- మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
ప్రజాశక్తి - హైదరాబాద్ : తెలంగాణ సాంకేతికత, లైఫ్ సైన్సెస్, స్టార్టప్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఫార్మా రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, 1ఎం1బి ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి ‘గ్రీన్ స్కిల్స్ అండ్ అప్లైడ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళికను సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఆవిష్కరించారు. ఆగస్టు 2026 నాటికి కార్యకలాపాలు ప్రారంభించనున్న ఈ కేంద్రం ద్వారా దేశంలోనే తొలి గ్రీన్ స్కిల్స్ అండ్ అప్లైడ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య మానవ వనరులను తీర్చిదిద్దే కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా గ్రీన్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కృత్రిమ మేధస్సు ఆధారిత నైపుణ్యాలను పెంపొందించి, పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను తయారు చేయడమే లక్ష్యమని తెలిపారు. మైక్రోసాఫ్ట్, 1ఎం1బి ఫౌండేషన్ వంటి ప్రపంచస్థాయి సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పరచుకున్న భాగస్వామ్యం రాష్ట్రాన్ని ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మరింత బలోపేతం చేస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు.








కామెంట్‌లు (0)