వాషింగ్టన్ : అమెరికాలో జరగబోయే మధ్యంతర ఎన్నికలలో వామపక్ష డెమొక్రాట్లు గెలుపు బాటలో పయనిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ నినాదంతో పోటీ చేయాలని భావిస్తున్న డాక్టర్ అబ్దుల్ ఎల్ - సయీద్‌కు మద్దతుగా వామపక్ష ప్రముఖులు ఒకాసియో- కోర్టెజ్, శాండర్స్ నిర్వహిస్తున్న ప్రచారానికి విశేష మద్దతు లభిస్తోంది. డెట్రాయిడ్‌లోని 104 సంవత్సరాల పురాతన ఒపెరా హౌస్ శనివారం వీరి ప్రచార సభతో కిక్కిరిసిపోయింది. నవంబరులో జరగబోయే మధ్యంతర ఎన్నికలలో సెనెట్‌కు పోటీ చేయడానికి ఎల్- సయీద్ డెమొక్రటిక్ పార్టీ నామినేషన్‌ను సంపాదించగలరా లేదా అనే విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌పై పట్టు కోసం డెమొక్రాట్లు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ పార్టీలో నెలకొన్న విభేదాలకు ఈ ఇరువురు నాయకులు ప్రతీకలుగా నిలిచారు. శాండర్స్, ఒకాసియో - కోర్టెజ్‌తో పాటు న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ వంటి వారు డెమొక్రటిక్ పార్టీలో వామపక్ష భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ వేసవిలో జరిగిన ప్రైమరీలలో న్యూయార్క్, కొలరాడో సహా పలు ప్రాంతాలలో వామపక్ష డెమొక్రాట్లు వరుస విజయాలు సాధించిన విషయం తెలిసిందే. 2024 అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచి ప్రస్తుతం తీవ్ర నిరాశకు లోనవుతున్న కార్మికుల మద్దతు వీరికే లభిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. 2020లో జో బైడెన్‌కు, 2024లో ట్రంప్‌కు ఓటేసిన మిచిగాన్‌లో ఖాళీగా ఉన్న సెనెట్ స్థానాన్ని గెలుచుకోవడం డెమొక్రాట్లకు చాలా అవసరం. ఎల్ -సయీద్ ‘భవిష్యత్ రాజకీయాల’కు ప్రాతినిధ్యం వహిస్తారని వామపక్ష నేతలు ఇస్తున్న భరోసా ఓటర్లను ఆలోచింపజేస్తోంది. మిచిగాన్‌లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఎల్ - సయీద్, స్టీవెన్స్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ‘రాజకీయాల నుంచి డబ్బును వేరు చేయండి. జేబుల్లోకి డబ్బును పంపండి. అందరికీ ఆరోగ్య రక్షణ’ అని ఎల్-సయీద్ మద్దతుదారులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ధరల పెరుగుదలతో విలవిలలాడుతున్న మిచిగాన్ ఓటర్లు ఎల్-సయీద్ వైపు చూస్తున్నారు. పెరుగుతున్న గ్యాస్, నిత్యావసరాల ధరలు, ఇంటి ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ వ్యయం వంటి అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని అంటున్నారు.







కామెంట్‌లు (0)