గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

భూకంపం కాదు.. హిమానీనదం కూలిపోవడంతోనే నేపాల్‌లో వరదలు

1 గంట క్రితం

flash floods
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 12:26 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ఖాట్మాండు : నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ఆకస్మిక వరదలు 4.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కాదని, హిమానీనదం కూలిపోవడం వలన సంభవించాయని అమెరికా జియోలాజికల్‌ సర్వే (యుఎస్‌జిఎస్‌) స్పష్టం చేసింది. తొలుత ఈ ఘటనను 4.4 తీవ్రత గల భూకంపంగా నివేదించినప్పటికీ, విశ్లేషణ అనంతరం భూకంపం సంభవించలేదని నిర్ధారించినట్లు తెలిపింది. సమీపంలోని భూకంప కేంద్రాల సమాచారం, దీర్ఘకాలిక భూకంప తరంగాలు, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు యుఎస్‌జిఎస్‌ పేర్కొంది. హిమానీనదం కూలిపోవడం, అనంతరం భారీగా శిథిలాలు దిగువ ప్రాంతాలకు ప్రవహించడం వల్లే ప్రకంపనలు నమోదైనట్లు వివరించింది. బుధవారం టిబెట్‌లో ప్రారంభమైన ఈ ఆకస్మిక వరదలు నేపాల్‌లోని రసువా, ధాడింగ్‌ జిల్లాల్లో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో 162 మంది మరణించగా, 133 మంది భారతీయులతో సహా సుమారు 750 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను మొదట భూకంపంగా అంచనా వేసిన యుఎస్‌జిఎస్‌.. అనంతర విశ్లేషణలో ప్రకంపనల తీవ్రతను 4.4 నుంచి 5.2గా సవరించింది. అయితే ఈ ప్రకంపనలు భూకంపం వల్ల కాకుండా హిమానీనదం కూలిపోవడం, శిథిలాల ప్రవాహం కారణంగా ఏర్పడినవేనని స్పష్టం చేసింది. ఈ శిథిలాల ప్రవాహం దిగువ ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి కారణమైనట్లు పేర్కొంది.

నేపాల్‌ వరదల్లో 165మంది మృతి

భోటెకోషి నది ఉప్పొంగడంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 165 మంది మరణించగా, 826 మంది గల్లంతైనట్లు నేపాల్‌ అధికారులు గురువారం వెల్లడించారు. గల్లంతైన వారిలో 579 మంది పర్యాటకులు ఉన్నారు. వీరిలో 300 మందికి పైగా భారతీయ పర్యాటకులు ఉన్నట్లు నేపాల్‌ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనాల్‌ తెలిపారు. రసువా ప్రాంతంలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. వరదలు, కొండచరియలు, శిథిలాల ప్రవాహం కారణంగా రహదారులు, వంతెనలు, జలవిద్యుత్‌ కేంద్రాలు, కస్టమ్స్‌ కార్యాలయాలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గల్లంతైన వారిలో 85 మంది సాయుధ దళాల సిబ్బంది, వివిధ జలవిద్యుత్‌ కేంద్రాలు, కస్టమ్స్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న 162 మంది ఉద్యోగులు ఉన్నట్లు నేషనల్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ) వెల్లడించింది.

చిత్వాన్‌లో అత్యధిక మరణాలు

నేపాల్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చిత్వాన్‌ జిల్లాలో అత్యధికంగా 64 మంది మరణించారు. ధాడింగ్‌లో 27, నవల్‌పరాసి ఈస్ట్‌లో 26, గోర్ఖాలో 20, నువాకోట్‌లో 12, తన్హులో తొమ్మిది, నవల్‌పరాసి వెస్ట్‌లో ఐదు, రసువాలో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 165కు చేరింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

భారత్‌లోనూ అప్రమత్తత

నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా నదుల్లో నీటిమట్టాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో భారత్‌–నేపాల్‌ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాలపై వరద ప్రభావం ఉండే అవకాశాన్ని కేంద్ర హోంశాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. అవసరమైన ముందస్తు చర్యలు తీసుకునేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తోంది.

300 మందికి పైగా భారతీయ పర్యాటకులు గల్లంతు

నేపాల్‌ పర్యాటక ప్రాంతాల్లో ఈ సమయంలో పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఉన్నారు. గల్లంతైన 579 మంది పర్యాటకుల్లో 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు నేపాల్‌ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనాల్‌ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో గల్లంతైన వారి పూర్తి వివరాలు సేకరించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. నేపాల్‌ వరదల్లో కేరళకు చెందిన సుమారు 30 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. బాధిత కుటుంబాల నుంచి సుమారు 17 సహాయ అభ్యర్థన కాల్స్‌ తమకు అందినట్లు వెల్లడించింది. కేరళ ప్రభుత్వ ప్రవాసుల సంక్షేమ సంస్థ నోర్కా–రూట్స్‌ అధికారులు ఈ వివరాలను సేకరించి ఢిల్లీలోని సంబంధిత అధికారులకు అందజేశారు. కేరళకు చెందిన మరో 36 మంది పర్యాటకుల బృందం కూడా వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా నిర్ధారణ రావాల్సి ఉంది. సెలవుల సీజన్‌ కావడంతో నేపాల్‌కు పర్యాటకుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల గల్లంతైన భారతీయ పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం

వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేపాల్‌ భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే రహదారులు, వంతెనలు దెబ్బతినడం, కొన్ని ప్రాంతాల్లో సమాచార వ్యవస్థలు పనిచేయకపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. భారీ వరదల నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలను వేగవంతం చేసింది. మరోవైపు భారత్‌ కూడా తన పౌరుల వివరాలను సేకరించి, వారిని సురక్షితంగా తరలించేందుకు నేపాల్‌ అధికారులతో సమన్వయం చేస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్