- 40 ఇళ్లు కొట్టుకుపోయాయి, నలుగురు గల్లంతు
ఖాట్మండు: నేపాల్లోని గోర్ఖా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. బుధి గండకి నదిలో వరద ఉద్ధృతికి ఐదు నివాస ప్రాంతాల్లో కనీసం 40 ఇళ్లు కొట్టుకుపోయాయి. వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో నలుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. చుమ్నుబ్రి గ్రామీణ మున్సిపాలిటీలో కొండచరియలు విరిగిపడి బుధి గండకి నదికి అడ్డుగా ఏర్పడ్డాయి. ఆ అడ్డంకి తొలగిపోవడంతో ఆదివారం ఉదయం సుమారు 4 గంటల సమయంలో ఒక్కసారిగా వరద నీరు దిగువ ప్రాంతాలకు ప్రవహించింది. దీంతో నది పరిసరాల్లోని ఇళ్లు, తాత్కాలిక నిర్మాణాలు కొట్టుకుపోయాయి. చుమ్నుబ్రి గ్రామీణ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు లక్ష్మి గురుంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. పైయున్, జగత్, బాగర్, సల్లేరి, ఘట్టిఖోలా ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. సిర్దిబాస్, ధార్చే గ్రామీణ మున్సిపాలిటీల్లోనూ వరద ప్రభావం కనిపించింది. వరదల అనంతరం చుమ్నుబ్రి-6లోని చుమ్చెట్ ప్రాంతంలో ఉంగిలుంగ్ నది ఒడ్డున ఉన్న ఓ షెడ్డులో నివసిస్తున్న నలుగురు కనిపించకుండా పోయారు. వారి ఆచూకీ కోసం అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నిర్ధారణ కాలేదు. వరదల వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.








కామెంట్లు (0)