సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చైనా పర్యటనకు అజిత్ దోవల్

9 గంటల క్రితం

china
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 10:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సరిహద్దు సమస్యపై చర్చించే అవకాశం

న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదంపై స్పెషల్ రిప్రజెంటేటివ్‌ల (ఎస్‌ఆర్) మధ్య 25వ విడత చర్చల కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సోమవారం నాడు బీజింగ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ను సందర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా పొలిట్‌బ్యూరో సభ్యుడు, విదేశాంగ మంత్రి వాంగ్ యీతో దోవల్ మంగళవారం జరిపే చర్చల్లో విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై కూడా సమీక్ష జరగనుంది. సెప్టెంబర్ 12న భారత్ నిర్వహించనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు కొన్ని వారాల ముందే ఈ పర్యటన జరుగుతుండటం గమనార్హం. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే మూడు దశల ప్రక్రియలో మొదటి దశ 2005 ఒప్పందంతో ముగిసింది. అప్పటి నుంచి వివాదాన్ని పరిష్కరించేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్‌పై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. మ్యాప్‌లు, భూభాగంలో సరిహద్దును గుర్తించి, నిర్ధారించడం మూడో దశలో భాగం. 'సరిహద్దు గుర్తింపు'పై అభిప్రాయాల మార్పిడికి సంబంధించిన ఇటీవలి ప్రస్తావనలు, పూర్తి ఫ్రేమ్‌వర్క్‌పై ఒప్పందం కుదిరేలోపే కొన్ని ప్రాంతాల్లో 'ఎర్లీ హార్వెస్ట్' ఒప్పందాన్ని ఇరు దేశాలు పరిశీలిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఈ నెల ఆరంభంలోనే సిక్కింలోని నాథూ లా పాస్, ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని ఇరు దేశాలు పునఃప్రారంభించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్