మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionట్రంప్‌ యూ టర్న్‌

1 గంట క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇరాన్‌‌తో చర్చలకు తెర

వాషింగ్టన్‌, టెహ్రాన్‌ : ప్రస్తుతం ఇరాన్‌‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని, జరగాల్సిన షెడ్యూల్‌ ‌కూడా లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‌తెలిపారు. ఈ మేరకు ‌మంగళవారం సాయంత్రం ఆయన స్వీయ సామాజిక సంస్థ అయిన ట్రూత్‌ ‌సోషల్‌లో ఒక పోస్టు పెట్టారు. ఇరాన్‌ ‌నౌకలపై, ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతోందని చెప్పారు. హర్మూజ్‌ ‌జలసంధి తెరిచే వుందని, నౌకల రాకపోకలు జరుగుతున్నాయని చెప్పారు. జలసంధిలో గల మందుపాతరలను తొలగించడమో లేదా పేల్చివేయడమో చేశామని చెప్పారు. ఇరాన్‌‌తో దొడ్ది దారిన చర్చలు జరుగుతున్నాయని చెప్పిన మరునాడే ట్రంప్‌ ‌తన మాటల నుండి వెనక్కి మళ్లారు. ఇరాన్‌‌తో ఎటువంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు.

అమెరికా ఒత్తిళ్లకు ఇరాన్‌ ఎన్నటికీ లొంగదు..: అబ్బాస్‌ ‌అరగ్చి

అమెరికా ఒత్తిళ్లకు ఎన్నటికీ లొంగే ప్రసక్తే లేదని ఇరాన్‌ ‌స్పష్టం చేసింది. ‘ఈ యుద్ధంలో ఇరాన్‌ ‌లొంగిపోయేలా చేయాలనేది అమెరికా లక్ష్యంగా వుంది. కానీ ఇరాన్‌ ఎన్నటికీ లొంగదు’ అని ఇరాన్‌ ‌విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగ్చి స్పష్టం చేశారు. ‘‘అమెరికా ఇప్పడు మా షరతుల ప్రకారం మాతో చర్చలు జరపడానికి ప్రాధేయపడుతోంది.’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో కుదిరిన అవగాహనా ఒప్పందంలో ఇరాన్‌‌కు అనుకూలంగా 13 నిబంధనలు వున్నాయని, ఒకటి వారికి అనుకూలంగా వుందని చెప్పారు. కానీ ఇజ్రాయిల్‌ ‌ఆ ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేయాల్సిందంతా చేసిందని, దాని అమలును అడ్డుకుందని ఇజ్రాయిల్‌‌ను విమర్శించారు. ‘‘మేం యుద్ధాన్ని గెలిచాం. దౌత్యంలో కూడా మాదే విజయం, మా షరతులను ఆమోదించాలని మేం శత్రువుపై ఒత్తిడి తెచ్చాం.’’ అని అబ్బాస్‌ అరగ్చి చెప్పారు. ఇరాన్‌కు సైనికపరంగా, కదనరంగంలో వున్న శక్తి సామర్ధ్యాలు కలిసి తమకు ఈ దౌత్య బలాన్ని ఇచ్చాయని అన్నారు.

ఇజ్రాయిల్‌ ‌దాడులను ఖండన

ఇడిలిబ్‌‌లో సిరియా వైమానిక స్థావరం లక్ష్యంగా ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు జరపడాన్ని ఖతార్‌ ‌తీవ్రంగా ఖండించింది. ఆ దాడుల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఖతార్‌ ‌విదేశాంగ శాఖ ఎక్స్‌‌లో పోస్టు పెట్టింది. ఈ ప్రాంతంలోని దేశాల సార్వభౌమాధికారాలను లెక్కచేయకుండా ఇజ్రాయిల్‌ ఉల్లంఘనలకు పాల్పడుతునే వుంది. ఒక పద్ధతి ప్రకారం అంతర్జాతీయ చట్టబద్ధతను ఉల్లంఘిస్తూ, బలవంతంగా అనివార్యమైన వాస్తవ పరిస్థితులను రుద్దే ఒక ప్రమాదకరమైన ధోరణిని అవలంబిస్తోందని ఆ పోస్టు విమర్శించింది. సిరియాకు బాసటగానే వుంటామని, సిరియా సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు అవసరమైన ప్రతి చర్యకు మద్దతిస్తుందని స్పష్టం చేసింది.

గూడు చెదిరిన 8.6 లక్షల లెబనీయన్లు : యుఎన్‌‌హెచ్‌‌సిఆర్‌

ఇజ్రాయిల్‌ ‌వైమానిక బాంబుదాడుల కారనంగా లెబనాన్‌‌లో 8.6 లక్షల మంది ప్రజలు తాము ఉంటున్న ఇళ్లు కోల్పోయి..వేరే ప్రాంతాలకు చెల్లాచెదరుగా బతుకుజీవుడా అంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ‌హైకమిషనర్‌ (‌యుఎన్‌‌హెచ్‌‌సిఆర్‌) ‌కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పరిస్థితి మెల్లమెల్లగా కుదుటపడుతోందని..కానీ సంక్షోభం ఇప్పుడప్పుడే సమసిపోయేలా లేదని పేర్కొంది. ‘ఇజ్రాయిల్‌ ‌దాడుల కారణంగా 8.6 లక్షల మంది గూడు కోల్పోయారు. వీరంతా ఇప్పుడిప్పుడే తమ ప్రాంతాలకు తిరిగివస్తున్నారు. ఇంకా 3.6 లక్షల మంది ఇంకా నిరాశ్రయులుగానే ఉన్నారు. వీరిలో 22 వేల మంది వివిధ ప్రాంతాల్లో సహాయక శిబిరాల్లో ఉంటున్నారు. మరికొందరు బంధువుల ఇళ్లలోనో..ఇతర తెలిసినవారి అపార్టుమెంటుల్లోనూ తలదాచుకుంటున్నారు’ అని యుఎన్‌‌హెచ్‌‌సిఆర్‌ ‌పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్