ప్రపంచ టెక్ రంగంలో వేటు
భారత్‌లోనూ 35 వేల సిబ్బందికి ముప్పు
న్యూఢిల్లీ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల భద్రత గాల్లో దీపంలా మారింది. మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు చోటు చేసుకున్నాయి. కృత్రిమ మేధ (ఎఐ) ప్రభావంతో సెగ మొదలైంది. కరోనా అనంతర పరిస్థితుల్లో తలెత్తిన ఆర్థిక మందగమనం వల్ల గతంలో ఉద్యోగాల కోత జరిగినప్పటికీ.. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎఐ ప్రభావంతో దిగ్గజ టెక్ సంస్థలు ఇటీవల తమ పనితీరును పూర్తిగా మార్చుకుంటున్నాయి. యాజమాన్యాలు రికార్డు స్థాయి ఆదాయాలను ఆర్జిస్తున్నప్పటికీ, సంస్థాగత నిర్మాణాన్ని మార్చడం, రోజువారి పనులను ఆటోమేషన్ చేయడం ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ‘లేఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ’ ట్రాకర్ గణాంకాల ప్రకారం.. 2026లో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,20,000 టెక్ ఉద్యోగాలు రోడ్డున పడ్డారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, మెటా, సిస్కో, అమెజాన్, డెల్, పేపాల్ వంటి దిగ్గజ సంస్థలు వేలాది ఉద్యోగాలను తగ్గిస్తూనే ఎఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
ఈసారి ఉద్యోగాల కోతలకు కారణం డిమాండ్ తగ్గడం కంటే సంస్థల పునర్వ్యవస్థీకరణే ఎక్కువగా కనిపిస్తోందని స్పష్టమవుతోంది. కంపెనీలు పనులను ఆటోమేట్ చేస్తూ నిర్వహణ వ్యయాల స్థాయిలను తగ్గిస్తూ ఎఐ ఆధారిత పని విధానాలకు మారుతున్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్, సపోర్ట్, మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో అవసరం తగ్గుతోంది. అదే సమయంలో ఎఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులపై డిమాండ్ పెరుగుతోంది. చాలా ఉద్యోగాలు పూర్తిగా తగ్గిపోవడం కంటే వాటి స్వరూపం మారిపోతోందని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లోనూ గడ్డుకాలం..!
ఎఐ ప్రభావం భారత ఐటి రంగంపైనా స్పష్టంగా కనిపిస్తోంది. టీమ్‌లీజ్, సిఐఇఎల్ హెచ్‌ఆర్ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది దేశీయ ఐటి రంగంలో 25,000 నుంచి 35,000 ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే 10 వేల నుంచి 15 వేల మంది వరకు ‘సైలెంట్ లేఆఫ్స్’ ద్వారా ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. టిసిఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్‌టెక్, విప్రో, టెక్ మహీంద్రా వంటి అగ్ర సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగ కోతలు బహిరంగ ప్రకటనల రూపంలో కాకుండా పనితీరు ఆధారిత తొలగింపులు, విభాగాల పునర్వ్యవస్థీకరణ రూపంలో జరుగుతున్నాయి.
కొత్త నియామకాల్లో అనిశ్చితి
ఇక కొత్తగా ఉద్యోగాల్లోకి రావాల్సిన ఇంజినీరింగ్ పట్టభద్రులపై కూడా ఈ మార్పుల ప్రభావం పడుతోంది. కొన్ని ప్రముఖ ఐటి సంస్థలు చేరికలను వాయిదా వేయడం.. కొన్ని ఉద్యోగ ఆఫర్లను ఉపసంహరించుకోవడం వంటి చర్యలు తీసుకోవడంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో కూడా అనిశ్చితి నెలకొంది. టిసిఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఒరాకిల్ వంటి సంస్థలు నియామక ప్రక్రియను ఆలస్యం చేయడం లేదా ఆఫర్లను నిలిపివేయడం వల్ల, విద్యార్థులు సంప్రదాయ ఐటి సేవల సంస్థల కంటే ప్రొడక్ట్ కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నారని ప్లేస్‌మెంట్ అధికారులు చెబుతున్నారు.
తక్కువ మందితో ఎక్కువ ఉత్పత్తి
టెక్ రంగంలో ఉద్యోగాల భవిష్యత్తు ఇప్పుడు ఎఐ ఆధారిత మార్పులపై ఆధారపడి ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ ఉత్పాదకత సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. అందువల్ల ఉద్యోగ భద్రత కోసం సాంకేతిక నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవడం, కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా మారడం తప్పనిసరిగా మారింది. రాబోయే రోజుల్లో ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవ్వకపోయినా ఎఐతో కలిసి పనిచేయగల నైపుణ్యాలున్న వారికే ఎక్కువ అవకాశాలు దక్కే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని ఇప్పటికే అనేక రిపోర్టులు వెల్లడించాయి.








కామెంట్‌లు (0)