- ఒక్క జులైలోనే 23,000 మంది లేఆఫ్
- మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌నకు షాక్!
వాషింగ్టన్ : అమెరికా మధ్యంతర ఎన్నికలకు మూడు నెలల ముందు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు షాక్ తగిలింది. ఈ ఏడాది మే, జూన్, జులైలో అమెరికా ఉద్యోగ మార్కెట్ డీలా పడింది. మే, జూన్ నెలల్లో 1,03,000 ఉద్యోగాలను కోల్పోయింది. జులైలో 23,000 మందిని కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. అయితే జులైలో నిరుద్యోగిత రేటు తగ్గింది. అందుకు కారణం వేలాది మంది జాబ్ మార్కెట్ నుంచి వైదొలగడం, ఉద్యోగాల కోసం పోటీపడే వారి సంఖ్య తగ్గడమని కార్మిక శాఖ వెల్లడించింది. కార్మిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం జూన్‌లో నిరుద్యోగిత రేటు 4.2 శాతం ఉండగా జులైలో 4.1 శాతానికి తగ్గింది. అయితే దీనికి కారణం 2,64,000 మంది ఉద్యోగాలను కోల్పోవడమే. దీంతో కార్మికుల భాగస్వామ్య రేటు ఐదున్నరేళ్ల కనిష్ట స్థాయి 61.4 శాతానికి పడిపోయి నియామకాలకు ఆటంకం ఏర్పడింది. 2021 ఫిబ్రవరి తర్వాత ఇదే అత్యల్పం. మరోవైపు, జులైలో ఉద్యోగుల వేతనాలు స్వల్పంగా పెరిగాయి. ఉద్యోగి సగటు గంట వేతనం 2025 జులైతో పోలిస్తే 3.2శాతం పెరిగింది. అమెరికన్ కుటుంబాలు అధిక జీవన వ్యయాల భారంతో సతమతమవుతున్న సమయంలో ఈ వేతనాల పెంపు జరిగింది. అయితే గత ఐదు నెలల కాలంలో తొలిసారిగా స్థానిక ప్రభుత్వ విద్యా రంగంలో వేతనాలు తగ్గిపోయాయి. వినోదం, ఆతిథ్య రంగాలలో కూడా వరుసగా రెండో నెలలో కూడా నియామకాలు పడిపోయాయి. ఫిఫా ప్రపంచకప్ అందించిన ప్రోత్సాహం క్రమేపీ తగ్గిపోవడమే దీనికి కారణమని ఆర్థికవేత్తలు తెలిపారు. కార్మిక మార్కెట్‌లో వరుసగా అనూహ్య బలహీనతలు కొనసాగుతున్నాయని క్యాపిటల్ మార్కెట్స్ ఆర్థికవేత్త స్టీఫెన్ స్టాన్లీ చెప్పారు. అమెరికా పరిశ్రమలను రక్షించడానికి, తయారీ రంగ ఉద్యోగాలను సృష్టించడానికి ట్రంప్ సర్కార్ ఇతర దేశాలపై భారీ సుంకాలను విధించింది. తమ ఆర్థిక వ్యవస్థలో స్వదేశీ పౌరులకు ఉద్యోగాలు పెరుగుతున్నాయని ట్రంప్ చాలా కాలంగా చెబుతున్నారు. స్వదేశీయులకు ఉద్యోగాలు దక్కేలా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. గత ఏడాది కాలంలో 7,20,000 మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు.
ఫెడ్ వడ్డీ రేట్లపై జాబ్ మార్కెట్ ప్రభావం
అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని తిరిగి 2 శాతానికి తీసుకురావడమే లక్ష్యంగా ఫెడరల్ రిజర్వ్ పనిచేస్తోంది. గత వారం జరిగిన సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. కానీ ముగ్గురు అధికారులు వడ్డీ రేట్లను పెంచాలని కోరారు. కానీ ఆ నిర్ణయం జరగలేదు. ఈ ఏడాది చివర్లో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని వాల్ స్ట్రీట్ వ్యాపారులు ఆశిస్తున్నారు. కాగా, వడ్డీ రేట్ల పెంపు సమర్థనీయమా కాదా అని ఫెడ్ చర్చించేటప్పుడు వారు యూఎస్ ఉద్యోగ మార్కెట్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థికవేత్త డేనియల్ ఝావో అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది నియామకాలు అంతంత మాత్రమే
ఈ ఏడాది ఇప్పటి వరకు కంపెనీలు నెలకు 61,000 ఉద్యోగాలను మాత్రమే కల్పిస్తున్నాయి. 2002 తర్వాత ఆర్థిక మాంద్యం లేని కాలంలో ఇంతటి బలహీనమైన నియామకాలు జరగడం ఇదే మొదటిసారి. కాగా, 2023-2024 ఆర్థిక సంవత్సరంలో నెలకు 1,66,000 ఉద్యోగాల కల్పన జరిగింది. దానితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల కల్పన చాలా తక్కువగా ఉంది. కొవిడ్ లాక్‌డౌన్‌లు ముగిసిన తర్వాత 2021-2022 ఆర్థిక సంవత్సరంలోనూ యూఎస్‌లో ఉద్యోగ నియామకాలు భారీగానే జరిగాయి. మరోవైపు, ట్రంప్ వలసల విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం, బేబీ బూమర్లు పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేయడం వల్ల ఉద్యోగాల కోసం పోటీపడే వారి సంఖ్య తగ్గింది. అందువల్ల ఫెడరల్ రిజర్వ్ ప్రకారం 2023-2024లో నెలకు 1,55,000గా ఉన్న బ్రేక్-ఈవెన్ నియామకాల రేటు, ఇప్పుడు దాదాపు సున్నాకు పడిపోయింది.








కామెంట్‌లు (0)