సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంతఃసంఘర్షణల సంవేదం

9 గంటల క్రితం

book review
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 06:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఆధునిక సమాజం అనేక సంఘర్షణలతో అట్టకట్టిన చింపిరి జుట్టులా చిక్కుల్లో పడిపోయింది. ఎంత సరిచేయాలని ప్రయత్నించినా, జీవితం తెగిపడుతున్న వెంట్రుకల పోగులా చేతిలోంచి జారిపోతోంది. అన్నీ సమస్యలే. అన్నీ సందేహాలే. కాలం మనిషి వేగాన్ని మించి పరిగెడుతోంది. మోకాలి చిప్పలు అరిగిపోవడం సరే, గుండె పేలిపోయేలా ఉరుకుల పరుగులు! గుంపులో ఉన్నా మనిషి ఒంటరైపోతున్నాడు. పైకి గంభీరంగా కనిపించినా, గుండెలో చుట్టుకుపోయిన దిగులు మాత్రం సెగగడ్డలా సలుపుతూనే ఉంటుంది. ఈ బాధ నుంచి తప్పించుకోవడానికి నటించడం నేర్చుకుంటున్నాడు. మాయ, మోసం, కుట్ర, కుతంత్రం అన్నింటికీ అలవాటు పడిపోతున్నాడు. ఏ ఎండకా గొడుగు పట్టడాన్నే ఎదుగుదలకు సాధనంగా భ్రమపడుతున్నాడు. అలాంటి లయ తప్పిన సమాజపు తీరుతెన్నులను చూసి కలత చెందిన కవి, అంతర్గత సంఘర్షణకు లోనైనప్పుడు జనించిన ఆక్రోశం, అశాంతి, నిరసనల జ్వాలల నుంచే "ఒక అశాంతుడి స్వప్నం" కవితా సంపుటి ఆవిర్భవించింది. ప్రముఖ సీనియర్ కవి ఏటూరి నాగేంద్ర అశాంత హృదయంతో రాసిన 62 కవితల తోరణమిది. ఇది ఆయన 8వ కవితా సంపుటి. గతంలో వెలువరించిన సంపుటుల ద్వారా గాఢమైన, చిక్కని కవిత్వాన్ని పాఠకులకు అందించిన ఆయన అనేక పురస్కారాలను అందుకున్నారు.

ఈ సంపుటిలోని కవితలు కూడా గత సంపుటుల స్థాయిని నిలబెట్టుకుంటూ, మరింత పదునుగా పాఠకుడి మనసును తాకుతాయి. మనిషి కోసం తపిస్తూ, ప్రశ్నిస్తూ, హెచ్చరిస్తూ మనలో ఆలోచనను రేకెత్తిస్తాయి. మనిషిని గాఢంగా ప్రేమించినప్పుడే అతని బలహీనతలను కూడా అర్థం చేసుకోవచ్చు. అతనిలోని ఊసరవెల్లి స్వభావాన్ని చూసి ఆవేదన చెందుతూ, అదే సమయంలో జాలితో నవ్వుకోగలిగినప్పుడే ఇలాంటి కవిత్వం సాధ్యమవుతుంది.

​ఆయన ఒకచోట ఇలా అంటారు—

​"జీవితాన్ని పోరాటంలా

ప్రేమించడం నేర్చుకున్నాక

గుండె గాయం కూడా

నన్ను ముద్దాడటం నేర్చుకుంది"

​ఈ నాలుగు పంక్తుల్లో ఎంత తాత్వికత ఉంది! మానవీయ విలువలపై ఎంతటి విశ్వాసం వ్యక్తమైంది! ప్రేమించే గుణం బాధించే గాయాన్నీ ముద్దాడే అనుభూతిగా మార్చగలదనే భావాన్ని కవి అత్యంత హృద్యంగా వ్యక్తీకరించారు.

మరోచోట—​

"ఎన్నో విషాదాల్ని గాయాల రూపంలో

మోస్తున్న గుండెకు

అరచేతుల్లోని గాజు ముక్కలు కూడా

తామర పుష్పాలే...!" అని చెప్పగలిగారు.

​జీవితానుభవాలను లోతుగా మథించినప్పుడే ఇలాంటి వాక్యాలు పుడతాయి.

​"కొన్ని వాక్యాలు

రాయాలనుకున్నప్పుడు

శరీరంలోని రక్తపు చెలమలో

ఈదులాడాలి" అని అంటారు.

​ఆ ఒక్క వాక్యమే ఈ సంపుటి మొత్తం కవిత్వానికి తాత్విక వ్యాఖ్యానంలా అనిపిస్తుంది.

ఆయన కవితలన్నీ ఒంట్లోని రక్తపు చెలమలో ఈదులాడుతూ, మరణశయ్యపై ఉన్న మనిషితనాన్ని చూసి కలతతో, ఆవేదనతో, ఆగ్రహంతో పుట్టినవే. ఈ కవితా వాక్యాలు చూడండి—

​"హృదయాల్ని పూర్తిగా అమ్మేసి

చాపలా చుట్టిన శవాల్లా

ఉన్మాదపు నృత్యాలతో

జలదరింపుగా!

వాళ్ల దేహాల నిండా

అంతర్లీనంగా కదులుతున్న స్వార్థం

​గెలవాలనుకున్న ప్రతిసారి

జీవితం నాతో ఆడుకుంటుంది

ఎప్పటికప్పుడు

ఎన్నిసార్లు పెదాలపై

నవ్వును అతికించుకోను?"

​ఈ పంక్తుల్లో ఎంత ఖేదం ఉంది! ఎంత నిర్వేదం ఉంది! మనిషి తన మనిషితనాన్నే కోల్పోతున్న విషాదాన్ని కవి ఎంత తీవ్రంగా అనుభవించాడో తెలుస్తుంది.

​అలాంటి ఆవేదనే మరోచోట మరింత సాంద్రంగా ఇలా వ్యక్తమవుతుంది—

​"ఎన్నెన్ని కలలు

నా కంటి రెటీనా గుహల్లో

కాలిపోతున్నాయో!"

​ఈ ఒక్క వాక్యం చాలు... కవి అంతరంగంలో పేరుకుపోయిన వేదన ఎంత లోతైనదో చెప్పడానికి.

​సమకాలీన మానవ సమాజాన్నీ, దాని సమస్యలనూ, సంఘర్షణలనూ, స్పందనలనూ, ప్రతిస్పందనలనూ వేటికవిగా విడదీయకుండా, ఒకే అనుభూతిగా మథించి తీసిన గంధంలో పొదిగిన కర్పూర దీపాల తోరణంలా అనిపిస్తుంది "ఒక అశాంతుడి స్వప్నం". ఇందులోని కవితలన్నీ పైకి ఎంత వేడిగా రగులుతాయో, అంతర్లీనంగా అంతే చల్లని మానవీయ స్పర్శను అందిస్తాయి. ఈ సంపుటి చదువుతున్నంతసేపూ కవి తనతో తాను, సమాజంతో, కాలంతో సాగించిన అంతర్మథనం పాఠకుడినీ వెంటాడుతుంది. ప్రశ్నించడం, కలత చెందడం, మనిషిని ప్రేమించడం, అతని పతనాన్ని చూసి బాధపడడం—ఈ నాలుగూ ఈ కవిత్వానికి జీవగర్రలు. అందుకే ఈ కవితలు కేవలం చదివించవు; ఆలోచింపజేస్తాయి. మన అంతరంగాన్ని తట్టిలేపి, మనలోని నిశ్శబ్దాన్ని ప్రశ్నిస్తాయి. కవిత్వాన్ని ప్రేమించే ప్రతి పాఠకుడు ఈ సంపుటిని తప్పక చదవాలి. జీవితాన్ని, మనిషిని, సమాజాన్ని మరో కోణంలో చూడాలనుకునే వారికి ఇది విలువైన పఠనం.


కవి సెల్ నంబర్: 74166 65323

​– పతివాడ నాస్తిక్

94417 24167​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్