50 శాతం టారిఫ్‌లకు ట్రంప్ సర్కారు సిద్ధం
వాషింగ్టన్: అమెరికా-కెనడా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ నిలిపివేశారు. చివరి దశలో అమెరికా ప్రతిపాదించిన కొత్త షరతులు అన్యాయంగా, కెనడాకు ఆర్థికంగా నష్టదాయకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కెనడా నుంచి దిగుమతి అయ్యే సుమారు 2,000 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధించేందుకు అమెరికా సిద్ధమైంది.
అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ మాట్లాడుతూ.. కెనడాకు ఇతర ప్రధాన ఎగుమతి దేశాల కంటే మెరుగైన వాణిజ్య సదుపాయాలు కల్పించేందుకు అమెరికా ముందుకొచ్చిందన్నారు. అయితే కెనడా చివరి నిమిషంలో కొత్త డిమాండ్లు చేయడంతోపాటు గతంలో ఇచ్చిన కొన్ని హామీల నుంచి వెనక్కి తగ్గిందని ఆరోపించారు. అమెరికా చివరి నిమిషంలో నిబంధనలు మార్చడం న్యాయబద్ధంగా లేదని కెనడా ప్రధాని కార్నీ విమర్శించారు. కొత్త షరతుల వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. టారిఫ్‌ల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కెనడా కార్మికులు, వ్యాపారాలకు అదనపు మద్దతు అందిస్తామని ప్రకటించారు.
అమెరికా ప్రతిపాదించిన 50 శాతం టారిఫ్‌లు కెనడా నుంచి అమెరికాకు ఏటా జరిగే మొత్తం ఎగుమతుల్లో దాదాపు 5 శాతంపై ప్రభావం చూపనున్నాయి. హాకీ స్టిక్స్ నుంచి వైద్య పరికరాల వరకు పలు ఉత్పత్తులు దీని పరిధిలోకి రానున్నాయి.
చర్చలకు అవకాశం కల్పిస్తూ ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ గడువును మూడు రోజులు పొడిగించినప్పటికీ.. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. గత ఏడాది అమెరికా-కెనడా మధ్య వస్తువులు, సేవల వాణిజ్యం 880 బిలియన్ డాలర్లకు చేరింది. కెనడా మొత్తం ఎగుమతుల్లో దాదాపు 72 శాతం అమెరికాకే వెళ్తుండటంతో తాజా పరిణామాలు కెనడా ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదాలు ఉన్నప్పటికీ అమెరికా, కెనడా సన్నిహిత మిత్రదేశాలుగా కొనసాగుతున్నాయి. అయితే కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తాజాగా టారిఫ్‌ల పెంపు నిర్ణయాలు రెండు దేశాల మధ్య సంబంధాల్లో మరింత ఉద్రిక్తతలకు కారణమయ్యాయి.








కామెంట్‌లు (0)