శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నెతన్యాహూకు వ్యతిరేకంగా హాలీవుడ్‌ స్టార్స్‌ నిరసన.. 100 మంది అరెస్టు

13 గంటల క్రితం

Hollywood stars
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 01:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూయార్క్‌ : ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూకు వ్యతిరేకంగా న్యూయార్క్‌లో గురువారం హాలీవుడ్‌ స్టార్స్‌ సహా పలువురు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నిరసనను అడ్డుకున్న పోలీసులు హాలీవుడ్‌ నటి సుసాన్‌ సరండన్‌, ‘హాక్స్‌’ నటి హన్నా ఐన్‌బైండర్‌ సహా సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు న్యూయార్క్‌ సిటీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ (ఎన్‌వైపిడి) ప్రతినిధి తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నెతన్యాహు ప్రసంగించనున్న నేపథ్యంలో ‘జ్యూయిష్‌ వాయిస్‌ ఫర్‌ పీస్‌’ ఆధ్వర్యంలో ఐరాస ప్రధాన కార్యాలయం వెలుపల ఈ నిరసన జరిగింది. ‘ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఇవ్వడం ఆపండి’, ‘జాతి నిర్మూలనను అంతం చేయండి’ అంటూ నిరసనకారులు బ్యానర్లు ప్రదర్శించారు. నిరసనకారులు ప్రధాన కూడలిని దిగ్బంధించారు. గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధానికి అమెరికా అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేయాలని, యుద్ధాన్ని ముగించాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. నిరసనను అడ్డుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారి సంఖ్యను పోలీసులు వెల్లడించలేదు. అయితే 100 మందికి పైగా అరెస్టయ్యారని ‘జ్యూయిష్‌ వాయిస్‌ ఫర్‌ పీస్‌’ సోషల్‌ మీడియాలో పేర్కొంది. అరెస్టయిన సుసాన్‌ సరండన్‌ గతంలోనూ గాజాలో ఇజ్రాయెల్‌ సైనిక చర్యలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నారు. తన రాజకీయ అభిప్రాయాల కారణంగా హాలీవుడ్‌లో కొన్ని సినిమా అవకాశాలను కోల్పోయినట్లు ఆమె ఇటీవల వెనిస్‌ చలనచిత్రోత్సవంలో వెల్లడించారు. ఐరాససర్వసభ్య సమావేశంలోనూ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూకి నిరసన ఎదురైంది. సమావేశంలో నెతన్యాహు ప్రసంగం ప్రారంభించగానే పలువురు దేశాల ప్రతినిధులు వాకౌట్‌ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్