- డబ్ల్యుటిఒ నిబంధనలకు విరుద్ధం
- బ్రిక్స్ దేశాల ఆందోళన
- అమెరికా పేరు ప్రస్తావించకుండానే బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సంయుక్త ప్రకటన
న్యూఢిల్లీ : వాణిజ్యాన్ని దెబ్బతీసే రీతిలో ఏకపక్షంగా టారిఫ్‌లు, టారిఫ్‌యేతర చర్యలను విధించడంపై బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు (ఎఫ్‌ఎంసిబిజి) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. స్థానిక కరెన్సీల్లో సరిహద్దు ఆవలి చెల్లింపులను పెంచేందుకు ఆచరణాత్మక పరిష్కారాల కోసం వారు పిలుపునిచ్చారు. ఇటువంటి విషయాల్లో జాతీయ ప్రాధాన్యతల ప్రాముఖ్యతను కూడా వారు గుర్తించారు. అన్ని రకాల సందర్భాలకు, సమస్యలకూ ఒకే పరిష్కారం సాధ్యం కాదని చెప్పారు. బ్రిక్స్ చైర్మన్‌గా భారత్ ఆధ్వర్యాన ఆగస్టు 12న జైపూర్‌లో తొలి ఎఫ్‌ఎంసిబిజి సమావేశం జరిగింది. రెండో సమావేశం ముంబయిలో బుధ, గురువారాల్లో జరిగింది. అనంతరం శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
టారిఫ్‌లపై ఆందోళన
టారిఫ్‌లను పెంచుతూ, టారిఫ్‌యేతర చర్యలు తీసుకోవడంతో సహా వాణిజ్యం, ఆర్థిక సంబంధిత చర్యలను ఏకపక్షంగా అమలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు బ్రిక్స్ దేశాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ చర్యల వల్ల వాణిజ్యం దెబ్బతింటుందని, పైగా ఇవేవీ కూడా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) నిబంధనలకు అనుగుణంగా లేవని విమర్శించాయి. కొత్తగా ఆవిర్భవిస్తున్న మార్కెట్లపై, వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఈ ఒత్తిళ్లు ఎక్కువగా వుంటున్నాయని పేర్కొంది. ప్రత్యేకంగా అమెరికా పేరును సంయుక్త ప్రకటన ప్రస్తావించలేదు. తన వాణిజ్య భాగస్వాములపై అసాధారణ రీతిలో ఏకపక్షంగా, తరచుగా లెవీలు విధిస్తున్న ఏకైక దేశం అమెరికా ఒక్కటే. డబ్ల్యుటిఓ కేంద్రంగా పారదర్శకమైన, బాహాటమైన, అందరినీ కలుపుకుని పోయే, వివక్షా రహితమైన, నిబంధనల ప్రాతిపదికన నడిచే బహుముఖ వాణిజ్య వ్యవస్థకు బ్రిక్స్ మద్దతు పూర్తి స్థాయిలో వుంటుందని బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు పునరుద్ఘాటించారు.
స్థానిక కరెన్సీలో వాణిజ్యం
సమర్ధమైన రీతిలో సరిహద్దు ఆవలి చెల్లింపుల యంత్రాంగాల కోసం ఆచరణాత్మక పరిష్కారాలకై బ్రిక్స్ చెల్లింపుల టాస్క్ ఫోర్స్ (బిపిటిఎఫ్) అన్వేషిస్తున్న ప్రయత్నాలను ఎఫ్‌ఎంసిబిజి గుర్తించింది. ఇందుకోసం బ్రిక్స్ దేశాల స్థానిక కరెన్సీలను ఉపయోగించి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం, పెట్టుబడులు పెట్టడంపై చర్చలు, సంప్రదింపులు జరిగాయని, ఇంతవరకు జరిగిన కృషిపై అధ్యయనం కూడా జరిగిందని తెలిపింది. ఆయా దేశాల జాతీయ ప్రాధాన్యతలను గౌరవిస్తూ, అన్ని సందర్భాల్లోనూ అన్ని సమస్యలకూ ఒకే పరిష్కార మార్గం వర్తించబోదని సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది.
అభివృద్ధికి కొత్త టాస్క్ ఫోర్స్
బ్రిక్స్ దేశాలు, కొత్తగా ఆవిర్భవిస్తున్న మార్కెట్లు, వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఉమ్మడి వృద్ధి, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించేందుకు ఒక వేదికగా బ్రిక్స్ టాస్క్ ఫోర్స్‌ను భారత్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం తన అధ్యక్ష పదవిని ఉపయోగించుకుంది. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి బహుముఖ రుణ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడం, బ్రిక్స్ దేశాల మధ్య పన్నులు, కస్టమ్స్ సహకారం, సెంట్రల్ బ్యాంక్ సామర్ధ్యాల పెంపు, సైబర్ భద్రత, కృత్రిమ మేథస్సు, ఆర్థిక, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి పలు రంగాల్లో బ్రిక్స్ దేశాల మధ్య చర్చలను ఈ సంయుక్త ప్రకటనలో పొందుపరిచారు.








కామెంట్‌లు (0)