శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవెనిజులాతో చమురు ఒప్పందం !

1 గంట క్రితం

america
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 02:02 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 65 బిలియన్ బ్యారెళ్ల చమురుకు అంగీకారం

  • చారిత్రాత్మకమని ట్రంప్‌ ప్రకటన

వాషింగ్టన్: అమెరికా, వెనిజులా మధ్య భారీ చమురు ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. సుమారు 65 బిలియన్ బ్యారెళ్ల వెనిజులా చమురు నిల్వలపై అమెరికా పాక్షిక నియంత్రణ సాధించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఒప్పందాన్ని “ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందం”గా ట్రంప్ అభివర్ణించారు. సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో చేసిన ప్రకటనలో ట్రంప్‌.. ఈ ఒప్పందం కుదరడంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, యుద్ధ శాఖ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

అమెరికా చమురు నిల్వలు రెట్టింపు..

ఈ ఒప్పందం ద్వారా అమెరికా చమురు నిల్వలు రెట్టింపుకంటే ఎక్కువగా పెరుగుతాయని ట్రంప్‌ అన్నారు. దీని ఫలితంగా భవిష్యత్తులో అమెరికన్లకు పెట్రోల్‌ ధరలు గణనీయంగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. వెనిజులా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు, ఆ దేశాన్ని “అద్భుతమైన విజయాలు, గొప్ప సుసంపన్నత” వైపు నడిపించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపారు. అమెరికా–వెనిజులా సంబంధాలను మరింత బలోపేతం చేయడంలోనూ ఈ ఒప్పందం కీలకమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్‌ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను కిడ్నాప్‌ ‌చేసి, నార్కో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దాదాపు తొమ్మిది నెలల తర్వాత తాజా చమురు ఒప్పందం ప్రకటించడం గమనార్హం.

ఇరాన్‌ యుద్ధం, పెరుగుతున్న ఇంధన ధరల ఒత్తిడి

దేశంలో పెరుగుతున్న పెట్రోల్‌ ధరలపై ట్రంప్‌ ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇరాన్‌కు సంబంధించిన యుద్ధం ఆరు నెలల దశకు చేరుకున్నప్పటికీ ముగింపు కనిపించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. ఫలితంగా ఇంధన ధరలు అధికంగానే కొనసాగుతున్నాయి. సరఫరా ఒత్తిడిని నిర్వహించేందుకు అమెరికా తన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను కూడా వినియోగిస్తోంది. ఆగస్టు ప్రారంభంలో ఆ నిల్వలు 300 మిలియన్‌ బ్యారెళ్లకు దిగువకు పడిపోయాయి. 2026 ప్రారంభంతో పోలిస్తే నిల్వలు 100 మిలియన్‌ బ్యారెళ్లకు పైగా తగ్గినట్లు సమాచారం. ఈ ఒప్పందంలో ఏయే కంపెనీలు భాగస్వాములవుతాయి, చమురు నిల్వలపై అమెరికా నియంత్రణను ఏ విధంగా అమలు చేస్తుంది వంటి కీలక వివరాలను ఇరు దేశాలు ఇంకా వెల్లడించలేదు. అయితే, వెనిజులా చట్టపరమైన, రాజకీయ సవాళ్లను ఈ ఒప్పందం తట్టుకోలేదని పలువురు విశ్లేషిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్