శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికా దాడులు ఉధృతం

3 గంటల క్రితం

us attack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 12:42 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- మంచినీటి పంపులపై క్షిపణులతో దాడి.. నిలిచిపోయిన సరఫరా

- శాంతి ఒప్పందాన్ని రద్దు చేసిన ఇరాన్‌

- గల్ఫ్‌ దేశాల్లోని యుఎస్‌ ‌*సైనిక స్థావరాలపై ప్రతి దాడులు

టెహ్రాన్‌ /‌వాషింగ్టన్‌ : పశ్చిమాసియాలో అమెరికా దాడులను కొనసాగిస్తోంది. ఇరాన్‌ నగరాల్లోని జనావాసాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడుతుంది. శనివారం జాస్క్ కౌంటీలోని బుంజీ గ్రామంలోని మంచినీటి పంపులపై దాడి చేయటంతో ఇరవై గ్రామాల ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్కడి ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. సముద్రజలాల నుంచి నీటిని తోడే పంపింగ్ స్టేషన్, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడులను ఉగ్రవాద చర్యలని, ప్రతి దాడులు తప్పవని ఇరాన్‌ ‌హెచ్చరించింది. గత పది రోజుల్లో నైరుతి ఇరాన్‌లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో 95 ప్రాంతాలపై అమెరికా దాడులు చేసిందని భద్రతా వ్యవహారాల డిప్యూటీ గవర్నర్ వలియొల్లా హయాతి శనివారం తెలిపారు. ప్రావిన్స్‌లోని 12 జిల్లాలపై దాడులు జరిగాయని, ఇది అమెరికా దుర్మార్గాన్ని చాటుతోందన్నారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది పౌరులు మృతి చెందారని తెలిపారు. బుషెహర్ ప్రావిన్స్‌లోని దష్తి, చొగదక్ ప్రాంతాల్లోనూ దాడులు జరిగాయని, అయితే ప్రాణనష్టం లేదని అధికారి ఎహ్సాన్ జహానియన్ తెలిపారు. లారక్ ద్వీపంలోని మారిటైమ్ నావిగేషన్ కంట్రోల్ టవర్‌పై క్షిపణి దాడితో ద్వంసమైందని ఇరాన్‌ ‌ప్రభుత్వ మీడియా నివేదించింది.

ఇరాన్ ప్రతిదాడులు విస్తృతం

అమెరికా బలగాలకు ఆతిథ్యమిస్తున్న దేశాలు ‘‘తగిన ప్రతిస్పందన’’కు సిద్ధంగా ఉండాలని ఇరాన్ సైన్యం(ఐఆర్‌‌జిసి) హెచ్చరించింది. కువైట్‌లోని క్యాంప్ ఆరిఫ్జాన్ వద్ద అమెరికా సైనిక లాజిస్టిక్స్ కేంద్రంపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసి ప్రాణనష్టం కలిగించినట్టు, అలీ అల్ సలేమ్ వైమానిక స్థావరంలో రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ఆయుధ నిర్వహణ హ్యాంగర్, డ్రోన్ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్టు ఐఆర్‌‌జిసి పేర్కొంది. జోర్డాన్‌లోని అల్-అజ్రాక్ వద్ద అమెరికా స్థావరంపై క్షిపణి, డ్రోన్ దాడులతో రెండు యుద్ధ విమానాలను పూర్తిగా ధ్వంసం కాగా, మరికొన్నింటికి తీవ్ర నష్టం కలిగిందని ఐఆర్‌‌జిసి తెలిపింది. అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకోవాలని జోర్డాన్ సైన్యానికి ఇరాన్ పిలుపునిచ్చింది. బహ్రెయిన్‌లోని షేక్ ఇసా వైమానిక స్థావరంలో ఇంధన ట్యాంకులు, హ్యాంగర్లు, పార్కింగ్ ప్రాంతాలతో పాటు కొన్ని కమ్యూనికేషన్ వంతెనలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు ఇరాన్ సైన్యం ప్రకటించింది.

ఇంధన సరఫరాకు ముప్పు....

అమెరికా సైనిక, ఆర్థిక ఒత్తిళ్ల పర్యవసానాలు కేవలం అమెరికాకే కాక ఐరోపా దేశాలకు కూడా ఇంధన, ఆర్థిక రంగాల్లో వ్యాపిస్తాయని ఐఆర్‌‌జిసి చీఫ్ కమాండర్ ప్రతినిధి హమీద్ రెజా మొఘద్దమ్‌ఫర్ హెచ్చరించారు. హర్మూజ్‌ జలసంధి, బాబ్ అల్-మందెబ్ వ్యూహాత్మక మార్గాలు ప్రపంచ ఇంధనం, వాణిజ్యం, భద్రతా సమతుల్యతను ప్రభావితం చేయగలవని ఆయన పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితికి ఇరాన్ ఫిర్యాదు

జనావాసాలపై అమెరికా దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్‌‌కు ఇరాన్ శాశ్వత రాయబారి అమీర్-సయీద్ ఇరవానీ లేఖ రాశారు. ఓడరేవులు, రవాణా వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, రాడార్ స్థావరాలతో సహా పౌర జీవనానికి, ఆర్థిక వ్యవస్థకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యంగా చేసుకుందన్నారు. దాడుల వల్ల సంభవించిన మరణాలు, నష్టం, పర్యావరణ హానికి అమెరికాయే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ దాడులు అంతర్జాతీయ శాంతి, భద్రత, నౌకాయాన స్వేచ్ఛ, ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా మారాయని లేఖలో పేర్కొన్నారు.

పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో, హోర్మోజ్‌గన్, బుషెహర్, ఖుజెస్తాన్, సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో 11, 12వ తరగతుల విద్యార్థులకు ఆదివారం, సోమవారం జరగాల్సిన ఫైనల్ పరీక్షలను ఇరాన్ విద్యా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఈ పరీక్షలను తర్వాతి తేదీల్లో నిర్వహిస్తామని, మిగతా ప్రావిన్సుల్లో పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అమెరికా పౌరులకు ప్రయాణ హెచ్చరికలు

పశ్చిమాసియాలో తీవ్రతరమవుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆ ప్రాంతానికి ప్రయాణించే విషయంలో అమెరికా పౌరులు పునరాలోచించాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లెబనాన్‌కు ప్రయాణాలు వద్దని కోరగా, జెరూసలేంలోని రాయబార కార్యాలయం గాజా, ఉత్తర ఇజ్రాయిల్‌, ఈజిప్ట్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న పౌరులు అప్రమత్తంగా ఉండాలని, తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, విమాన సర్వీసుల షెడ్యూల్‌ను తనిఖీ చేసుకోవాలని కోరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్