానల్‌రోడాప్సిన్‌ అనే ప్రొటీన్‌ను గుర్తించారు. నీలి కాంతి పడినప్పుడు ఈ ప్రొటీన్‌లోని ఛానల్‌ తెరుచుకుని అయాన్లు కణంలోకి ప్రవేశించేలా చేస్తుంది. దాంతో కణంలో విద్యుత్‌ సంకేతం ఏర్పడుతుంది. ఈ ప్రొటీన్‌ను ఇతర కణాల్లోకి ప్రవేశపెట్టినా వాటిని కాంతికి స్పందించేలా చేయవచ్చని వారు చూపించారు. ఒక సాధారణ ఆల్గీ కాంతిని గుర్తించే విధానాన్ని అర్థం చేసుకోవాలన్న ప్రయత్నం, జీవకణాల కార్యకలాపాలను వెలుతురుతో నియంత్రించగల కొత్త శాస్త్రీయ అవకాశానికి పునాది వేసింది. ఈ ప్రాథమిక ఆవిష్కరణను నాడీశాస్త్రంలో ఉపయోగించిన ఘనత కార్ల్‌ డైసెరోత్‌కు దక్కింది. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేస్తున్న డైసెరోత్‌ చానల్‌రోడాప్సిన్‌కు సంబంధిం చిన జన్యువును నాడీకణాల్లోకి ప్రవేశపెట్టారు. నీలి కాంతిని ప్రసరించడం ద్వారా ఆ నాడీకణాల్లో విద్యుత్‌ సంకేతాలను ఉత్పత్తి చేయగలిగారు. 2005లో ఈ ఫలితాలను ప్రకటించారు. జీవించి ఉన్న ఎలుకల మెదడులో ఈ పద్ధతిని ఉపయోగిం చి నిర్దిష్ట నాడీకణాలను కాంతితో నియంత్రించవచ్చని చూపించారు. ఈ పద్ధతికే ఆప్టోజెనెటిక్స్‌ అనే పేరు వచ్చింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్