- ఎస్‌అండ్‌పి గ్లోబల్ ఎనర్జీ అంచనా
వాషింగ్టన్ : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల తాత్కాలికం కాదని ఎస్‌అండ్‌పి గ్లోబల్ ఎనర్జీ అంచనా వేసింది. సరఫరా అంతరాయాలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఆగస్టు 28న బ్యారెల్ ధర 88 డాలర్లుగా ఉండగా.. తాజాగా 108 డాలర్లను దాటింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, కీలక సముద్ర మార్గాల్లో దాడులు, చమురు నిల్వలు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. 2027 చివరి నాటికి కూడా పశ్చిమాసియా చమురు ఉత్పత్తి పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నివేదిక తెలిపింది. హర్మూజ్ జలసంధి, హౌతీ రెబెల్స్ ముప్పు కొనసాగితే సరఫరాపై ఒత్తిడి తప్పదని పేర్కొంది. యుద్ధానికి ముందు రోజుకు 20 మిలియన్ బ్యారెళ్లుగా ఉన్న మిడిల్ ఈస్ట్ చమురు, 2027 ఎగుమతులు వరకు నెలకు సగటున 10–16 మిలియన్ బ్యారెళ్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది. దీంతో 2027 వరకు ధరలు 80–100 డాలర్ల పరిధిలో ఉండొచ్చని విశ్లేషించింది. ఈ ఏడాది బ్రెంట్ సగటు 90 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగా 2027లో 86 డాలర్లుగా ఉండొచ్చని తెలిపింది. మరోవైపు రిఫైనింగ్ సామర్థ్యం తగ్గడం, రష్యా–ఉక్రెయిన్, అమెరికా–ఇరాన్ ఘర్షణల ప్రభావంతో చమురు డిమాండ్‌పై కొంత నియంత్రణ ఉంటుందని నివేదిక పేర్కొంది. చైనా దిగుమతులు తగ్గించుకోవడంతో నాలుగో త్రైమాసికంలో ప్రపంచ చమురు డిమాండ్ రోజుకు 80.2 మిలియన్ బ్యారెళ్లకు తగ్గవచ్చని అంచనా వేసింది. అయినప్పటికీ సరఫరా ఒత్తిళ్లు కొనసాగితే ధరలు మళ్లీ ఎగిసే అవకాశమే ఎక్కువగా ఉందని హెచ్చరించింది.








కామెంట్‌లు (0)