11న దేశవ్యాప్త సమ్మె
28నుండి 30 వరకు మూడు రోజుల సమ్మె
యుఎఫ్‌బియు ఉద్యమ కార్యాచరణ
న్యూఢిల్లీ : అపరిష్కృత సమస్యల సాధనకై వరుసగా సమ్మెల శంఖారావాన్ని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) పూరించింది. ఐదు రోజుల పనివారం, ప్రభుత్వం సవరించిన పర్‌ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకానికి సంబంధించిన డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని బ్యాంక్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. సెప్టెంబరు 11న ఒక రోజు దేశవ్యాప్త సమ్మెకు యుఎఫ్‌బియు పిలుపిచ్చింది. ఆ తర్వాత సెప్టెంబరు 28 నుండి 30వరకు మూడు రోజుల పాటు సమ్మె చేస్తామని ప్రకటించింది. ఇంకా తమ డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో అక్టోబరు26 నుండి నిరవధిక సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు యుఎఫ్‌బియు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఫోరమ్‌లో ఏడు యూనియన్లు-ఎఐబిఇఎ, ఎఐబిఓసి, ఎన్‌సిబిఇ, ఎఐబిఓఎ, బిఇఎఫ్‌ఐ, ఐఎన్‌బిఓసి, ఐఎన్‌బిఇఎఫ్ వున్నాయి. మొత్తంగా బ్యాంకింగ్ రంగ సిబ్బందిలో 90శాతానికి పైగా సిబ్బంది ఈ యూనియన్లలోనే వున్నారు. ప్రభుత్వ రంగ, ప్రైవేటు, విదేశీ, ప్రాంతీయ గ్రామీణ, సహకార బ్యాంకులకు చెందిన సిబ్బంది అంతా ఈ ఫోరమ్‌లోనే వున్నారు. ప్రధానంగా యూనియన్లు నాలుగు కీలక డిమాండ్లు చేస్తున్నారు. ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం తీసుకువచ్చిన పిఎల్‌ఐ పథకాన్ని ఉపసంహరించాలని, ద్వైపాక్షిక చర్చల ద్వారా రాయితీ పథకాన్ని సవరించాలని, పెండింగ్‌లో వున్న మిగిలిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతున్నారు. వారానికి ఐదు రోజులు బ్యాంకులు పనిచేసేందుకు 2015లోనే సూత్రప్రాయంగా బ్యాంకులు అంగీకరించాయి. అప్పడే రెండో, నాలుగవ శనివారాలు హాలిడేలుగా ప్రకటించారు. 2020లో మళ్ళీ ఈ అంశాన్ని సమీక్షించి, 2024 మార్చి 8న వేతన పరిష్కార ఒప్పందం ద్వారా ఖరారు చేశారని యూనియన్లు పేర్కొంటున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం, అన్ని శనివారాలు హాలిడేగా ప్రకటించాలంటే అందుకు ప్రతిగా సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతి రోజూ 40నిముషాల అదనంగా పని చేసందుకు కూడా బ్యాంక్ ఉద్యోగులు అంగీకరించారు. రెండేళ్ళ క్రితమే ఈ ఒప్పందం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపాలని సిఫార్సు కూడా చేశారు. కానీ ఇంకా ప్రభుత్వ ఆమోద ముద్ర పడలేదని వారు పేర్కొంటున్నారు. భారత రిజర్వ్ బ్యాంక్, ఎల్‌ఐసి, జిఐసి, నాబార్డ్‌తో పాటూ ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఇప్పటికే వారానికి ఐదు రోజులు పనిచేస్తున్నాయని బ్యాంక్ యూనియన్లు వాదిస్తున్నాయి. కస్టమర్లకు సేవలందించే పనిగంటలు ఏమాత్రమూ తగ్గవని యూనియన్లు పేర్కొంటున్నాయి.







కామెంట్‌లు (0)