బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లోని నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఓవల్లో ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్(రోబో ఒలింపిక్స్) దిగ్విజయంగా ముగిసాయి. ఆగస్టు 22 నుంచి ఐదురోజుల పాటు జరిగిన ఈ రోబో ఒలింపిక్స్‌లో 16 దేశాల నుంచి సుమారు 2వేలకు పైగా రోబోలు పాల్గొన్నాయి. కిక్ బాక్సింగ్, తాయ్ చీ, టెన్నిస్, రన్నింగ్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, మార్షల్ ఆర్ట్స్, హైజంప్ వంటి 51 విభాగాల్లో పోటీలు జరిగాయి. అచ్చం మనుషుల్లాగే హ్యమనాయిడ్ రోబోలు ప్రతి క్రీడలోనూ పాల్గొని సత్తా చాటాయి. హ్యూమనాయిడ్ ఒలింపిక్స్‌లో చైనా దాదాపు అత్యధిక పతకాలను కైవసం చేసుకుంది. రోబోటిక్స్ రంగంలో చైనా సాధిస్తున్న వేగవంతమైన పురోగతికి ఈ పోటీలే నిదర్శనం. దీనికి అక్కడి ప్రభుత్వ ప్రోత్సాహం మెండుగా ఉంది.
100మీ. పరుగు బ్రేక్...
ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే మనిషి ఎవరు అంటే.. ఠక్కున గుర్తొచ్చే పేరు ఉసేన్ బోల్ట్. కానీ, ఈ పోటీల్లో ఆ పరుగుల రారాజు రికార్డును చైనా రోబో అధిగమించింది. చైనాకు చెందిన ‘టియాంగాంగ్ అల్ట్రా’ రోబో 100మీ. పరుగును కేవలం 8.86సెకన్లలోనే మెరుపు వేగంతో పూర్తి చేసింది. దీనిని ‘యూనిట్రీ’ సంస్థ సరికొత్తగా తయారు చేసింది. ఈ రోబోకు ‘సూపర్ మ్యాన్’ అని నామకరణం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మూడ్రోజుల ముందు 9.47 సెకన్లలోనే 100మీ. పరుగు లక్ష్యాన్ని పూర్తి చేసిన ‘లైట్నింగ్’ అనే మరో రోబో పరుగు ఆపిన వెంటనే కిందపడిపోవడంతో ఆ రోబోను స్ట్రెచర్ పై బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
వైఫల్యాలను అధిగమించి...
2025 ఏప్రిల్‌లో బీజింగ్‌లో జరిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి రోబోట్ హాఫ్-మారథాన్‌లో మానవ రన్నర్లతో పాటు హ్యూమనాయిడ్ రోబోట్లు కూడా పోటీపడ్డాయి. ఇందులో కొన్ని రోబోట్లు కేవలం కొద్ది భాగం మాత్రమే పూర్తి చేశాయి. మరికొన్ని ప్రారంభ రేఖ వద్దే కుప్పకూలిపోయాయి. ఇంకొన్ని కొద్ది మీటర్ల దూరంలోనే రెయిలింగ్‌ను ఢీకొన్నాయి. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ తయారు చేసిన “ఫ్లాష్” అనే హ్యూమనాయిడ్ రోబోట్, హాఫ్ మారథాన్‌ను 50 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసింది. ఇది మానవ ప్రపంచ రికార్డు కంటే దాదాపు 7 నిమిషాలు వేగవంతమైనది. ఏడాది తర్వాత అదే వేదికపై జరిగిన ‘ప్రపంచ హ్యూమనాయిడ్ (రోబోట్ గేమ్స్)’ దిగ్విజయంగా జరగడం విశేషం.








కామెంట్‌లు (0)