రియాద్ : దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న విమానంలో ఇద్దరు పైలట్లు ఘర్షణకు దిగి, ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఎఫ్‌జెడ్ 1073 విమానం మార్గమధ్యంలో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొని ఉదయం 9.45 గంటలకు తబూక్‌లో దిగినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ ఘటనలో పైలట్, కో-పైలట్‌కు గాయాలయ్యాయని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. విమానంలోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని పేర్కొంది. విమానంలో పైలట్ల మధ్య జరిగిన ఘర్షణ కారణంగానే అత్యవసర సంకేతం యాక్టివేట్ అయిందని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఒక పైలట్ మరో పైలట్‌పై కత్తితో దాడికి ప్రయత్నించగా ప్రయాణికులు అరుపులు విన్నట్లు ఓ ప్రయాణికురాలి తల్లి తెలిపారు. అనంతరం ఓ ప్రయాణికురాలు కాక్‌పిట్‌లోకి వెళ్లి చూడగా అక్కడ రక్తం కనిపించిందని, దీంతో సహాయం కోసం కేకలు వేసిందని అన్నారు. కొందరు ప్రయాణికులు లోపలికి వెళ్లి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని ఆమె తెలిపారు. అదే సమయంలో విమానం వేగంగా కిందికి దిగడం ప్రారంభించడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఆమె వివరించారు. వెనుక భాగంలో ఉన్న మరో ఇద్దరు పైలట్లు విమాన నియంత్రణను చేపట్టినట్లు తెలిపారు. విమానంలో అసలు ఏం జరిగిందనే దానిపై విమానయాన సంస్థ, సంబంధిత దేశాల అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. పైలట్లలో ఒకరు ఒమన్‌కు, మరొకరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందినవారని కొన్ని ఇజ్రాయెల్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
విమానం హైజాక్ .. !
అయితే విమానం హైజాక్ అయిందన్న అనుమానంతో ఇజ్రాయెల్ సైన్యం యుద్ధ విమానాలను రంగంలోకి దించినట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. అనంతరం ఆ వార్తలను తోసిపుచ్చినట్లు ఇజ్రాయిల్ ప్రభుత్వ మీడియా తెలిపింది. విమాన ఘటనపై ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందించింది. పరిస్థితి అదుపులో ఉందని, ప్రయాణికులను సురక్షితంగా ఇజ్రాయెల్‌కు తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
ఫ్లైట్‌రాడార్ సమాచారం ప్రకారం విమానం ప్రయాణ సమయంలో కేవలం ఒక నిమిషంలోనే సుమారు 34 వేల అడుగుల ఎత్తు నుంచి 17 వేల అడుగుల కంటే తక్కువ ఎత్తుకు పడిపోయింది. దీంతో విమానంలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. తబూక్ విమానాశ్రయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం వద్ద పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లను మోహరించారు.








కామెంట్‌లు (0)