వాషింగ్టన్ : ఇరాన్‌పై దాడి ప్రణాళికలను రద్దు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ప్రతిపాదిత ఒప్పందంపై చర్చలకు వీలు కల్పించేందుకు ఇరాన్, పలు మధ్యప్రాచ్య దేశాలు విరామం కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని, అయితే "ఒప్పందంలో ప్రాథమిక అంశాలు ఖరారయ్యాయని తెలియగానే ఆ ఆపరేషన్‌ను నిలిపివేయడానికి అంగీకరించిందని ట్రంప్ తన సోషల్‌మీడియా ‘ట్రూత్’లో శనివారం పేర్కొన్నారు. ప్రతిపాదిత ఒప్పందంలో హార్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముగించడం వంటి అంశాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. మధ్యవర్తులు ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కృషి చేస్తున్నప్పుడు సైనిక చర్యను వాయిదా వేయాలనే నిర్ణయంలో ఇజ్రాయిల్ కూడా చేరిందని ఆయన తెలిపారు. ఇంధన మౌలిక సదుపాయాలతో సహా ఇరాన్ లక్ష్యాలపై వాషింగ్టన్ భారీ దాడులను పరిశీలిస్తోందన్న నివేదికల నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. సౌదీ ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్‌తో జరిపిన ఫోన్ సంభాషణలో ఈ ప్రణాళికల గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికా ఉద్దేశాలపై సౌదీ అరేబియా స్పష్టత కోరిందని, దాడులకు దిగకుండా ఉద్రిక్తతలను తగ్గించాలని కూడా అమెరికాను కోరినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సైనిక చర్యకు వ్యతిరేకంగా ఇరాన్ హెచ్చరికను పునరుద్ఘాటించింది
అమెరికా,ఇజ్రాయిల్‌ల సైనిక చర్యలకు ప్పతిస్పందన తప్పదు : ఇరాన్ హెచ్చరిక
తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను, జాతీయ భద్రతను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తన సౌదీ సహచర మంత్రికి తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపే ఏ శత్రుపూరిత చర్యకైనా, లేదా అటువంటి కార్యకలాపాలలో ప్రాంతీయ దేశాలు పాల్గొన్నా, ఇరాన్ సాయుధ దళాల నుండి "నిర్ణయాత్మక, తగిన ప్రతిస్పందన" ఉంటుందని ఆయన హెచ్చరించారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా నివారించే దౌత్య ప్రయత్నాలలో భాగంగా, టర్కీ, పాకిస్తాన్ అధికారులతో చర్చలు జరిపినట్లు అరాఘ్చీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్, అమెరికాల మధ్య మధ్యవర్తిత్వ ప్రయత్నాలలో పాలుపంచుకుంటున్న పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు.
ఇరాన్ తీసుకునే ఏ ప్రతీకార చర్య అయినా గల్ఫ్ ప్రాంతానికి కూడా విస్తరిస్తుందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత మరియు విదేశాంగ విధాన కమిటీ ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ పేర్కొన్నారు. అన్ని శత్రు స్థావరాలను, దాడి చేసే ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన తెలిపారు. విద్యుత్ ప్లాంట్లు, చమురుశుద్ధి కేంద్రాలు సహా ఇరాన్ ఇంధన సౌకర్యాలపై దాడుల గురించి అమెరికా, ఇజ్రాయిల్‌లు చర్చించాయని వచ్చిన నివేదిక పై ఆయన ఈ విధంగా స్పందించారు.
కొనసాగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు
సైనిక ఉద్రిక్తతలతో పాటు దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఒమన్, పాకిస్తాన్ దేశాలు ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించే లక్ష్యంతో చర్యలు చేపట్టాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నంలో, ఖతార్ మధ్యవర్తులు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, ఒమన్ అధికారులతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పురోగతి కనిపించిందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే మరిన్ని చర్చలు జరగాల్సి ఉందా లేదా అనేది తెలియాల్సి వుందని అన్నారు.








కామెంట్‌లు (0)