2,000 మందికి పైగా గల్లంతు.. 2,465 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఖాట్మాండు : నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 626కు చేరింది. శనివారం నాటికి మరికొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయని, దాదాపు 2,000 మంది ఇంకా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గాలింపు, సహాయక చర్యలు నాలుగో రోజూ కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ) ప్రకారం ఎనిమిది జిల్లాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. చిత్వాన్‌లో 233, తూర్పు నవల్‌పరాసిలో 158, నువాకోట్‌లో 51, గోర్ఖాలో 48, పశ్చిమ నవల్‌పరాసిలో 47, ధాడింగ్‌లో 45, తనహులో 31, రసువాలో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి.
2,465 మంది సురక్షితం
వరదల్లో చిక్కుకుపోయిన 2,465 మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వీరిలో 163 మంది విదేశీయులు ఉన్నారు. వారిలో 113 మంది భారతీయులు, 26 మంది చైనీయులు, 15 మంది దక్షిణ కొరియన్లు, నలుగురు జర్మన్లు, ఇటలీ, అమెరికాకు చెందిన ఇద్దరు చొప్పున, ఒక ఒమన్ దేశస్థుడు ఉన్నారు. త్రిశూలి, రసువా ప్రాంతాల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న 191 మంది కార్మికులను కూడా రక్షించారు.
5 బిలియన్ డాలర్లు అవసరం
వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి నేపాల్‌కు 4 నుంచి 5 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, నష్టం అంచనా ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. శుక్రవారం రాత్రి నాటికి ప్రధాన మంత్రి విపత్తు సహాయ నిధికి రూ.2.295 బిలియన్లకు పైగా విరాళాలు అందినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ముగ్లింగ్-ఖాట్మాండు హైవేపై రాకపోకలు పునరుద్ధరణ
వరదలు, కొండచరియల కారణంగా బుధవారం నుంచి మూసివేసిన ముగ్లింగ్-ఖాట్మాండు హైవేపై శనివారం రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. పరిస్థితిని అంచనా వేసిన అనంతరం వాహనాలను క్రమంగా గమ్యస్థానాలకు అనుమతిస్తున్నట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. దీంతో రోజులుగా హైవేపై చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఉపశమనం లభించింది. గత నాలుగు రోజులుగా మధ్య నేపాల్‌లోని పలు జాతీయ రహదారులు, ప్రధాన రహదారి మార్గాలు వరదలు, కొండచరియల కారణంగా మూసివేయబడ్డాయి.








కామెంట్‌లు (0)