- ప్రత్యామ్నాయశక్తిగా వికసిస్తున్న ప్రజాస్వామ్య సోషలిజం
వాషింగ్టన్ : పెట్టుబడిదారుల కలల సామ్రాజ్యంలో సామ్యవాద జ్వాల ఎగుస్తోంది. తనకు ఇక ఎదురు ఎవ్వరూ లేరంటూ ఇష్టారీతిన నిర్ణయాలు తీసు కుంటూ పెట్టుబడిదారుల సేవల మునిగితేలుతున్న అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భావజాలాన్ని ఛీకొట్టి ప్రజాతంత్ర, సామ్యవాద భావాలు వికసిస్తున్నాయి. అమెరికాలో క్రమేపి పుంజుకుంటున్న సామ్యవాద భావాలపై ఈ నెల 21న ప్రముఖ వార్తా సంస్థ ‘ద హిందూ’ ప్రచురించిన సంపాదకీయం సారాంశామిది..
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తన అస్తవ్యస్థ విధానాలు, నిర్ణయాలతో దేశ విదేశాంగ విధానాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తూనే వుంది. పశ్చిమాసియాలో యుద్ధాలు, వెనిజులాలో అధికారాన్ని ఒక రకంగా హస్తగతం చేసుకోవడం, క్యూబా ఇంధన వాణిజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడం, బహుళపక్ష సంస్థల నుండి బయటకు రావడం, ఇష్టానుసారం సుంకాలు విధించడం వంటి చర్యల్లో కనిపించే ఏకాంతవాదం వంటి అతి దూకుడుతో కూడిన సామ్రాజ్యవాద చర్యల నేపథ్యంలో ట్రంపిజానికి ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రపంచం ఎదురుచూ స్తోంది. 2024 తర్వాత, విదేశాంగ విధానం, సంక్షేమం లేదా అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మిస్తున్న ధనికస్వాములను ఎదుర్కొనడంపై బలహీనంగా వున్న డెమోక్రటిక్ పార్టీ ఏమాత్రమూ సైద్ధాంతిక ధృఢ సంకల్పాన్ని ప్రదర్శించనపుడు అవకాశాలు బలహీనపడినట్లు కనిపించాయి.
• 2025 నవంబరులో, మార్కెట్ మూఢనమ్మకాలంటే కూడా ప్రజల అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ, వాణిజ్యకీకరణ వ్యతిరేకత నినాదంతో జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగరాన్ని గెలుచుకున్నారు. మరోవైపు గాజాపై ఇజ్రాయిల్ సాగించే యుద్ధాన్ని కడా ఆయన బహిరంగంగానే విమర్శించారు. ఆయన సాధించిన విజయం న్యూయార్క్ ప్రజల ఊహలను ఆకట్టుకోవడమే కాదు, అంతకుమించి కూడా చేసింది. డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తల్లో డెమోక్రటిక్ సోషలిస్టుల తిరుగుబాటుకు దారి తీసింది.
• మిచిగన్‌లో ఆగస్టు 4న జరిగిన ప్రైమరీలో ఇండిపెండెంట్ సెనెటర్ బెర్నీ శాండర్స్ మద్దతు వున్న ప్రగతిశీల కార్యకర్త అబ్దుల్ ఎల్ సయీద్ సెనెట్‌కు డెమోక్రటిక్ నామినేషన్‌ను గెలుచుకు న్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ అనుకూల గ్రూపులు భారీగా ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది.
• మూడుసార్లు స్టేట్ లెజిస్లేటర్‌గా గెలిచిన, జూన్‌లో డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికాలో చేరిన ఆంగీ నిక్సన్ ఫ్లోరిడా డెమోక్రటిక్ సెనెట్ నామినేషన్‌ను గెలుచుకున్నారు. ఆమె వాణిజ్య ప్రకటనలపై కేవలం 60వేల డాలర్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఆమె ప్రత్యర్ధి మోడరేట్ అభ్యర్ధి 22లక్షల డాలర్లు ఖర్చు పెట్టారు.
ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా కమ్యూనిస్టు భయాన్ని రేకెత్తించడానికి గానూ సోషలిజాన్ని ఉపయోగించుకునే దేశంలో ఇలాంటి ఫలితాలు ప్రాముఖ్యతను కలిగి వుంటాయి.
ఉత్పత్తి సాధనాలకు సంబంధించిన ప్రభుత్వ యాజమాన్యం కంటే యురోపియన్ సామాజిక ప్రజాస్వామ్యానికి సన్నిహితంగా వుండే తిరుగులేని డెమోక్రటిక్ సోషలిజంతో శాండర్స్ రెండు అధ్యక్ష ఎన్నికల ప్రచారాలను నిర్వహించారు. ఆ ప్రచారాలే ఈ పునాదిని సిద్ధం చేశాయి. అదే సమయంలో ప్రజా ప్రతినిధుల సభ ఎన్నికల్లో డెమోక్రటిక్ పట్టుగొమ్మగా వున్న ప్రాంతాల్లో అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటివారు తమ ఎన్నికల సామర్ధ్యాలను ప్రదర్శించారు. 2026లో, కొత్త తరం డెమోక్రటిక్ సోషలిస్టులు తమ పద్దతులకు, ప్రజలను చేరే విధానాలకు మరింత పదును పెట్టారు. అందుబాటు ధరల్లో బాలల సంరక్షణ, అద్దెల స్తంభన, అందరికీ వైద్య సంరక్షణ, సంపన్నులపై పన్ను విధింపు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ, మరోవైపు ఇజ్రాయిల్ మిలటరీకి నిధులను సమకూర్చడంతో పాటూ డెమోక్రటిక్ పార్టీ విదేశాంగ విధానం ఏకాభిప్రాయాన్ని ఛేధించడం వంటి అంశాలు వారిని న్యూయార్క్ వంటి కంచుకోటలను దాటి ముందుకు తీసుకువెళ్ళాయి. ఈ కొత్త వర్గం లేదా సమూహం ప్రైమరీలను మాత్రమే గెలుచుకోలేదు, చాలామంది అమెరికన్ల రాజకీయ దృక్పథంలో మార్పును కూడా తీసుకువచ్చింది. అయితే జాగ్రత్త తప్పదు. నవంబరులో రిపబ్లికన్ యంత్రాంగాన్ని ఎదుర్కొనడం మరింత కఠినమైన కర్తవ్యంగా వుండనుంది. ముఖ్యంగా ట్రంపిజానికి వ్యతిరేకంగా తన తిరుగుబాటుదారులకు డెమోక్రటిక్ నాయక త్వ వ్యవస్థ మద్దతును ఇవ్వకపోతే పరిస్థితి క్లిష్టమే. అయినప్పటికీ, మద్దతుదారులు ప్రజాదరణ సరిగా లేని ట్రంప్‌ను తీవ్రంగా ఎత్తిచూపుతున్నారు. పైగా రిపబ్లికన్లు రెచ్చగొడుతునే వుండే సంక్షేమానికి తొలి ప్రాధాన్యతనిచ్చే సందేశాన్ని మద్దతుదారులు ఎత్తి చూపిస్తున్నారు. భారతీయులతో సహా అంతర్జాతీ య తృతీయ ప్రపంచ దేశాలకు (గ్లోబల్ సౌత్) ప్రజాస్వామ్య సామ్యవాదం అమెరికాలో ఒక క్రియాశీల, చైతన్యశీల శక్తిగా ఆవిర్భవించడం స్వాగతించాల్సిన అంశమే, అమెరికా సాగించే అంతులేని యుద్ధాలకు ముగింపు పలకడంతో పాటూ న్యాయమైన వాణిజ్యం, బహుముఖ కార్యకలాపాలపై దీని ప్రాధాన్యత ఆధారపడి వుంది.








కామెంట్‌లు (0)