డార్క్ వెబ్‌లో ఖాతాదారుల వివరాలు
ముంబయి : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి)కి చెందిన కీలక ఖాతాదారుల డేటా, అంతర్గత పత్రాలు డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమైనట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు, సైబర్ నిపుణులు వెల్లడించారు. లీకైన సమాచారంలో కస్టమర్ల వ్యక్తిగత వివరాలు, గుర్తింపు పత్రాలు, రుణ దస్త్రాలు, అంతర్గత ఆడిట్ రికార్డులు ఉన్నట్లు క్యాష్‌లెస్ కన్స్యూమర్ వ్యవస్థాపకుడు, సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు శ్రీకాంత్ ఎల్ తెలిపారు. ఈ ఘటనపై బ్యాంకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎంతమంది ఖాతాదారులు ప్రభావితమయ్యారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ప్రాథమిక అంచనాల ప్రకారం బ్యాంకు ఈమెయిల్ వ్యవస్థలో చొరబాటు ద్వారా ఈ డేటా బయటకు వెళ్లి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. డార్క్ వెబ్‌లోని మెటాడేటా ఆధారంగా ఈ సమాచారం శనివారం రాత్రి ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైనట్లు ఇందులో 700 గిగాబైట్లకు పైగా డేటా ఉన్నట్లు శ్రీకాంత్ తెలిపారు. అయితే ఈ వివరాలను బ్యాంకు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ ఘటనపై బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్‌బిఐ, దేశ సైబర్ భద్రతా సంస్థ సెర్ట్-ఇన్ నుంచి తక్షణ స్పందన రాలేదు. భారీ మొత్తంలో ఖాతాదారులు, వ్యాపార సమాచారాన్ని నిర్వహించే బ్యాంకులు, సంస్థలకు పెరుగుతున్న సైబర్ ముప్పులకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవల టాటా ఎలక్ట్రానిక్స్‌పై సైబర్ దాడి, దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఫైళ్లను ర్యాన్సమ్‌వేర్ గ్రూప్ డార్క్ వెబ్‌లో ఉంచిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఘటనలో అసలు డేటా ఎంత మేరకు లీకైంది. కస్టమర్లపై ఏ స్థాయిలో ప్రభావం పడింది, దాడికి కారణం ఏమిటన్నది ఫోరెన్సిక్ దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.








కామెంట్‌లు (0)