- వద్దేవద్దంటూ వరుస ఆందోళనలు
- ఇప్పటికే విద్యుత్ ఛార్జీల భారం
- పర్యావరణానికి ముప్పేనంటూ నిపుణుల హెచ్చరిక
వాషింగ్టన్ : అమెరికాలో కొత్తగా ఎఐ డేటా సెంటర్ల నిర్మాణం పట్ల దేశ ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పర్యావరణం, ప్రజలపై డేటా సెంటర్లు కలిగించే ప్రభావం పట్ల తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. డేటా సెంటర్లకు అధిక విద్యుత్ లోడ్ అవసరం ఆ భారాన్ని కూడా ప్రజలపై మోపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎఐ డేటా సెంటర్ల నిర్మానం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో వాటికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వీటిని సమర్థిస్తున్నారు. ఉద్యోగాలు అదనంగా వస్తాయని, జాతీయభద్రత వుంటుందని ప్రజలను వంచనకు గురి చేస్తున్నారు. దీంతో ఏదో రూపంలో ప్రజలు డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తూనేవున్నారు. ట్రంప్ మద్దతిస్తున్న ఈ సెంటర్లు ఈ ఏడాది మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో కీలకమైన అంశంగా ప్రజల ముందుకు రానుంది. తమకు సమీపంలో వున్న డేటా సెంటర్లను 70 శాతానికి పైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఇటీవల ఎన్నికల్లో వెల్లడైందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. గతంలో ఎఐకి మద్దతిచ్చిన గవర్నర్లు, అభ్యర్ధులు తమ అభిప్రాయాలను మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపింది. పర్యావరణపరమైన ప్రభావాలతో పాటూ ప్రధానంగా విద్యుత్ రంగంపై ఒత్తిడి పెరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డేటా సెంటర్లు పవర్ గ్రిడ్‌పై కలిగించే భారం, పైగా ఇటువంటి కేంద్రాలు విచ్చలవిడిగా పెరగడం అధిక విద్యుత్ బిల్లులు రావడానికి దారి తీస్తుందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో విద్యుత్ చార్జీలు బాగాపెరిగాయి. గత ఐదేళ్ళలో అమెరికాలో సగటు విద్యుత్ వ్యయం 35 శాతానికి పైగా పెరిగిందని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ పేర్కొంటోంది. కేవలం డేటా సెంటర్లు ఒక్కటే కారణం కాదని విద్యుత్ పరిశ్రమ చెబుతున్నా ప్రజలు మాత్రం అంగీకరించడం లేదని వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. గత మార్చిలో ట్రంప్ తీసుకువచ్చిన ’వినియోగదారుల రక్షణ ప్రతిజ్ఞ’పై సంతకాలు చేసేందుకు ప్రధాన టెక్ కంపెనీలన్నీ వైట్‌హౌస్‌కు వచ్చాయి. పరిస్థితులతో సంబంధం లేకుండా మొత్తంగా ఇంధన, మౌలిక సదుపాయాల భారాన్ని పూర్తిగా చెల్లించాల్సిందేనని ఆ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యంగా వుంది. అయితే దానివల్ల పెద్దగా ఉపయోగమేమీ లేదని దాన్ని అమలు చేసే యంత్రాంగమేదీ లేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. డేటా సెంటర్ల వల్ల తలెత్తే విస్తృత పర్యావరణ ప్రభావాలపై ప్రతిపక్షం తీవ్రంగా ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. సాగు భూములు హరించుకుపోతాయని, నీటి సరఫరాలు క్షీణిస్తాయని పేర్కొంటున్నారు. మన గాలి, నీరును కలుషితం చేయడమే కాకుండా వాటివల్ల శబ్ద కాలుష్యం కూడా ఎక్కువగానే వుంటుందని పేర్కొంటున్నారు.







కామెంట్‌లు (0)