గృహ రుణంపై రూ.3 లక్షల భారం..!
ఇఎంఐ రూ.817 వరకు పెరగొచ్చు
వడ్డీ రేట్ల పెంపు ఎఫెక్ట్
ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చడంతో రుణగ్రహీతలు ఇక అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేటు గృహ రుణాలు తీసుకున్న వారికి రుణ భారం పెరగనుంది. ఉదాహరణకు రూ.50 లక్షల రుణంపై వడ్డీ రేటు 7.5 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగితే.. 25 ఏళ్ల కాలపరిమితి ఉన్న రుణంపై నెలవారీ ఇఎంఐ సుమారు రూ.817 వరకు పెరిగి రూ.37,766కు చేరే అవకాశం ఉంది. ఇదే వడ్డీ రేటు, కాలపరిమితి కొనసాగితే రుణ కాలంలో మొత్తం వడ్డీ వ్యయం సుమారు రూ.2.45 లక్షల వరకు అదనంగా పెరగొచ్చు. 20 ఏళ్ల కాలపరిమితి రుణంలో నెలవారీ ఇఎంఐ సుమారు రూ.780–800 మేర, 30 ఏళ్ల రుణంలో సుమారు రూ.850–870 మేర పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాల్లో ఈ అదనపు వడ్డీ భారం రూ.3 లక్షలు దాటే అవకాశమూ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎఫ్‌డిలపై లాభాలు..
రెపో రేటు పెంపు ప్రభావం ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) ఖాతాదారులకు మాత్రం సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కొనసాగుతున్న ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లు సాధారణంగా మారవు. అవి డిపాజిట్ చేసిన సమయంలో నిర్ణయించిన వడ్డీ రేటు, కాలపరిమితి ప్రకారమే కొనసాగుతాయి. అయితే కొత్తగా ఎఫ్‌డి చేసే వారికి లేదా మెచ్యూరైన డిపాజిట్లను పునరుద్ధరించుకునే వారికి బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందించే అవకాశం ఉంటుంది. బ్యాంకులు రెపో రేటు పెంపును పూర్తిగా డిపాజిట్లకు బదిలీ చేస్తే ప్రతి రూ.10 లక్షల ఎఫ్‌డిపై ఏడాదికి 25 బేసిస్ పాయింట్ల మేర అంటే సుమారు రూ.2,500 అదనపు వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. అదే రూ.50 లక్షల కొత్త ఎఫ్‌డిపై ఏడాదికి పన్నుకు ముందు సుమారు రూ.12,500 అదనపు వడ్డీ రావొచ్చు. మొత్తంగా ఆర్‌బిఐ రెపో రేటు పెంపు ప్రభావం రుణాలు తీసుకున్నవారికి ఖర్చును పెంచగా.. కొత్తగా డిపాజిట్లు చేసే మదుపర్లకు అధిక వడ్డీ ఆదాయానికి అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక గృహ రుణాలు ఉన్నవారిపై వడ్డీ రేటు పెంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
మార్కెట్లకు వడ్డీ రేట్ల సెగ
ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లను పెంచడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. ఈ పరిణామంతో గత రెండు సెషన్లుగా కొనసాగిన లాభాల ర్యాలీకి బ్రేక్ పడింది. రెపో రేటును 5.5 శాతానికి పెంచుతూ ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయంతో ముఖ్యంగా మెటల్, రియాల్టీ రంగాల షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రంగాలలో అమ్మకాల ఒత్తిడి వ్యక్తమవడంతో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. బుధవారం సెషన్‌లో సెన్సెక్స్ రోజంతా ప్రతికూలతలోనే కదలాడి ఇంట్రాడేలో 72,469 కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 429.11 పాయింట్లు కోల్పోయి 72,639కి పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 173 పాయింట్లు పతనమై 22,603 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.77గా కొనసాగింది. సెన్సెక్స్-30 జాబితాలో కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు మాత్రమే లాభపడగా.. మిగతా కంపెనీలన్నీ నష్టాలను చవి చూశాయి.






కామెంట్‌లు (0)