- ఆమ్నెస్టీ ఆందోళన
- ఇజ్రాయిల్‌కు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేసినట్టు నివేదిక
న్యూఢిల్లీ : గాజాలో పాలస్తీనీయులపై జరుగుతున్న యుద్ధం, మానవతా సంక్షోభం మధ్య భారత్ తీరుపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ నుంచి ఇజ్రాయిల్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఎగుమతులు కొనసాగుతున్నాయని ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో భారత్ గాజా మారణహోమానికి పరోక్ష భాగస్వామిగా మారే ప్రమాదం ఉందని తన తాజా నివేదికలో హెచ్చరించింది. భారత్ - ఇజ్రాయిల్ మధ్య జరిగిన సరుకు రవాణా స్థాయి వాణిజ్య డేటాను విశ్లేషించి ఆమ్నెస్టీ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. భారత కంపెనీలు తయారు చేసిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాటి విడి భాగాలు నేరుగా ఇజ్రాయిల్ సైన్యానికి సరఫరా చేసే పెద్ద రక్షణ సంస్థలకు చేరినట్టు నివేదిక పేర్కొంది. ఈ సరఫరాల్లో భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు కూడా ఉన్నాయని తెలిపింఇ. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి అగెస్ కలమార్ మాట్లాడుతూ... భారత ప్రభుత్వం నియంత్రణలో ఉన్న సంస్థల ద్వారా ఇజ్రాయిల్‌కు ఆయుధాలు, వాటి భాగాలు తయారు చేసి సరఫరా చేస్తున్నట్టు తేలిందన్నారు. ఇజ్రాయిల్‌తో రక్షణ భాగస్వామ్యాన్ని భారత్ మరింత విస్తరించిందని ఆమె విమర్శించారు. గాజాలో పాలస్తీనీయులపై మారణహోమం జరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో.. భారత్ నుంచి ఆయుధాల బదిలీ కొనసాగితే తీవ్రమైన అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనే అవుతుందని, అది భారత అధికారులకు తెలియదని చెప్పలేరని వ్యాఖ్యానించారు. గాజాలో ఇజ్రాయిల్ సైన్యం విపరీత స్థాయిలో ప్రాణనష్టం, విధ్వంసం, మానసిక హింసకు కారణమవుతున్న సమయంలో కూడా భారత కంపెనీలు ఇజ్రాయిల్ రక్షణ రంగానికి అవసరమైన విడిభాగాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తూ లాభాలు పొందుతున్నాయని ఆమ్నెస్టీ ఆరోపించింది. 2023 అక్టోబర్ 7 నుంచి భారత్ నుంచి ఇజ్రాయిల్‌కు వెళ్లిన సుమారు 2,600 ఆయుధాలు, మందుగుండు సామగ్రి, విడిభాగాల రవాణాలను ఆమ్నెస్టీ పరిశోధకులు గుర్తించారు. వీటిలో సైనిక వినియోగానికి సంబంధించిన చిన్న ఆయుధాల కోసం కనీసం 3,90,516 విడిభాగాలు, డ్రోన్ వార్‌హెడ్లు, ఆర్టిలరీ షెల్ కేసింగ్‌ల వంటి పేలుడు సామగ్రికి చెందిన 5,64,900కు పైగా భాగాలు, సైనిక వాహనాలకు చెందిన 298 కీలక భాగాలను భారత కంపెనీలు ఇజ్రాయిల్‌కు సరఫరా చేసినట్టు నివేదిక పేర్కొంది. ఆమ్నెస్టీ ఆరోపణలపై భారత, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు స్పందించలేదు.








కామెంట్‌లు (0)