గాజా : గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ తన సైనిక దళాలను పూర్తిగా ఉపసంహరించుకునే వరకు నిరాయుధీకరణ చేపట్టబోమని హమాస్ శుక్రవారం స్పష్టం చేసింది. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ, యుద్ధంతో ధ్వంసమైన ప్రాంతాల పునర్నిర్మాణానికి సంబంధించిన సమగ్ర రాజకీయ ఒప్పందంలో భాగంగానే నిరాయుధీకరణ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం గాజాలో హమాస్‌తో పాటు ఇతర సాయుధ గ్రూపుల "పూర్తి నిరాయుధీకరణ" కోసం చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అమెరికా నేతృత్వంలోని 'శాంతి మండలి' పర్యవేక్షణలో గాజా కోసం రూపొందించిన 20 అంశాల ప్రణాళిక కింద ఈ ఒప్పందం కుదిరిందని ఆయన తన సోషల్ మీడియా 'ట్రూత్’లో వెల్లడించారు. ఇది గాజాలో కొత్త పాలస్తీనా ప్రభుత్వం ఏర్పాటుకు, శాశ్వత శాంతి, భద్రత సాధనకు కీలక ముందడుగని పేర్కొన్నారు. నిరాయుధీకరణ పలు దశల్లో అమలవుతుందని కూడా తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తొమ్మిది నెలల అనంతరం వైట్‌హౌస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ట్రంప్ వ్యాఖ్యలపై హమాస్ చర్చల బృందం సభ్యుడు ఘాజీ హమద్ స్పందించారు. నిరాయుధీకరణకు ముందు ఇజ్రాయిల్ తన ఒప్పంద బాధ్యతలను పూర్తిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గాజా నుంచి ఇజ్రాయిల్ సైన్యం పూర్తిగా వెళ్లిపోయిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం ఉంటుందని తెలిపారు. నిరాయుధీకరణ అమలు, పర్యవేక్షణ ప్రక్రియలో ఇజ్రాయిల్‌కు ఎటువంటి పాత్ర ఉండదని, దానిని పాలస్తీనా జాతీయ కమిటీ నిర్వహిస్తుందని ఘాజీ హమద్ చెప్పారు. పాలస్తీనా ప్రజల హక్కులను పరిరక్షించే విషయంలో హమాస్ తన వైఖరిని మార్చబోదని, చర్చల ద్వారా సాధ్యమైనంత ఉత్తమ ఫలితాన్ని సాధించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్, ఖతార్, టర్కీ ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు "కష్టమైనవి, అత్యంత క్లిష్టమైనవి" అని పేర్కొన్నారు. ప్రస్తుతం కైరోలో మధ్యవర్తుల సమక్షంలో కాల్పుల విరమణ అమలు, బందీల విడుదల, ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ, గాజా పునర్నిర్మాణం తదితర అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.
2025 అక్టోబర్ 10న కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటికీ, ఇజ్రాయెల్ గాజా అంతటా ప్రతిరోజూ దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల్లో 1,214 మంది పాలస్తీనియన్లు మరణించగా, 3,977 మందిన గాయపడ్డారు. 2023 అక్టోబర్‌లో అంగీకరించిన వాస్తవ ఉపసంహరణ సరిహద్దు “పసుపు రేఖ”కు ఆవల ఉన్న గాజా భూభాగాన్ని కూడా ఆక్రమించుకునేందుకు యత్నిస్తోంది.








కామెంట్‌లు (0)